Tirumala Laddu Controversy | తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీపై దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. తిరుమలలో కల్తీ నెయ్యి అంశంపై దర్యాప్తు చేపట్టేందుకు ఏర్పాటు చేసిన సిట్ టీమ్ శనివారం నాడు తిరుమలకు చేరుకుంది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్ టీమ్ నేడు తిరుపతి (Tirupati)లోని శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకుంది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో వినియోగించిన నెయ్యిపై అధికారులు విచారణ చేయనున్నారు. తిరుపతితో పాటు తిరుమల అనుబంధ విభాగాలను పరిశీలించిన అనంతరం ఏపీ ప్రభుత్వానికి సిట్ టీమ్ నివేదిక సమర్పించనుంది. 


సిట్ ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రభుత్వం


కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధిలో అపచారం జరిగిందని, ప్రసాదాలలో కల్తీ నెయ్యి అంటూ ఆరోపణలు రావడం తెలిసిందే. ఆపై గుజరాత్ కు పంపి జరిపించిన టెస్టుల్లో టీటీడీకి వచ్చిన నెయ్యి కల్తీ జరిగిందని నిరూపితమైంది. కోట్లాది హిందువుల మనోభావాలతో కూడుకున్న అంశం కావడంతో చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలలో జంతువుల కొవ్వు కలపడంతో అపచారం చేశారంటూ, దీనిపై దర్యాప్తు జరిపేందుకు సిట్ ఏర్పాటు చేశారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై నిజానిజాలు వెలికి తీసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్ట త్రిపాఠిని చీఫ్ గా నియమిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. సిట్ ఏర్పాటుపై ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో లడ్డూలో కల్తీ నెయ్యి, టీటీడీలో అవకతవకలపై దర్యాప్తు చేపట్టేందుకు సిట్ టీమ్ రంగంలోకి దిగి తిరుమలకు చేరుకుంది.


జగన్ తిరుమల పర్యటన రద్దుపై భిన్న వాదనలు
టీటీడీలో అపచారం, తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని ఆరోపణలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమపై దుష్ప్రచారం చేస్తోందని, రాజకీయంగా లబ్ది పొందడానికి చీప్ ట్రిక్స్ ఫాలో అవుతున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. తిరుమల అంశం తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ  స్థాయిలో, అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారడంతో వైఎస్ జగన్ తిరుమలలో పర్యటించాలని భావించారు. శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకుని, శనివారం నాడు శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాల్సి ఉంది. కానీ టీటీడీలో అన్య మతస్తులు తిరుమల స్వామి వారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ సంతకం చేయాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వం, టీటీడీ సూచించింది. ఈ పరిణామాల మధ్య మాజీ సీఎం జగన్ చివరి నిమిషంలో తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు.


Also Read: YS Jagan : లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?



గతంలో సీఎంగా ఉన్న సమయంలో డిక్లరేషన్ ఇవ్వని జగన్ ఇప్పుడు ఎందుకు చేయాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ మాత్రం తిరుమల పర్యటన రద్దు అనంతరం మాట్లాడుతూ.. తన మతం మానవత్వమని, తాను బైబిల్ చదువుతానని, తిరుమల శ్రీవారిని సైతం ఎన్నో పర్యాయాలు దర్శించుకున్నానని.. ముస్లిం విధానాలు, సిక్కుల ప్రార్థనలన్ని గౌరవించడం తప్పు కాదు కదా అని ప్రశ్నించారు. కొందరు తన పర్యటనను రాజకీయం చేసి లబ్ది పొందాలని చూశారన్నారు.