KTR Responds On Asha Workers Arrest: గ్రామ ప్రజలందరికీ మాతృమూర్తులుగా వ్యవహరిస్తోన్న తెలంగాణ తల్లులపై ఏంటీ దుర్మార్గం.? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల సాధనకు కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఆశ వర్కర్లపై (Asha Workers) పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'సీఎం రేవంత్.. ఆశా వర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా ? మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యమా ? ఏం పాపం చేశారని నడిరోడ్డుపై లాగిపారేస్తున్నారు ? దళిత, బహుజన ఆడబిడ్డలపై ఇంతటి అరాచకమా ? హోంమంత్రిగా ఉన్న మీకు ఆడవాళ్లంటే అంత చులకనా ? ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా ? ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ.. ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు మీ సర్కారు దాష్టీకానికి ఆశా నాయకురాలు.. సంతోషిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలి.. ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి లేకపోతే ఆశా వర్కర్ల ఆగ్రహజ్వాలను తట్టుకోలేరు.' అని పేర్కొన్నారు. అటు, మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఈ వ్యవహారంలో పోలీసులు, ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ఇచ్చిన హామీ ప్రకారం తమకు రూ.18000 ఫిక్స్‌డ్ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఏడాది గడిచినా తమకు న్యాయం చేయడం లేదని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆశా వర్కర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏసీపీ శంకర్‌ను ఒక్కసారిగా ఆశా కార్యకర్తలు చుట్టుముట్టారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేశారు.
వారిని పోలీస్ స్టేషన్లకు తరలించేందుకు వాహనం ఎక్కిస్తున్న సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ చారిపై ఓ ఆశా కార్యకర్త చేయి చేసుకున్నారు. తాను చెయ్యి పెట్టినట్లు గమనించకుండా డోర్ వేయడంతో వెంటనే స్పందించిన ఆ ఆశా వర్కర్ సీఐ చెంప చెళ్లుమనిపించారు. వెంటనే స్పందించిన మహిళా పోలీసులు ఆశా వర్కర్‌ను కొట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహిళా కార్యకర్తలతో పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తారా.? అంటూ మండిపడ్డారు. అటు, పోలీసుపై చేయి చేసుకోవడాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది.