Politics in the Manchu family dispute: మంచు మోహన్ బాబు తన కుమారుడు మనోజ్ , ఆయన భార్య మౌనికల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులుక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో కొంత మంది బయట వ్యక్తులు తన ఇంటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వారిని తన కుమారుడు మనోజ్, ఆయన భార్య మౌనికనే తీసుకు వచ్చారని కూడా అన్నారు. ఆయన ఉద్దేశం ప్రకారం మనోజ్ భార్య మౌనిక సోదరి అఖిలప్రియ అనుచరులు వచ్చి ఉంటారని అనుకోవచ్చు. మంచు కుటుంబ వ్యవహారంలో రాజకీయాలు ఉన్నాయని ఎవరూ అనుకోలేదు. కానీ మోహన్ బాబు లేఖ తర్వాత ఈ కుటుంబ ఆస్తుల వివాదంలో రాజకీయాలు కూడా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మనోజ్ దంపతులకు టీడీపీ బ్యాక్ గ్రౌండ్
మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆళ్లగడ్డకు చెందిన ఫ్యాక్షన్ ఫ్యామిలీగా పేరున్న భూమా కుటుంబ అమ్మాయి మౌనికను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి ఓ బిడ్డ కూడా పుట్టింది. భూమా దంపతుల మరణం తర్వాత భూమా అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రికి తగ్గట్లుగా దూకుడు రాజకీయాలు చేస్తున్నారు. గతంలో ఓ ఆస్తి వ్యవహారంలో కొంత మందిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు ఆమె ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంచు కుటుంబంలో ఆస్తి గొడవలు ఉండటంతో ఆళ్ల గడ్డ నుంచి వారి అనుచరులు వచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు కావడంతోనే మోహన్ బాబు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందులో నేరుగా తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉండకపోయినా కుటుంబసభ్యులు టీడీపీకి చెందిన వారు కావడంతో వారు..మనోజ్, మౌనికకు సపోర్టు చేస్తున్నారని అనుకోవచ్చు.
జగన్‌కు సమీప బంధువు మంచు విష్ణు
మరో వైపు మంచు విష్ణుకు వైసీపీ నేతలు చాలా దగ్గర. స్వయంగా జగన్, భరతిరెడ్డి దంపతులకు ఆయన ఆత్మీయుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు సుధీకర్ రెడ్డి కుమార్తెను మంచు విష్ణు పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య బంధుత్వం బలపడింది. మోహన్ బాబు కూడా వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు వైసీపీలో లేరు. రాజకీయాలు పట్టించుకోవడం లేదు. ఈ వివాదంలో ఆయనకు వైసీపీ నేతల నుంచి మద్దతు ఉంటుందని బావిస్తున్నారు. మంచు విష్ణు ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో ఆయన కొంత మందిని ఇంటి వద్దకు సెక్యూరిటీకి పంపారని.. సీసీ ఫుటేజీలను డిలీట్ చేయించారన్న ప్రచారం జరుగుతోంది.
Also Read: పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్... ఇక మెగా వర్సెస్ అల్లు వివాదానికి ఎండ్ కార్డ్!?
ఆస్తుల వ్యవహారం కావడంతో రాజకీయ జోక్యం ఉంటుందని అంచనా !
మోహన్ బాబు కుటుంబం గతంలో రాజకీయాలు చేసింది. అయితే ఇప్పుడు కుటుంబంలో ఆస్తుల వివాదాలు రావడంతో రాజకీయ జోక్యం అంతర్గతంగా ఉంటుందని అంటున్నారు. మీ వెనుక మేముంటాం.. మీ ఆస్తుల కోసం పోరాడండి అని కొంతమంది అన్నదమ్ముల్ని ఎగదోయవచ్చని చెబుతున్నారు. మొత్తంగా మంచు కుటుంబం క్రమశిక్షణకు మారు పేరు అని చెబుతారు. కానీ ఇప్పుడు పూర్తిగా రోడ్డు మీద పడిపోయారు. మోహన్ బాబుపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు కానీ.. మోహన్ బాబు మాత్రం మనోజ్ తో పాటు ఆయన భార్యపై నేరుగా ఫిర్యాదు చేశారు. దీంతో మంచు కుటుంబ వివాదం మరింత రాజుకునే అవకాశం ఉంది.