Andhra Pradesh: వైసీపీ శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం మరోసారి రోడ్డు పడింది. టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉంటున్న ఆయన ఇంటికి కుమార్తెలు రావడం ఆయన తలుపులు తీయకపోవడంతో విషయం రచ్చకెక్కింది. దువ్వాడకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రిని చూసేందుకు హైందవి, నవీన గురువారం సాయంత్రం ఆయన ఇంటికి వచ్చారు. ఇంటి తలుపు తెరుచుకోలేదు. దీంతో రాత్రి 8 గంటల వరకు ఇంటి బయటే ఉండిపోయారు. గేటు గడియ కొట్టినా, కారు హారన్ మోగించినా దువ్వాడ స్పందించలేదు.
ఇంటిలో తన తండ్రి దువ్వాడ ఉన్నప్పటికీ తలుపు తెరవలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుమార్తెలు. లోపల ఉన్నప్పటికీ లైట్లు ఆర్పేశారని కొన్ని వాహనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. తన భర్త తండ్రి చనిపోయినా పరామర్శకు రాలేదని పెద్ద కుమార్తె హైందవి తెలిపారు. ఫోన్ చేసినా, మెసేజ్‌లు పంపించినా స్పందించడం లేదన్నారు. లోపలి వైపు నుంచి తాళాలు వేసి గేట్లు తీయలేదని ఆరోపించారు.
ఈ కుటుంబంలో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బయటపడింది. ఎన్నికల టైంలో భర్తపైనే పోటీ చేసేందుకు దువ్వాడ భార్య సిద్ధమయ్యారు. వైసీపీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి, తమ్మినేని సీతారం, సీదిరి అప్పలరాజు అందర్నీ కూర్చోబెట్టి సర్ధిచెప్పారు. పార్టీ అధికారంలోకి వస్తే దువ్వాడ వాణికి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఇప్పుడు పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. దీంతో కుటుంబ వ్యవహారాలు మళ్లీ వీధికెక్కాయి.
ఎమ్మెల్సీ ఇస్తామన్న పెద్దలెవరూ అందుబాటులోకి రావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది దువ్వాడ వాణి కుటుంబం. ఈ విషయంపై మాట్లాడేందుకే గురువారం ఆయన ఇంటికి కుమార్తెలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన వచ్చి మాట్లాడకపోవడంతో నిరసనకు దిగారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నాయకులపై విమర్శలు చేసిన దువ్వాడ శ్రీనును జగన్ ప్రోత్సహించారు. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత టెక్కలి అసెంబ్లీ సీటు ఇచ్చి ప్రచారం కూడా చేశారు. ఓ దఫా జడ్పీటీసీగా గెలుపొందారు. ఆ తర్వాత పలుపార్జీలు మారినా అన్నిచోట్లా ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో టెక్కలి నుంచి అచ్చెన్నాయుడుపై పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయారు.
ఎన్నికలకు ఏడాది.ముందు దువ్వాడ శ్రీను కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. మూలపేటలో పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. టెక్కలి అసెంబ్లీ సీటును దువ్వాడ శ్రీనుకే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే దువ్వాడ శ్రీను భార్య వాణి పేరు చెప్పారు. మళ్లీ టెక్కలి సీటును శ్రీనుకు కేటాయించడంతో తాను ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తున్నట్లు వాణి ప్రకటించారు. దీంతో కంగుతిన్న వైసీపీ నాయకులు ఆమెకు నచ్చజెప్పి సైలెంట్ చేశారు.
దాని విషయంపై ఇప్పుడు వివాదం మళ్లీ మొదలైందని అంటున్నారు. కొన్నాళ్ల కిందట దువ్వాడ శ్రీను అక్కవరంలో ఇంటిని నిర్మించుకొని వేరే వ్యక్తితో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. తమ సంగతేంటో తేల్చాలంటూ కుమార్తెలు నిలదీస్తున్నారు. ఈ వివాదంలో ఇంకా ఎన్ని మలుపు చూడాల్సి ఉంటుందో అని సిక్కోలు వాసులు అంటున్నారు.