KTR Legal Notices to Media and Youtube channels: హైదరాబాద్: పలు టీవీ ఛానళ్ళతో పాటు యూట్యూబ్, సోషల్ మీడియా సంస్థలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లీగల్ నోటీసులు పంపించారు. కేవలం తనను, తన కుటుంబాన్ని బద్నాం చేయాలని అసత్య ప్రచారాలను, కట్టు కథలను ప్రచారం చేస్తున్న 10 టీవీ ఛానళ్లు, యూట్యూబ్, సోషల్ మీడియా సంస్థలకు కేటీఆర్ శనివారం (మార్చి 30న) లీగల్ నోటీసులు పంపించారు. తనతో పాటు తన ఫ్యామిలీకి నష్టం కలిగించాలన్న దురుద్దేశంతోనే ఈ చానళ్ళు, మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ తన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అసలు తమకు సంబంధమే లేని అనేక అంశాల్లో తమ పేరును, తమ ఫోటోలను వాడుకుంటూ అత్యంత హీనమైన తంబ్ నెయిల్స్ పెడుతున్న ఛానళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇవన్నీ కూడా ఒక పక్కా ఎజెండాలో భాగంగానే మీడియా ముసుగులో ఈ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.


చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోక తప్పదు
తమను ఇబ్బందులకు గురి చేయాలన్న కుట్రలో భాగమైన వారు చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కొనక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా తమకు, తమ కుటుంబానికి సంబంధంలేని అంశాలలో దుష్ప్రచారం చేస్తూ, పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని ఆ లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి అసత్యాలను వెంటనే తొలగించుకుంటే మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ ఛానల్ తో పాటు కొన్ని మీడియా సంస్థలు సైతం ప్లాన్ ప్రకారం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటి వాటికి లీగల్ నోటీసులు పంపించినట్లు కేటీఆర్ తెలిపారు. 


తప్పు దిద్దుకునేందుకు ఛాన్స్
ఇదివరకే కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ తమ తప్పును సరిదిద్దుకొని ఇలాంటి వీడియోలను, కంటెంట్ ను తీసివేశామని చెప్పాయని కేటీఆర్ తెలిపారు. వారం రోజుల్లోగా మిగతా మీడియా ఛానళ్లు, యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి కంటెంట్ ని తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపైన తమకు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని అంశాలపైన అసత్య ప్రచారం చేసే ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్స్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నారు. కేవలం ఆయా సంస్థలకే కాకుండా నేరుగా యూట్యూబ్ కి సైతం లీగల్ నోటీసులు పంపించామని కేటీఆర్ పేర్కొన్నారు. తమ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తూ అడ్డగోలుగా ప్రచారం చేస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ మరిన్ని లీగల్ నోటీసులకు, కేసులకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ హెచ్చరించారు.