Jagan Fight For Opposition Leader Status : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ అధినేత జగన్ ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు రాసిన లేక వైరల్ అవుతోంది. అందులో ఆయన చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అదేమిటంటే.. సభలో పది శాతం సభ్యులు లేకపోయినా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని ఆయన అంటున్నారు. పది శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదని వాదిస్తున్నారు. తనను ఆటోమేటిక్ గా ప్రతిపక్ష నేతగా గుర్తించకుండా.. సీఎం ప్రమాణం అయిన వెంటనే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించకుండా అవమానించారని ఆయన అంటున్నారు. మరి నిజంగానే ప్రతిపక్ష హోదా రావాలంటే కనీస సభ్యుల సంఖ్య ఉండక్కర్లేదా ? చట్టం ఏం చెబుతుంది..?
లోక్‌సభ మొదటి స్పీకర్ రూలింగ్ - పది శాతం సభ్యుల నిబంధన
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖలో రాసినట్లుగా చట్టంలో ఎక్కడా లేదని చెప్పడం అసత్యమేనని నిపుణులు చెబుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి లోక్‌సభలో అప్పటి స్పీకర్ జీవీ మావలంకర్ .. కనీసం కోరంకు సరిపడే సభ్యులు ఉన్న పార్టీ చెందిన నేతకు మాత్రమే ప్రధాన ప్రతిపక్ష ఇవ్వాలని రూలింగ్ ఇచ్చారు. ఆ నిబంధన అలా కొనసాగుతూ వచ్చింది. సభ సమావేశం కావాలంటే పది శాతం మంది సభ్యులు హాజరవ్వాలి. దీన్ని కోరం అంటారు. కోరం బలం కూడా లేని పార్టీలను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేమని నాడు రూలింగ్ ఇచ్చారు. అయితే 1977లో చేసిన చట్టంలో చర్చలేదు. కానీ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ కొనసాగింది. 1988లో చేసిన పార్లమెంట్ ఫెసిలిటీస్ యాక్ట్ చట్ట సవరణలో లోక్‌సభలో మొదటి స్పీకర్ జీవీ మావలంకర్ రూలింగ్ చేర్చారు. అప్పటి నుంచి అది చట్టబద్దంగానే అమలవుతోంది.
'ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరా?' - స్పీకర్‌కు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ లేఖ
కేంద్రలోనే ప్రధాన ప్రతిపక్షం లేని సందర్భాలు
1980లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అప్పట్లో కాంగ్రెస్ తర్వాత అతి పెద్ద పార్టీగా జనతా దళ్ సెక్యులర్ 41 సీట్లతో నిలిచింది. ఆ పార్టీ నేతకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో పది శాతం సీట్లకు తగ్గట్లుగా 54 సీట్లను సాధించలేకపోయింది. ఫలితంగా ఆ పార్టీకి లోక్‌సభా పక్ష నేత.. ఉన్నారు కానీ.. ప్రధాన ప్రతిపక్షనేతగా గుర్తింపు పొంద లేకపోయారు.
స్పీకర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు !
ప్రతిపక్ష నేత పాత్ర కీలకమైనదే. స్పీకర్ పది శాతం సీట్లు లేకపోయినా ప్రతిపక్ష పార్టీని గుర్తించాలనుకుంటే గుర్తించవచ్చు. అధికార పార్టీ తర్వాత అతి పెద్ద పార్టీ నేతను ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించేందుకు ఆయనకు పవర్స్ ఉన్నాయి. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశం అత్యధికంగా 30 లోక్ సభ సీట్లతో రెండో ప్రధాన పార్టీగా ఉంది . పదిశాతం సీట్లు లేకపోయినప్పటికీ టీడీపీకి ప్రధానప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చారు.
ఓటింగ్ మెషిన్లపై రాజకీయ రగడ- EVM లను హ్యాక్ చేయొచ్చా ? ఫలితాలను మార్చేస్తున్నారా?
కోర్టులు జోక్యం చేసుకోలేవు !
పది శాతానికిపైగా సీట్లు వస్తే ఆటోమేటిక్ గా ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఎక్కవ పార్టీలు తెచ్చుకుంటే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ నేత ప్రతిపక్షనేతగా ఉంటారు. ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్‌దే ప్రధాన పాత్ర. ఆయన రూలింగే ఫైనల్. కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు. అందుకే జగన్ స్పీకర్ ను ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగారని అనుకోవచ్చు.
గతంలో ప్రతిపక్ష నేత హోదా తీసేస్తామని చంద్రబాబును బెదిరించిన జగన్
2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. పది శాతం శాతం కన్నా ఎక్కువగా ఉండటంతో ఆటోమేటిక్ గా ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారు. అయితే ఓ సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వస్తే ఆ ప్రధాన ప్రతిపక్షనేత హోదా కూడా పోతుందని హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఆయనకు ఈ అంశంలో స్పష్టత ఉందని అనుకోవచ్చు. అసెంబ్లీ బయట వైసీపీ నేతలు కొడాలి నాని వంటి వారు ప్రతిపక్ష నేత లేకుండా చేస్తామని అప్పుడు భద్రత కోసం ఇంటి ముందు కానిస్టేబుల్ కూడా ఉండరని చాలా సార్లు హెచ్చరించారు. అయితే కాలం ఒక్కలాగే ఉండదు. ఇప్పుడు అధికారికంగానే వైసీపీకి ప్రతిపక్ష హోదా రాలేదు. అది ఇవ్వాలని స్పీకర్‌ని బతిమాలుకోవాల్సి వస్తోంది.