Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. వచ్చే డిసెంబర్ 20 వరకు సమావేశాలు జరుగనున్నాయి. పార్లమెంట్ ఉభయసభలు సమావేశపరచాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ధృవీకరించారు.
కిరణ్ రిజుజు ప్రకటన వైరల్ గామారుతోంది. సాధారణంగా బడ్జెట్ సమావేశాలప్పుడు ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. కానీ శీతాకాల సమావేశాల సమయంలో ఇలా సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం కోరడం. దానికి రాష్ట్రపతి అంగీకరించడం ఆసక్తి రేపుతోంది. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ ప్రతిపాదనపై ఈ శీతాకాల సమావేశాల్లో కీలకంగా చర్చిస్తారని ఇప్పటికే ఓ స్పష్టత ఉంది. వక్ఫ్ సవరణ బిల్లు 2024కు కూడా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోద ముద్ర వేయించకోవాలని కేంద్రం పట్టుదలగా ఉంది.
‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ ప్రతిపాదన, వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయసభల సంయుక్త సమావేశం మంచిదని కేంద్రం అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పెట్టాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంచుంది. రాజ్యాంగ సవరణ కోసం వన్ బై త్రీ సపోర్టు ఉండాలి. విడివిడిగా సభలను ఏర్పాటు చేస్తే అలాంటి మద్దతు లభించడం కష్టం కాబట్టి.. సంయుక్త సమావేశాలను ఏర్పాటు చేస్తే నెంబర్ కలసి వస్తుందని బీజేపీ వ్యూహకర్తలు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు కానీ.. ఎక్కువ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఆ బిల్లును కూడా శీతాకాల సమావేశాల్లో ఆమోదించాలని అనుకుంటున్నారు.
‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. జమిలి ఎన్నికల నిర్వహణ కోసం 18 రాజ్యాంగ సవరణలను ఈ హైలెవల్ కమిటీ సిఫార్సు చేసింది. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ అంటే దేశంలోని ఓటర్లు అందరూ లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకేసారి ఓటు హక్కును వినియోగించుకోవడం.ఇలా చేయడం వల్ల ప్రాంతీయ పార్టీలు ఉండవని .. ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే అన్ని పార్టీలూ కాదు.