Why is Jagan trying to make BJP leaders believe that the laddu was not adulterated : తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యిలో కల్తీ చేశారని .. జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు చేసిన ఆరోపణలు వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెను సమస్యగా మారాయి. హిందువులు, హిందూ సంఘాల నుంచి వచ్చే నిరసనతో పాటు బీజేపీ పెద్దలు ఈ ఆరోపణల్ని నమ్మకూడదని తన వాదనను ప్రత్యేకంగా వారి దృష్టి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేసి.. ఆలయ ప్రతిష్టను దిగజార్చి రాజకీయం చేస్తున్నారు కానీ.. అసలు తప్పు జరగలేదంటున్నారు. తన వాదనను వారి దృష్టికి తీసుకెళ్లడానికి జగన్ ఎక్కువగా సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారు.
లేఖ,ప్రెస్‌మీట్‌ను అందరికీ ట్యాగ్ చేసిన జగన్
లడ్డూ కల్తీ ఆరోపణలు వచ్చిన తర్వాత జగన్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు తప్పు చేశారని ప్రకటించారు. నిజాలేంటో ప్రధాని మోదీకి, చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తానని ప్రకటించారు. ఆ తర్వాత మోదీకి లేఖ రాశారు. ఆ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేసి కనీసం వంద మందికి ట్యాగ్ చేశారు. ఇందులో బీజేపీకి చెందిన ప్రముఖ నేతలు, ఆరెస్సెస్ నేతలు , బీజేపీ ముఖ్యమంత్రులు , హిందూ మత ప్రముఖులు ఉన్నారు. వారందరూ తన లేఖను చదవాలని నిజాలు తెలుసుకోవాలని ఆయన కోరారు. ఈ లేఖలను వారు చదివారో లేదో కానీ వెంటనే డిక్లరేషన్ వివాదం తెరపైకి వచ్చింది. తిరుమల టూర్ మానుకుని మళ్లీ ప్రెస్మీట్ పెట్టి మొత్తం లేఖలో చెప్పిందే చెప్పారు. ఆ వీడియోను శనివారం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసి.. న్యాయం మీరే చెప్పాలని.. మళ్లీ ముఖ్య బీజేపీ నేతలకు.. హిందూత్వ వాదులకు.. ప్రముఖ ఆలయాలకూ ట్యాగ్ చేశారు. జగన్ ప్రయత్నాలను టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అయినా జగన్ మాత్రం తన ప్రయత్నం తాను చేస్తున్నారు.
Also Read: Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
లడ్డూ వివాదం కారణంగా ఏపీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుందన్న దానిని ఎక్కువగా పట్టించుకోవడం లేదు. భారతీయ జనతా పార్టీ పెద్దలకు, హిందూత్వ సంస్థలు నడిపే వారికి ఎంత కోపం వస్తుంద అని ఆయన ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ప్రత్యేకంగా ప్రతీ ప్రెస్ మీట్, లెటర్‌లోనూ బీజేపీ ప్రస్తావన తెస్తున్నారు. టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్లు కూడా ఎక్కువగా ఉన్నారని.. ఏదైనా తప్పు జరిగితే వాళ్లకీ బాధ్యత ఉంటుందని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. అసలేం జరగలేదన్న తమ వాదననతో ఏకీభవించి చంద్రబాబును తిట్టాలని కూడా ఆయన నేరుగా డిమాండ్ చేస్తున్నారు. తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేశామని వారు నమ్మితే తాను తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ బయపడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే అదంతా చంద్రబాబు రాజకీయమే తప్ప.. తన తప్పేమీ లేదని చెప్పడానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలు వీరికే - రాజీనామాలు చేసిన వారెవరికీ చాన్స్ లేనట్లే ?
ఢిల్లీకి వెళ్లి కలిసి చెప్పే టీమ్ కూడా గల్లంతు అయిందా ?
మామూలుగా అయితే జగన్ ఇలాంటి సందర్బాల్లో ఢిల్లీ పెద్దలకు తన వాదన వినిపించుకోవాలంటే ఆయనకు ఓ టీమ్ ఉంటుంది. ఎంపీలతో కలిసి వెళ్లి నేరుగా ఢిల్లీ పెద్దల్ని కలిసి తమ వాదన వినిపిస్తూ ఉంటారు. ఈ సారి ఢిల్లీలో పరిస్థితుల్ని చక్కబెట్టే టీమ్ అంతా చెల్లాచెదురు అయినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఢిల్లీలో పరిస్థితుల్ని చక్క బెట్టి విజయసాయిరెడ్డిని జగన్ దూరం పెట్టారు. సుబ్బారెడ్డి వివాదాల్లో ఉన్నారు. ఇక డిల్లీలో అందరూ నేతల అపాయింట్‌మెంట్లు తీసుకునే సీనియర్ నేతలు కూడా ఎవరూ లేరు. ఈ కారణంగా జగన్ సోషల్ మీడియాను నమ్ముకుంటున్నారని అంటున్నారు. మొత్తంగా జగన్..తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో ఎవరూ ఊహించనంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారని స్పష్టమవుతోందని వైసీపీ వర్గాలు కూడా గుసగుసలాడుకుంటున్నాయి.