How Telangana BJP will be active again : బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా చాలా రోజుల తర్వాత తెలంగాణ పర్యటనకు వచ్చారు. కొన్నాళ్లుగా తెలంగాణ బీజేపీ నిస్తేజంగా ఉంది. కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడ్ని నియమించలేకపోయారు. సీనియర్లు పెరిగిపోవడంతో పాటు ఎవరి మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీ కార్యకలాపాలు కూడా మందగించాయి. ప్రెస్మీట్లు, ప్రకటనలకే పరిమితమయ్యారు. క్షేత్ర స్థాయిలో చేపట్టిన కార్యకలాపాలు పెద్దగా కనిపించడం లేదు. ఈ సమయంలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టడానికి జేపీ నడ్డా సంకల్పించారు.
పార్టీ సభ్యత్వాలపైనా పెద్దగా దృష్టి పెట్టని నేతలు
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఇలాంటిది ఒకటి జరుగుతోందని బీజేపీలోని వారికి మాత్రమే తెలుసు. ఇక ప్రజల వద్దకు వెళ్లి సభ్యత్వాలు ఎవరు చేయిస్తున్నారో ఎవరికీ తెలియదు. పర్యవేక్షణ కూడా లేకపోవడంతో అతి తక్కువ సభ్యత్వాలు నమోదవుతున్నాయి. సెప్టెంబర్ 8వ తేదీన మొదలైన సభ్యత్వ నమోదు కార్యక్రమం అక్టోబర్ 25వ తేదీకి ముగించాలని షెడ్యూల్ పెట్టుకున్నారు. ఇప్పటికి ఇరవై రోజులు అవుతున్నా.. కనీసం పది లక్షల మందిని కూడా సభ్యులుగా చేర్చలేకపోయారు. మొత్తంగా హైకమాండ్ పెట్టిన టార్గెట్ యాభై లక్షలు. ఇలా అయితే సభ్యత్వాలు జరగవని.. పార్టీని యాక్టివ్ చేయాలంటే చురుకుపుట్టించాల్సిందేనని జేపీ నడ్డా హైదరాబాద్‌కు వచ్చారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళే యజమాని - అక్టోబరు 3 నుంచి పైలెట్ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
సీనియర్ నేతల మధ్య లేని సమన్వయం
తెలంగాణ నుండి ఇద్దరు కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ఉన్నారు. వీరిద్దరూ మాస్ లీడర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారు. ఎనిమిది మంది లోక్ సభ సభ్యులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే అందర్నీ సమన్వయ పరిచే వారు లేరు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. జమ్మూ-కాశ్మీర్ ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు కూడా ఇచ్చారు. దాంతో అసలు తెలంగాణపై దృష్టి పెట్టలేకపోతున్నారు. అదే సమయంలో ఈటలతో సహా ఇతర సీనియర్ల మధ్య పొసగడం లేదు. ఎంపీలు, ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు , క్యాడర్ అంతా ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారు.
Also Read: Hydra Ranganath: హైడ్రా సైలెంట్‌గా లేదు- మల్లారెడ్డి, ఒవైసీల కాలేజీలు కూల్చివేతపై రంగనాథ్ క్లారిటీ
ఈటల రాజేందర్ పార్టీ పేరుతో కాకుండా సొంతంగా ఆయన ప్రజాఉద్యమాల్లో పాల్గొంటున్నారు. హైడ్రా, మూసీ బాధితుల విషయంలో ఈటల సొంతంగా వెళ్లారు. బీజేపీ పార్టీ తరపున ఏ కార్యక్రమం చేపట్టలేదు. అదే సమయంలో హైడ్రాను మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫుల్లుగా వ్యతిరేకిస్తుంటే మెదక్ ఎంపీ రఘునందనరావు, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సమర్థిస్తున్నారు. ఇలా ఓ స్టాండ్ తీసుకోలేకపోవడం కూడా సమస్యగా మారింది. ముందుగా ఓ పార్టీ అధ్యక్షుడిని నియమిస్తే అంతా సర్దుకుంటుదని అనుకుంటున్నారు. కానీ ఆ నియామకమే పెద్ద సమస్యగా మారింది.