Rahul Gandhi On Caste Census : తెలంగాణలో జరుగుతున్న కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లోని బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో నిర్వహించిన సంవిధాన్ సమ్మాన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తగా ఇప్పటికీ అన్ని రంగాల్లో కుల వివక్ష ఉందన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి కులగణన అవసరం అన్నారు. ఏ వ్యవస్థలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారో తెలియాల్సిఉందన్నారు. కులగణనతో అభివృద్ధి , రాజకీయ స్థితిగతులు మారుతాయని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.
అన్ని రంగాల్లో కుల వివక్ష ఉంది : రాహుల్
తాను దేశవ్యాప్తంగా పర్యటించినప్పుడు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కుల వివక్ష ఉందని తాను గుర్తించానని అన్నారు. అగ్రకులాలకు ఎప్పుడూ కుల వ్యవస్థ కనిపించదన్నారు.కుల వివక్ష కారణంగా ఇతర కులాల వారు అవకాశాలు కోల్పోతున్నారని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి రాగానే యాభై శాతం రిజర్వేషన్లను ఎత్తి వేస్తామని కులగణన ద్వారా సమానంగా అందరికీ అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. ఈ విషయంలో తాను అందరికీ అవకాశం కల్పిస్తానన్నారు.
కింది కులాలకు అవకాశాలు కల్పించడం కోసమే కులగణన
దేశంలోని అన్ని వ్యవస్థల్లో కుల వివక్ష ఉందన్నారు. రాజకీయ న్యాయవ్యవస్థల్లో ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలోని పారిశ్రామికవేత్తల్లో ఎస్‌సీ, ఎస్‌టీ, గిరిజన కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ప్రతిభ ఉన్నప్పటికీ వారికి పాలనా వ్యవస్థలో భాగస్వాములయ్యే అవకాశం కింది కులాలకు రావడం లేదన్నారు. అందువల్లే తాము కులగణన చేపట్టామని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపడుతున్న కులగణన అంటే అది కేవలం కులాల లెక్కలు కాదు. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు పునాది అని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. మేము దేశాన్ని చీల్చాలని ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారని...దేశంలో సంపదను ఎవరి వాటా వారికి ఇవ్వడం దేశాన్ని చీల్చడమా అని రాహుల్ ప్రశ్నించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రశ్నలు తయారు చేయాలని రాహుల్ సూచించారు.
కులగణనలో దేశానికే తెలంగాణ ఆదర్శం
కులగణన చేసినంత మాత్రాన సరిపోదు. వివిధ కులాల మధ్య సంపద పంపిణీ ఎలా ఉందో అధ్యయనం చేయాలి. అదేవిధంగా బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, మీడియాలో ఓబీసీలు, దళితులు, కార్మికుల భాగస్వామ్యం ఎంతుందో కూడా తెలుసుకోవాల్సి ఉందన్నారు. అందుకే కులగణన చేపట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన జరుపుతుందని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తుందని స్పష్టంచేశారు. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్సంగా ఉంటుందని ఈ విషయంలో తాను తెలంగాణ నాయకత్వాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. రాహుల్ గాందీ కార్యక్రమానికి ప్రముఖులైన ఆహ్వానితుల్ని మాత్రం సమావేశంలోకి ఆహ్వానించారు. రాహుల్ ప్రసంగిస్తూండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్రాన్స్ లేట్ చేశారు.
కులగణనకు ఏర్పాట్లు పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం
మరోే వైపు నవంబర్ 6 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కుల గణన ప్రక్రియ మొదలుకానుంది. ఈ సమగ్ర కుటుంబ సర్వే ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. స్కూలు టైమింగ్స్ పూర్తయ్యాక ఉపాధ్యాయులు రోజుకు 5 నుంచి 7 ఇళ్లల్లో సమగ్ర సర్వే చేయనున్నారు.