Vizag YSRCP : ఓ వైపు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని ..గర్జనలు నిర్వహిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు మరో వైపు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మీడియాకు ఎక్కుతున్నారు. ఇది వైఎస్ఆర్‌సీపీ నేతల్ని అయోమయానికి చేసింది. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, లోక్ సభ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మధ్య పార్టీలో ఇంత కాలం ఉన్న అంతర్గత కలహాలు ఇప్పుడు ఒక్క సారిగా బయటపడ్డాయి. ఇరువురూ మీడియా ఎదుట ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నారు. దీంతో విశాఖ వైఎస్ఆర్‌పీసీలో కలకలం బయలుదేరింది.
విజయసాయిరెడ్డి వర్సెస్ ఎంవీవీ సత్యనారాయణ
దసపల్లా భూముల వ్యవహారం, విజయసాయిరెడ్డి అల్లుడు, కుమార్తె కలిసి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంపై గత వారం రోజులుగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. దీనికి వివరణ ఇచ్చే సమయంలో విజయసాయిరెడ్డి .. కూర్మన్న పాలెంలో ఓ బిల్డర్ భూయజమానికి కేవలం ఒక్క శాతమే ఇచ్చి..99 శాతం తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని ..దాని గురించి మీడియా ఎందుకు ప్రశ్నించదన్నారు. ఆ బిల్డర్ ఎవరో కాదు .. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణే. దాంతో ఆయన వ్యవహారంపైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎంవీవీ సత్యనారాయణ ఆరోపిస్తున్నారు.
తనపై ఆరోపణలు చేసే ముందు విజయసాయి నిజాయితీని నిరూపించుకోవాలన్న సత్యనారాయణ !
ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో విశాఖ ఎంపీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గూండాగిరి చేసి విజయసాయిరెడ్డి భూములు రాయించుకుటున్నారని ఆరోపించారు. ఆ విషయం అందరికీ తెలుసన్నారు. తనపై చేసిన ఆరోపణలు తప్పన్నారు. భూములు కొనాలనుకున్న వారి ఆస్తులపై దాడి చేయడం.. వారి భూములను 22ఏలో పెట్టడం.. తర్వాత భూములు రాయించుకుని తీసేయడం వంటివి చేశారన్నారు. ఒక్క శాతం మాత్రమే ల్యాండ్ ఓనర్లకు ఇచ్చి..తాను 99 శాతం తీసుకుంటూ నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడారు. అది తాను రాజకీయాల్లోకి రాక ముందు 2017లో సెటిలైపోయిన విషయం అన్నారు. లోక్ అదాలత్‌లో ఆ విషయం తెలిందన్నారు. ఇప్పుడు దానిపై విజయసాయిరెడ్డి రచ్చచేయడం రాజకీయమేనని స్పష్టం చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు చేశారని.. ఇక్కడ విజయసాయిరెడ్డి చేసిందేమిటని ప్రశ్నించారు. తాను ప్రైవేటు భూముల్లో .. ఆ యజమానులతో ఒప్పందం చేసుకున్నానని ప్రభుత్వ భూములతో కాదని.. స్పష్టం చేశారు. దసపల్లా భూములు ప్రభుత్వానివేనని.. వాటిని విజయసాయిరెడ్డి కొట్టేశారన్నట్లుగా పరోక్షంగా ఎంపీ చెబుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణల నుంచి విజయసాయిరెడ్డి నిజాయితీగా బయటకు రావాలన్నారు. ఎంవీవీ సత్యనారాయణ స్పందన .. నేరుగా విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేయడంతో విభేదాలు రోడ్డున పడినట్లయ్యాయి.
వైఎస్ఆర్‌సీపీ ఉత్తారంధ్ర ఇంచార్జ్‌గా తప్పించినా విశాఖలోనే విజయసాయి మకాం !
వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. విజయసాయిరెడ్డిని తప్పించారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ మాత్రమే. ప్రత్యేకమైన ప్రాంతం ఉండదు. కానీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ ఎంపీ. పార్టీ పరంగా కానీ సాంకేతికంగా కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డికి విశాఖతో సంబంధంలేదు. కానీ ఆయన ప్రభుత్వ విధఆన నిర్ణయాలపై మాట్లాడుతున్నారు. దీనిపై వైఎస్ఆర్‌సీపీలోనే విస్మయం వ్యక్తవుతోంది. ఆయనను విశాఖ నుంచి తప్పించినా మొండిగా అక్కడే తన కార్యక్షేత్రం అని అంటున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు అంటున్నారు. గతంలో విజయసాయిరెడ్డికి ఇతర వైఎస్ఆర్‌సీపీ నేతలకు పెద్దగా సరిపడేది కాదు.అందుకే ఈ భూ వివాదాల్లో కూడా ఆయనకు మద్దతుగా ముందుకు వచ్చి మాట్లాడేవారు లేరు.
కొసమెరుపేమిటంటే తనపై ఆరోపణలు చేస్తున్న మీడియాకు వ్యతిరేకంగా మీడియాను.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఎంపీకి వ్యతిరేకంగా రియల్ ఎస్టేట్‌ను విజయసాయిరెడ్డి ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆయన కావాలనుంటే సొంత పార్టీ కూడా పెట్టుకోవచ్చని..ఎంపీ సత్యనారాయణ సలహా ఇస్తున్నారు.