ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో షో  టాపర్ ఎవరంటే కచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పుకోవచ్చు. చివరి రోజు వరకూ హోరాహోరీ ఉంటుందనుకున్న పోరాటం ... పోలింగ్ అయిపోయే సరికి ఏకపక్షంగా మారిపోయింది. ఆమ్ ఆద్మీ విజయం సాధించింది.ఆ ఒక్క చోటే కాదు.. ఇతర చోట్ల కొంత పోటీ ఇచ్చింది.దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ స్థాయికి చేరేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తోందని అనుకోవచ్చు. వరుస ఓటములతో కునారిల్లిపోతున్న కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆమ్ ఆద్మీ భర్తీ చేస్తుందా ? అన్నదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నచర్చ.


ఫలితాలు వస్తున్నప్పుడే ఊపందుకున్ " దేశ్ కీ నేత కేజ్రీవాల్ " ప్రచారం !


ఢిల్లీ బయట కేజ్రీవాల్ పార్టీ ఓ పెద్ద రాష్ట్రంలో ఘన విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయనపైనే పడింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాము కూడా ఆయా రాష్ట్రాల్లో ఎదుగుతామని డాన్సులు కూడా చేశారు. చివరికి ఏపీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు  భవిష్యత్ తమదేనని ధీమాగా చెప్పుకోవడం ప్రారంభించారు. ఇక అంతో ఇంతో ఉనికి కనిపించే రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ హడావుడి గురించి చెప్పాల్సిన పని లేదు.


 జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ ప్లేస్ పొందే లక్ష్యంతో  ఆప్ !
  
దేశంలో యూపీఏకి.. ప్రధానంగా కాంగ్రె్‌సకు ప్రత్యామ్నాయంగా అవతరించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తోంది.  ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ  పంజాబ్‌ పీఠాన్ని అందుకుంది. అలాగే  హిందీ రాష్ట్రాల్లో సత్తా చాటి.. జాతీయ ప్రత్యామ్నాయం తానేనని చాటుకోవాలని చూస్తోంది.  కాంగ్రె్‌సను బలహీనపరచి.. బీజేపీకి జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు  కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి   ఎప్పటి నుంచో జాతీయ ఆకాంక్షలు ఉన్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే ఆ పార్టీ 434 మంది అభ్యర్థులను నిలబెట్టింది. వీరిలో 414 మంది డి పాజిట్లు కోల్పోయారు. అయితే.. 2015, 2020ల్లో బీజేపీని ఢీకొని ఢిల్లీలో అధికారంలోకి రాగలిగింది. పంజాబ్‌లోనూ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయికి చేరడానికి కేజ్రీవాల్ మరో ప్రయత్నం చేశారు. కానీ ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి.ఆ ఎన్నికల్లో ఆప్ 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 40 స్థానాల్లో పోటీచేసింది. పంజాబ్‌లోని సంగ్రూర్ స్థానం తప్ప మిగతా అన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. కానీ ఇప్పుడు పంజాబ్‌లో ఆప్ విజయం సాధించింది.  గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో కూడా కొన్ని ఓట్లు.. సీట్లు సాధించింది.  గుజరాత్‌లో స్థానిక ఎన్నికల్లోనూ ప్రభావం చూపించింది.  సూరత్‌ కార్పొరేషన్‌లో 27సీట్లు గెలుచుకుని.. కాంగ్రెస్‌ స్థానాన్ని ఆక్రమించింది.

పాత రాజకీయాలను మార్చేసుకున్న కేజ్రీవాల్ !  


