Kadiyam Srihari to join Congress and T Rajaiah ready join BRS: వరంగల్: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కత్తులు నూరిన నేతలే ఆ పార్టీలో చేరుతున్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉండి అధికార పార్టీపై దుమ్మెత్తి పోసిన నేత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇక బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన నేత తిరిగి అదే పార్టీలో చేరబోతున్నారు. వారిద్దరూ ఒకే నియోజకవర్గానికి చెందిన నేతలు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా పని చేసిన నేతలు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య. అంతకుమించి వీరిద్దరూ ఓకే నియోజకవర్గంలో 20 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులు.
ఒకరు కాంగ్రెస్‌పై, మరొకరు బీఆర్ఎస్‌పై విమర్శలు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఒకరు పార్టీని ముందు వీడితే. మరొకరు ఒక్కరోజు ముందు పార్టీకి దూరమయ్యారు. వీరిలో ఒకరైన కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా ప్రతినిత్యం వహిస్తూ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఫలితాలు వెల్లడైన తరువాత నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో, సంవత్సరంలో కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ చర్చకు దారి తీశారు. ఇంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిపాలన విధానాలపై అసెంబ్లీలో తన మాటల దాడిని కొనసాగించారు. జనాల దృష్టిలో కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువుగా మారారు కడియం శ్రీహరి. కానీ తన శ్రేణులను కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు.
బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న కూతురు కడియం కావ్య ను పోటీ నుంచి తప్పించి కాంగ్రెస్ కడువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య రాకను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా స్టేషన్ ఘన్ పూర్ కాంగ్రెస్ ఇంఛార్జి సింగపురం ఇందిరా కడియం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టించి అనగదొక్కిన కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకోవద్దని ఇందిరా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా వరంగల్ పార్లమెంట్ టికెట్ కడియం కుటుంబీకులకు ఇవ్వవద్దని బహిరంగంగానే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు.
బీఆర్ఎస్‌ను వీడుతూ సంచలన వ్యాఖ్యలు
ఇక మరో నేత తాటికొండ రాజయ్య. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగిన రాజయ్య 2 నెలల కిందట బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీని వీడారు. అయితే రాజయ్య కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైనప్పటికీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈలోపు కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరుతుండడంతో ఇక రాజయ్య చేరిక కష్టంగా మారింది. ఇంతలోనే బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ పార్లమెంటుకు అభ్యర్థులు కరువు కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం తాటికొండ రాజయ్యను పార్టీలోకి ఆహ్వానించింది. పార్టీ అధినేత, ముఖ్య నేతలు రాజయ్యకు ఫోన్ చేసి పార్టీలోకి పిలవడంతోపాటు వరంగల్ పార్లమెంటు టికెట్ కేటాయిస్తామని రాజయ్యతో చర్చించినట్లు సమాచారం. అందుకు రాజయ్య సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ లోకి రావడానికి పెద్దగా వ్యతిరేకత లేదని చెప్పవచ్చు. వరంగల్ పార్లమెంటు టికెట్ పై ఆశలు పెట్టుకున్న ఒకరిద్దరు నేతలు తప్ప తాటికొండ రాజయ్యను వ్యతిరేకించేవారు ఎవరూ లేరు దీంతో తాటికొండ రాజయ్య టీఆర్ఎస్ లో చేరిక దాదాపు ఖరారు అయినట్టే తెలుస్తుంది.
ఏది ఏమైనా ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఒకరు బీఆర్ఎస్ పార్టీని దూషించి వీడి తిరిగి అదే పార్టీలోకి వస్తున్నారు. మరొకరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను ఓ రేంజ్ లో దూషించి.. అదే పార్టీలో చేరడానికి సిద్ధం కావడంతో వరంగల్ రాజకీయ ముఖచిత్రం మారిపోనుంది.