తెలంగాణలో ఎన్నికల వేళ.. బీజేపీ మరో చిచ్చు రాజేంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు హిందూ దేవుడు గణేష్ పేరు పెట్టాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఖైరతాబాద్‌ను గణేష్‌పురిగా మార్చాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్ ప్రతిపాదించారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో జరిగిన భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదన చేశారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గాన్ని... గణేష్‌పురి అసెంబ్లీ నియోజకవర్గంగా మార్చాలనే ప్రతిపాదనకు గట్టిగా మద్దతు ఇస్తున్నానని చెప్పారు. 


ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పేరును గణేష్‌పురి అసెంబ్లీ నియోజకవర్గంగా మార్చాలనే ప్రతిపాదనను భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ తీసుకుంది. వారి నిర్ణయానికి తాను పూర్థిస్థాయలో అండగా నిలుస్తున్నాని అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్. మన ప్రాంతాలు మన సంప్రదాయాలకు అనుకూలంగా ఉండాలని.. చెప్పారాయన. 


చరిత్ర తిరగేస్తే.. ఖైరతాబాద్ పేరును ఖైరతీబేగం పేరు ఆధారంగా పెట్టారు. ఆమె ఇబ్రహీం కులీ కుతుబ్ షా కుమార్తె, హుస్సేన్‌షా వలీ భార్య. ఖైరతీ బేగం సమాధి, మసీదు తెలంగాణ హెరిటేజ్ శాఖ వెబ్‌సైట్‌లో రాష్ట్రంలోని ఐకానిక్ స్మారక చిహ్నాలలో ఒకటిగా ఉన్నాయి. అలాగే, ఈ ప్రాంతంలోని ఖైరతాబాద్ మసీదు కుతుబ్ షాహీ శకం నాటిది. ఆరవ కుతుబ్ షాహీ రాజు సుల్తాన్ ముహమ్మద్ కుతుబ్ షా కుమార్తె ఖైరతున్నీసా బేగం పేరుపై ఉంది. ఖైరతున్నీసా తన గురువు అఖుంద్ ముల్లా అబ్దుల్ మాలిక్ జ్ఞాపకార్థం మసీదును నిర్మించింది. 


ఇక, ఖైరతాబాద్‌ మహాగణపతి చాలా ప్రసిద్ధి. 1954లో మొదటిసారిగా ఖైరతాబాద్‌లోని ఒక ఆలయంలో ఒక అడుగు గణేష్ విగ్రహాన్ని స్థాపించారు. ఈ విగ్రహం ఎత్తు ప్రతి ఏడాది పెరుగుతూ... 60 అడుగులకు చేరింది. 2019లో విగ్రహం శిఖరం ఎత్తు 61 అడుగులకు చేరింది. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా అవతరించింది. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏటా వినయాకచవితి ఉత్సవాలు ఇక్కడ అత్యంత ఘనంగా జరుపుతారు. ఖైరతాబాద్ గణేష్ దాని లడ్డూకు కూడా ప్రసిద్ధి చెందింది. 


ఖైరతాబాద్ నియోజకవర్గంను 1967లో ఐదు సెగ్మెంట్లతో.. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. 2009 పునరవ్యవస్థీకరణతో శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి విడిపోయాయి. అంబర్‌పేట నియోజకవర్గంలోని హిమయత్‌నగర్, అమీర్‌పేట్‌ను కలుపుకుని ఖైరతాబాద్ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఖైరతాబాద్‌ నియోజకవర్గం పేరుతో గణేష్‌పురిగా మార్చాలని బీజేపీ నేత డిమాండ్‌ చేస్తున్నారు.


తెలంగాణలో స్థలాల పేర్లు మార్చాలని బీజేపీ ప్రతిపాదించడం ఇది మొదటిసారి కాదు. గతంలో హైదరాబాద్, నిజామాబాద్ పేర్లను కూడా మారుస్తామని ఆ పార్టీ సీనియర్ నేతలు సవాల్‌ చేశారు. అయితే, తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో... ఖైరతాబాద్ పేరు మార్చాలన్న బీజేపీ నేత ప్రతిపాదన హాట్‌ టాపిక్‌గా మారింది.