YSRCP Leaders : ఆంధ్రప్రదేశ్‌లో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యక్తిగత వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కొద్ది రోజుల కిందట ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం దుమారం రేపింది. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గుట్టు రచ్చకెక్కింది. వైసీపీలో ప్రముఖ నేతల వ్యక్తిగత విషయాలు ఇలా హైలెట్ అవుతూండటం ఆ పార్టీకి సమస్యగా మారుతోంది. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిజానికి అవేమీ పెద్ద విషయాలు కాదన్నట్లుగా ఉంటున్నారు. ఈ కారణంగా ఒకరి తర్వాత ఒకరు వ్యక్తిగత వ్యవహారాల్లో వివాదాస్పదమవుతున్నారు. పైగా వారి గురించి తెలిసే జగన్ ప్రోత్సహించారని ఇప్పుడు బయట పడ్డాయని ఆయన ఎందుకు పట్టించుకుంటారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 


రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ అయిన దువ్వాడ ఫ్యామిలీ సర్కస్


వైఎస్ జగన్ అత్యంత ఎక్కువగా అభిమానించిన నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఆయన మాటే ఎక్కువగా చెల్లుబాటు అయ్యేది.  టీడీపీ సీనియర్ నేత  అచ్చెన్నాయుడును టార్గెట్ చేయడంలో దువ్వాడ శ్రీనివాస్ ది ప్రత్యేక శైలి. అది జగన్మోహన్ రెడ్డిని మెప్పించిందని చెబుతారు. స్థానిక ఎన్నికల్లో అచ్చెన్నాయుడు స్వగ్రామంలో చేసిన రాజకీయం కూడా.. దువ్వాడ శ్రీనివాస్‌పై జగన్‌లో నమ్మకం పెంచిందని చెబుతారు. అందుకే ముగ్గురు నేతలు పోటీ పడుతున్నా.. సరే దువ్వాడకే జగన్ టిక్కెట్ ప్రకటించారు. కానీ ఈ మధ్యలో ఆయన మరో మహిళతో వివాహేతర బంధం పెట్టుకున్నారని అది  వారి కుటుబంంలో చిచ్చుకు కారణం అయిందని తెలిసింది.  ఈ విషయం జగన్ వద్దకూ వెళ్లింది. చివరికి ఆయనకు కాదని.. ఆయన భార్య దువ్వాడ వాణికే టిక్కెట్ ఇవ్వాలని అనుకున్నారు. ఇంచార్జ్ గా ప్రకటించారు కూడా . కానీ చివరికి దువ్వాడ శ్రీనివాస్ కే టిక్కెట్ ప్రకటించారు. దువ్వాడ వాణిని బుజ్జగించారు. కానీ ఫలితం మాత్రం నిరాశను కలిగించింది. అంటే దువ్వాడ ఫ్యామిలీ సర్కస్ గురించి తెలిసి కూడా జగన్ ప్రోత్సహించారు.. టిక్కెట్ ఇచ్చారు. ఫలితంగా ఇప్పుడు అది  వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా మారుతోంది. 


తుపాకీ ఉంది లైసెన్స్ ఇవ్వండి - పోలీసులకు దరఖాస్తు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్


విజయసాయిరెడ్డిపైనా విమర్శలు


ఇక ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం రెండు, మూడు వారాల పాటు హైలెట్ అయింది. ఆయన పై నేరుగా ఓ దేవాదాయ శాఖ ఉద్యోగిని భర్తనే ఆరోపణలు చేశారు. తన భార్యకు పుట్టిన  బిడ్డకు కారణం ఆయనేనని డీఎన్‌ఏ టెస్టులు చేయించుకోవాలని సవాల్ చేశారు.  ఈ అంశంలో ఆ అధికారణి పెట్టిన మీడియా సమావేశం కూడా వైరల్ అయింది. ఈ వ్యవహారంలో అనేక అనుమానాలు వచ్చాయి. అన్నింటికీ డీఎన్‌ఏ టెస్టు ఫైనల్ క్లారిటీ వస్తుందని అనుకున్నారు కానీ.. విజయసాయిరెడ్డి అంగీకరించలేదు. అయితే ఆ ఆధికారిణి భర్త మాత్రం అదే డిమాండ్ చేస్తున్నారు. చివరికి విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఓ వివరణ ఇచ్చారు. ఆ అధికారికి చేసిన అన్ని రకాల సాయాలు కూతురిగానే భావించి చేశానని... తాను వారింటికి వెళ్లి  బిడ్డను ఆశీర్వదించానని.. తన ఇంటికి వస్తే బట్టలు పెట్టానని చెప్పారు . అంతే తప్ప మరేమీ లేదన్నారు. కానీ వైసీపీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. 


వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఇంటి ముందు కుమార్తెల ధర్నా- తమ సంగతేంటో తేల్చాలని పట్టు


వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదని తెలిసినా ..  వారిని  ప్రోత్సహించడం వల్లనే సమస్యలా ?


వైసీపీ అధినేత జగన్ నేతల వ్యక్తిగత ప్రవర్తనను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే పార్టీకి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని అంటున్నారు. అంబటి రాంబాబు ఆడియో టేపులు  బయటపడి పెద్ద దుమారం రేగిన తర్వాత కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ గురించి మొత్తం తెలిసిన తర్వాత కూడా ప్రోత్సహించారు. ఇంకా  బయటపడని అనేక మంది  లీడర్ల వ్యవహారాల గురించి జగన్ కు పూర్తిగా తెలుసని.. అయితే ఆ లీడర్ల వ్యక్తిగత ప్రవర్తన కారణంగా  పార్టీకి దూరం చేసుకోలేమని ఆయన పట్టించుకోవడం లేదని అంటున్నారు. కానీ వారే పార్టీకి పెద్ద సమస్యగా మారుతున్నారని క్యాడర్ అసంతృప్తికి గురవుతున్నారు.