BRS News  :    బీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయడం సంచలనం అయింది. వీరిద్దరి సమస్య ఫిరాయింపులే. అంటే ఫిరాయింపుల ద్వారా బీఆర్ఎస్‌లోకి వచ్చిన వారి కారణంగా వీరికి టిక్కెట్లు దక్కలేదు. దక్కే చాన్స్ కూడా లేకుండా పోయింది. అందుకే వీరు బీఆర్ఎస్ తమను సస్పెండ్ చేసేదాకా తెచ్చుకున్నారు. అయితే వీరిద్దరే కాదని ఇంకా చాలా మంది ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించినా కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేల్ని ఫిరాయించేలా చేసుకున్నారు. ఆ పన్నెండు చోట్ల టీఆర్ఎస్ తరపున పని చేసిన నేతలు  పక్క చూపులు చూస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో వర్గ పోరాటం ఎక్కువగా ఉంది. 


ఫిరాయించి వచ్చిన  వారందరికీ టిక్కెట్ గ్యారంటీ హామీ
 
కాంగ్రెస్ గుర్తుపై గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ మొదటే టిక్కెట్ హామీ ఇచ్చారు. సి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్, టీడీపీ ఎల్పీలను సైతం టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ సిట్టింగ్‌లకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఓడిపోయిన ప్రతీ చోటా బలమైన అభ్యర్థులు ఉన్నరు. పట్నం మహేందర్ రెడ్డి,  తీగల కృష్ణారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహా ఫిరాయించిన ఎమ్మెల్యే ఉన్న ప్రతీ చోటా బలమైన బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వారంతా ఇప్పుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. జూపల్లి కృష్ణారావుపై గెలచిన హర్ష వర్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. టిక్కెట్ రాదని ఆయన దారి ఆయన చూసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఫిరాయించే నేతల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. 


ప్రత్యామ్నాయాలు ఎక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ అగ్రనేతల్లో అలజడి !


ఇప్పుడు బీఆర్ఎస్ కాకపోతే బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి . రెండు పార్టీలు పుంజుకున్నట్లుగా కనిపిస్తూండటంతో నేతలకు అవకాశాలకు కొదువలేకుండా పోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.   గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్, శివారు నియోజకవర్గాల్లో గెలిచిన వారిలో ముగ్గురు, నలుగురు.. కరీంనగర్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌ జిల్లాల నుంచి కొంత మంది కీలక నేతలు టిక్కెట్లు దక్కకపోతే బీజేపీ లేదా కాంగ్రెస్ లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  ఆదిలాబాద్‌‌‌‌, మెదక్‌‌‌‌ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలూ తమతో టచ్‌‌‌‌లో ఉన్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇక వరంగల్‌‌‌‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సైతం బహిరంగంగానే తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు.  2018లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలిచిన దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి చేరికలను నాయకత్వం ప్రోత్సహించింది. మరికొన్ని చోట్ల ఆల్టర్నేట్‌‌‌‌ నేతలపై దృష్టి సారించింది. దీంతో డిఫెన్స్‌‌‌‌లో పడిన కొందరు ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనిఅంటున్నారు.  


సీనియర్లను కాపాడుకునేదెలా ? 


ఖమ్మం జిల్లాలో చాలా మంది నేతలు పార్టీ వీడి పోతారని ప్రచారం జరిగినా.. సర్దుబాటు చేయడంలో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం పెద్దగా ప్రయత్నించలేదు. పిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో బలమైన నేతలకు సరైన గౌరవం ఇవ్వలేకపోయారు. ఫలితంగా వారంతా పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉంది. విమర్శలు చేస్తున్నారని ఇప్పటికిప్పుడు ఇద్దర్ని సస్పెండ్ చేసినా వారు పార్టీకి వ్యతిరేకంగా మారింది..  తమను కాదని ఫిరాయింపు దార్లను ప్రోత్సహించినప్పుడే. ఇతర చోట్లా కూడా ఉన్న ఈ అసంతృప్తి  బయటపడితే ప్రమాదమని.. హైకమాండ్ వెంటనే ఇలాంటి అసంతృప్తుల్ని సర్దుబాటు చేయాలన్న అభిప్రాయం  బీఆర్ఎస్ సానుభూతిపరుల్లో వినిపిస్తోంది.