Deputy CM Pawan Kalyan: వైఎస్ జగన్ , షర్మిల మధ్య ఆస్తుల వివాదానికి కారణం అయిన సరస్వతి పవర్ భూములను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. గురజాల నియోజకవర్గంలోని వేమవరం వద్ద ఉన్న భూముల్ని పరిశీలించిన తర్వాత అక్కడ మాట్లాడారు. భూముల ఇచ్చేది లేదని చెప్పిన రైతుల మీద పెట్రోల్ బాంబులతో దాడి చేసి మరీ భూముల్ని లాక్కున్నారని ఆరోపించారు. ఇన్నేళ్లయినా ఇంకా రైతులకు పరిహారం అందలేదన్నారు. తాము మెతకగా ఉండబోమని.. కఠినంగా ఉంటామని చెప్పేందుకే సరస్వతి పవర్ భూముల్ని పరిశీలించడానికి వచ్చానన్నారు.
ఉద్యోగాలిస్తామని ఆశ పెట్టి భూముల సేకరణ
వైఎస్ హయాంలో రైతుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి భూముల్ని సేకరించారని అన్నారు. అటవీ భూమల్ని కూడా కబ్జా చేశారని.. మూడు వందల ఎకరాల అటవీ భూమిని రెవిన్యూకు మార్పించి తీసుకున్నారని ఆరోపించారు. ఆ భూమిలో దళితులకు కేటాయించిన అసైన్డ్ భూమి కూడా ఉందన్నారు. 27 ఎకరాల మేర చెరువులు కుంటల భూమి కూడా ఉందని పవన్ ప్రకటించారు. ఇప్పటికీ సరస్వతి పవర్‌కు భూములిచ్చిన రైతులకు న్యాయం జరగలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఫ్యాక్టరీ రాలేదు.. భూములలిచ్చిన రైతులకు ఉద్యోగాలివ్వలేదు కానీ సొంత ఆస్తి మాదిరిగా ఆ భూముల కోసం అన్నా చెల్లెళ్లు కొట్టకుంటున్నారని పవన్ మండిపడ్డారు.
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ
సిమెంట్ ఫ్యాక్టరీ పేరు చెప్పి పవర్ ప్రాజెక్టు పేరుతో అనుమతులు
అనుమతులపైనా పవన్ ఆరోపణలు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అనుమతి ఇవ్వరనే వైఎస్‌ఆర్ హయాంలో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పి భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఈ భూములపై అనేక అనుమానాలు ఉన్నాయని, అందుకే విచారణకు ఆదేశించామని వివరించారు. 20 లక్షల ఫర్నిచర్ కోసం కోడెలను వేధించారు. పేదలకు ఇచ్చిన భూములు కూడా బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. మేం మెతక వైఖరితో లేమని చెప్పడానికి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నామని పవన్ స్పష్టం చేశారు.
మాచవరం మండలంలోని వేమవరం, చెన్నాయపాలెంలో ఉన్న సరస్వతి పవర్ భూములను పవన్ పరిశీలించారు. పవన్ వెంట గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. పవన్ తన పర్యటన సందర్భంగా, భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడారు. పవన్ రాకతో సరస్వతి పవర్ భూముల వద్ద భారీ కోలాహలం నెలకొంది. కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో, వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.