Pawan Kalyan: పిఠాపురం పర్యటనలో పవన్ కల్యాణ్ ఏ ఉద్దేశంతో చేశారో కానీ హోంశాఖపైనా, పోలీసు వ్యవస్థ పనితీరుపైనా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సాధారణంగా ఓ మంత్రి పనితీరు గురించి మరో మంత్రి ఇలా బహిరంగంగా మాట్లాడటం అనేది ఏ ప్రభుత్వంలో అయినా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అందులో సందేహమే లేదు. ఏపీలో అయితే మరింత పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఓ పార్టీకి చెందిన మంత్రిపై మరో పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం బహిరంగ వ్యాఖ్యలు చేస్తే ఎంత మంచి సంబంధాలు ఉన్నా అది కనిపించని బీటలు పెట్టేస్తుంది. ఇప్పుడు కూటమి మధ్య అదే జరిగినట్లుగా కనిపిస్తోంది.
పవన్ వ్యాఖ్యలతో తొందరపడ్డారా ?
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎవరూ వ్యతిరేకంగా స్పందించలేదు. వారిలో ఎవరైనా ఆవేశపడితే చినికి చినికి గాలివానగా మారుతుంది. అందరూ సంయమనంతో మాట్లాడారు. ఏమైనా ఉంటే అంతర్గతంగా చూసుకుంటామని చెప్పారు. పవన్ అలా మాట్లాడి ఉండకూడదని ఎవరూ వ్యాఖ్యానించ లేదు. హోంమంత్రి అనిత కూడా ఆ విషయంపై బ్యాలెన్స్‌డ్‌గా స్పందించారు. టీడీపీలో అంతర్గత చర్చ ఏం జరుగుతుందో కానీ.. పవన్ కల్యాణ్ తోటి మంత్రిగా ఇలా మాట్లాడి ఉండకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైనా ఉంటే అంతర్గతంగా చెప్పి ఉంటే సరిపోయేదని కానీ ఇప్పుడు వైసీపీకి అవకాశం ఇచ్చినట్లయిందన్న వాదనను వినిపిస్తున్నారు.
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
కూటమి మధ్య తేడాలు రావాలని కోరుకునే వైసీపీ
వైసీపీ పార్టీ కూటమి మధ్య తేడాలు రావాలని కోరుకుంటుంది. ఎందుకంటే కూటమి కట్టడం వల్లనే వైసీపీ భారీగా ఓడిపోయింది. ఆ పార్టీల మధ్య తేడాలు వస్తే ఓట్లు చీలిపోతాయి. వైసీపీకి కావాల్సింది కూడా ఇదే . అందుకే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసినప్పటి నుండి పార్టీల మధ్య గ్యాప్ పెంచాడానికి ఎలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వాలో అలాంటివి ఇస్తున్నారు. ఈ అంశంపై వైసీపీకి కౌంటర్ ఇచ్చేందుకు జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ వంటి వారు ప్రయత్నించారు.అయితే వైసీపీ మాత్రం తన మీడియా, సోషల్ మీడియా సపోర్టుతో పవన్ కల్యాణ్‌పై టీడీపీ క్యాడర్,లీడర్లలో నెగెటివ్ పెంచాలని చాలా ప్రయత్ం చేసిందని అనుకోవచ్చు. ఎంత సక్సెస్ అయిందనే విషయం పక్కన పెడితే ఇలాంటి అవకాశం ఇచ్చింది పవన్ కల్యాణే అనుకోవచ్చు.
Also Read: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
పవన్ కావాలనే అన్నారా ? ఆవేశంలో అన్నారా ?
పవన్ కల్యాణ్ డిప్యూటీసీఎంగా ఉంటూ చేసిన వ్యాఖ్యలు కాస్త విచిత్రంగానే ఉన్నాయి. అందుకే ఏపీలో కూటమి మధ్య బీటలు అని జాతీయ మీడియాలో కూడా హైలెట్ అయింది. పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు కావాలని చేశారా లేకపోతే.. యాధృచ్చికంగా అన్నారా అన్నదానిపై జనసేన వర్గాల్లోనే స్పష్టత లేదు. పవన్ కల్యాణ్ ఈ మధ్య బ్యాలెన్సుడ్‌గా రాజకీయాలు చేస్తున్నారని ప్రతీ మాట ముందూ వెనుకా ఆలోచించే అంటున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అదే్ నిజం అయితే ఆయన నిజంగానే వ్యూహాత్మకంగా అని ఉంటారని అనుకోవచ్చు. అ వ్యూహం ఏమిటో ఆయనకే తెలియాలి. అయితే ఈ మాటల కారణంగా కూటమి మధ్య కనిపించని బీటలు మాత్రం ఏర్పడ్డాయని ఎక్కువ మంది అభిప్రాయం.