YCP News: సెర్ప్ సీఈవో  ఇంతియాజ్ అహ్మద్(Imtiaz Ahmed) స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. ఆయన వీఆర్ఎస్ దరఖాస్తును ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. త్వరలోనే ఆయన వైసీపీలో చేరనున్నట్లు తెలిసింది. ఆ పార్టీ తరపున కర్నూలు(Kurnool) నుంచి  ఇంతియాజ్ పోటీ చేయనున్నట్లు తెలిసింది.


కర్నూలు బరిలో మాజీ ఐఏఎస్
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఊహించని విధంగా కొత్త అభ్యర్థులు తెరపైకి  వస్తున్నారు. అలాగే కర్నూలు వైసీపీ(YSRCP) అభ్యర్థిగా  సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్(Imtiaz Ahmed) బరిలో దిగనున్నారు. వైసీపీ అధిష్టానం నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ రావడంతో వెంటనే ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన దరఖాస్తును ప్రభుత్వం ఆఘమేఘాలపై ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆయన  సెర్ఫ్ సీఈవోగా ఉన్నారు. ఒకటి రెండురోజుల్లో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారని తెలిసింది. కర్నూలు నుంచి ఆయన బరిలో దిగనున్నట్లు  సమాచారం. ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే సర్వీస్‌కు రాజీనామా చేశారు. ఐఏఎస్ అధికారిగా ఇంతియాజ్ కృష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేశారు, ప్రస్తుతం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా, సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది. అయినా రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని తన ఉద్యోగానికి ఇంతియాజ్ అహ్మద్ రాజీనామా చేశారు.


ఎంపీనా.?ఎమ్మెల్యేనా..?
కర్నూలు జిల్లాకే చెందిన ఇంతియాజ్ కు స్థానికత కలిసిరానుంది. అయితే ఆయన ఎంపీగా బరిలో దిగుతారా లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. వైసీపీలో చేరనున్నారని... పార్టీ టిక్కెట్ కన్ఫార్మ్ చేసిందని తెలిసింది కానీ ఆయన ఎంపీగా పోటీచేస్తారా లేక ఎమ్మెల్యేగా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ టిక్కెట్ ఖాళీగా ఉంది. అలాగే కర్నూలులోనూ ముస్లిం సామాజిక వర్గానికే చెందిన హాఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపైనా వివిధ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో జగన్ ఈసారి అభ్యర్థిని మార్చనున్నారన్న ప్రచారం సాగింది. దీంతో ఇంతియాజ్ అహ్మద్ కర్నూలు ఎమ్మెల్యేగానే పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు సిటీలో ముస్లీం ఓట్లు గెలుపోటములను ప్రభావం చూపనున్న నేపథ్యంలో అదే సామాజికవర్గానికి చెందిన ఇంతియాజ్ అహ్నద్ కు టిక్కెట్ కేటాయిస్తాని జోరుగా ప్రచారం జరుగుతోంది. అటు తెలుగుదేశం పార్టీ నుంచి టీజీ భరత్ మరోసారి పోటీ చేయనున్నారు, ఇప్పటికే తొలిజాబితాలో ఆయన పేరు సైతం ప్రకటించింది. ఒకవేళ ఆయన్ను కర్నూలు ఎంపీగా బరిలో దింపే అవకాశాలు కూడా ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేయడంతోపాటు జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనార్టీ వర్గాల ఓట్లు జగన్ గాలం వేయాలనుకుంటే ఇంతియాజ్ అహ్మద్ ను ఎంపీ అభ్యర్థిగానూ బరిలో దింపే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.