సంప్రదాయ రాజకీయ పక్షాలకు భిన్నమైన పార్టీగా 2013లో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చితే ప్రస్తుత ఆప్   ఒక ‘కొత్త’ పార్టీ అనుకోవచ్చు.  సంప్రదాయ రాజకీయాలు చేస్తున్నారు. అవినీతి వ్యతిరేక జన్ లోక్‌పాల్ బిల్లును తీసుకురాలేకపోయిన కారణంగా తొలిసారి అధికారానికి వచ్చిన 44 రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర కేజ్రీవాల్‌కు ఉంది. అంతేకాదు రాజకీయాల్లోకి ప్రవేశించిన కొద్ది నెలల్లోనే 2014లో వారణాసిలో నరేంద్ర మోదీని సవాల్ చేసే తెగువను నిర్భయంగా ప్రదర్శించిన నేత కేజ్రీవాల్.  2022 సంవత్సరంలో ప్రత్యర్థులు, విరోధులకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యం మారిపోయింది. సరైన నాయకత్వం లేని సంస్థాగతంగా బలహీనపడిన కాంగ్రెస్సే. బీజేపీ కంటే బాగా బలహీనపడినట్లుగా ఆయన గుర్తించారు అప్పట్నుంచే  కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఆప్ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు ప్రారంభించింది.  ఇందులో భాగంగానే గత ఏడాది గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలలో మైనారిటీ వర్గాల వారు ఆధిక్యత ఉన్న ప్రాంతాలను ఆప్ విజయవంతంగా కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ ఒక ప్రధాన శక్తిగా ఉన్న రాష్ట్రాల్లో కీలకంగా పని చేస్తోంది.  కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లను ఆకట్టుకుని ఆ పార్టీని బలహీనపరచడం ద్వారా భవిష్యత్తులో బీజేపీకి జాతీయస్థాయి సవాల్‌దారుగా ఆవిర్భవించవచ్చని కేజ్రీవాల్ గట్టిగా భావిస్తున్నారు.


ముందు ముందు కేజ్రీవాల్ ప్రభావం పెరిగే అవకాశం  !


భ‌విష్య‌త్తులో మ‌రిన్ని రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ ప్రాభవం పెంచుకోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి విప‌క్షాల త‌ర‌పున ప్ర‌ధాని అభ్య‌ర్థిగా కేజ్రీవాల్ ఆవిర్భ‌వించినా ఆశ్చ‌ర్యం లేద‌న్న‌ది రాజ‌కీయ నిపుణుల అభిప్రాయం. రాజ‌కీయాల‌పై ప్ర‌జ‌ల్లో గూడుక‌ట్టుకున్న ఆగ్ర‌హ‌మే ఆప్ ఎదుగుద‌ల‌కు ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంద‌న్న వారి విశ్లేష‌ణ‌ల్లోనూ నిజ‌ముంద‌ని చెప్పాలి.కేజ్రీవాల్ దగ్గర ఛరిష్మా ఉంది. కానీ వనరుల లోటుంది. మొదట రెండుసార్లు జాతీయ స్థాయిలో ఆయనకు వైఫల్యం కూడా ఎదురయ్యింది. అయితే కేజ్రీవాల్ లక్ష్యాలు ఉన్న వ్యక్తి. దిల్లీని ఒక మోడల్‌గా చేసి దానిని జాతీయ స్థాయిలో అందించడానికి కచ్చితంగా ప్రయత్నిస్తారు. అయితే దానికి ఇప్పుడు లభించిన విజయాలు సరిపోతాయా లేదా అన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.


కాంగ్రెస్ స్థానం కోసం మమతా బెనర్జీ కూడా రేసులో ఉన్నారు..!



టీఎంసీ అధినాయకురాలు, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రె్‌సను బలహీనపరచి.. బీజేపీకి జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు.  2024 లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో సాధ్యమైనన్ని అత్యధిక సీట్లు సాధిస్తే.. ఇతర పార్టీలను కూడగట్టుకుని కేంద్రంలో అధికారంలోకి రావచ్చని మమత ఆశాభావంతో ఉన్నారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో బలమైన నేతలు అవసరమని తలపోస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ మాజీ నేత యశ్వంత్‌ సిన్హా (జార్ఖండ్‌), కాంగ్రెస్‌ నేతలు కీర్తి ఆజాద్‌ (బిహార్‌ మాజీ ఎంపీ), అశోక్‌ తన్వర్‌ (హరియాణా పీసీసీ మాజీ అధ్యక్షుడు), జేడీయూ మాజీ ఎంపీ పవన్‌ వర్మ (బిహార్‌) వంటి వారిని టీఎంసీలో చేర్చుకున్నారు. అసోం కాంగ్రెస్‌ నేత సుస్మితా దేవ్‌ ఇప్పటికే తృణమూల్‌ తీర్థం పుచ్చుకున్నారు. త్రిపురలో బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్‌ దాస్‌తో పాటు అనేక మంది బీజేపీ కార్యకర్తలు తృణమూల్‌లో చేరారు.  ఇప్పటికే మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్ర పార్టీగా తృణమూల్‌కు గుర్తింపు లభించింది.


అటు ఆప్.. ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని జాతీయ రాజకీయాల్లో తాము పొందాలని ప్రయత్నిస్తున్నాయి. ఎంత వరకూ సక్సెస్ అవుతారన్నది కాలమే నిర్ణయించాలి.