తెలంగాణ అసెంబ్లీలోనే వయసులో పెద్ద నేత వనమా వెంకటేశ్వరరావు. 2018 ఎన్నికల్లో ఇవే తనకు చివరి ఎన్నికలని.. ఒకసారి అవకాశం కల్పించాలని ప్రజల ముందుకు వచ్చి విజయం సాధించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన వనమా వెంకటేశ్వరరావు రాజకీయ వారసుడిపై ఇప్పుడు చర్చ సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో వనమా కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తారా..? అనే విషయం ఆయన అభిమానులను కలవరపెడుతోంది. 


వనమా రాజకీయ వారసుడిపై చర్చ 
తెలంగాణలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతల వనమా వెంకటేశ్వరరావుకు ఇద్దరు కుమారులున్నారు. వనమా రాఘవేంద్రరావు, వనమా రామకృష్ణ. అయితే పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం, ఆ కేసులో వనమా రాఘవ ఉండటంతో ఈ విషయం కాస్తా రెండు తెలుగురాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో వనమా కుటుంబం రాజకీయంగా దూరమవుతుందనే ప్రచారం సాగింది. ఆది నుంచి వనమా వెంకటేశ్వరరావుకు రాజకీయాల్లో వనమా రాఘవ పక్కనే ఉండటం, తన రాజకీయ వారసుడిగా వనమా రాఘవనే చూడటంతో ఒకసారిగా పాల్వంచ సంఘటనతో సమీకరణలు పూర్తిగా మారిపోయాయి.


రెండో కుమారుడు ఎంట్రీ ఖాయమేనా ? 
వనమా వెంకటేశ్వరరావు రెండో కుమారుడైన వనమా రామకృష్ణ కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే చురుగ్గా ఉంటూ ఆ తర్వాత వ్యాపార లావాదేవీలు చూసుకుంటారు. ఈ నేపథ్యంలో వనమా రాఘవను రాజకీయ వారసుడిగా అందరూ భావించారు. అయితే వనమా రాఘవ వ్యవహార శైలితో ఆయన రాజకీయ భవిష్యత్‌ అంధకారంలో పడింది. ఈ నేపథ్యంలో వనమా కుటుంబం నుంచి రాజకీయంగా ఎవరిని ముందుకు తీసుకొస్తారనే విషయం ఇప్పుడు చర్చ జరుగుతోంది.


రామకృష్ణను వారసుడిగా చెబుతున్న అభిమానులు..
వనమా వెంకటేశ్వరరావు వయసు పైబడిన నేపథ్యంలో ఆ కుటుంబం నుంచి రామకృష్ణను రాజకీయ వారసుడిగా తీసుకురావాలని ఇప్పటికే కొంతమంది అభిమానులు వనమా వెంకటేశ్వరరావుకు చెప్పినట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో రామకృష్ణ పాల్వంచ ప్రాంతంలో క్యాంపెనింగ్‌ చేయగా, వనమా రాఘవ కొత్తగూడెం ప్రాంతంలో ఎన్నికల క్యాంపెయిన్ నడిపారు. అయితే అనూహ్యంగా పాల్వంచలో వనమాకు భారీ ఆధిక్యత రాగా, ముందు నుంచి పట్టున్న కొత్తగూడెం ప్రాంతంలో వనమాకు ఆధిక్యం రాలేదు. పాల్వంచలో వచ్చిన మెజారిటీ కారణంగా వనమా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆది నుంచి సౌమ్యుడిగా పేరున్న రామకృష్ణను రాజకీయ వారసుడిగా ప్రకటిస్తే భవిష్యత్‌లో ఈ కుటుంబం నుంచి రాజకీయ ప్రాతినిద్యం లబిస్తుందని వనమా సన్నిహితులు చెబుతున్నారు.


వనమా వెంకటేశ్వరరావుకు వయసురీత్యా ఆరోగ్యం సహకరించని నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు రామకృష్ణను తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఎవరు బహిరంగంగా చర్చ చేయడం లేదు. అయితే మరి వనమా కుటుంబం నుంచి రామకృష్ణను ముందుకు తీసుకొచ్చే విషయంలో రాఘవ సహకరిస్తాడా..? లేక ఈ కుటుంబం నుంచి మరెవరినైనా ముందుకు తీసుకొస్తారా..? అనే విషయం ఇప్పుడు కొత్తగూడెం రాజకీయాల్లో చర్చ సాగుతుంది.  


Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు - ఈ ఏడాది ముందుగానే వర్షాలు, వర్షాల ఎఫెక్ట్‌తో ఎల్లో అలర్ట్ జారీ


Also Read: Minister Mallareddy : రెడ్ల సింహ గర్జనలో ఉద్రిక్తత, మంత్రి మల్లారెడ్డి వాహనంపై రాళ్ల దాడి