Farmhouse Floods :  హైదరాబాద్‌లో వారం తర్వాత వరుణుడు తెరిపినిచ్చాడు. ఎప్పుడైనా ఓ పూటవర్షం దంచి కొడుతుంది. రెండు మూడు రోజులు ముసురు పడుతుంది. కానీ ఈ సారి మాత్రం ఏకంగా వారం రోజుల పాటు వర్షం పడుతూనే ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండిపోయింది. ఇక జంట జలాశయాలుగా పేరు తెచ్చుకున్న హిమాయత్ సాగర్, గండిపేట  మాత్రం నిండలేదు. కానీ నిండకుండానే ఎందుకైనా మంచిదని నీళ్లు దిగువకు వదిలారు. గోదావరి వరదల ఇష్యూలో దీనికి అంత ప్రాధాన్యత లభించలేదు కానీ.. చేవెళ్ల మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాత్రం హైలెట్ చేశారు. అసలు ఈ రెండు సాగర్‌లు నిండకుండానే నీళ్లు వదలడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. 






జంట జలాశయాను నిండుగా ఉంచుకునేందుకు ఇప్పటి వరకూ  ప్రాధాన్యం


గండిపేట , హిమాయత్ సాగర్ లకు వర్షాకాలంలో నీళ్లు చేరాలన్న ఉద్దేశంతో ఆ జలాశయాల క్యాచ్‌మెంట్ ఏరియాలో నిర్మాణాలపై ఆంక్షలు విధిస్తూ జీవో నెం 111 తీసుకొచ్చారు. అయితే దశాబ్దాలుగా ఆ జీవోను ఉల్లంఘిస్తూ అనేక మంది ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారు. ఇదే అంశాన్ని ప్రస్తావించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రెండు జలాశయాల్లో పూర్తి స్థాయిలో నిల్వ ఉంచితే ఇల్లీగర్ ఫామ్ హౌస్‌లు, ఇల్లీగర్ లే ఔట్‌లు మునిగిపోతాయన్న ఉద్దేశంతో వారిని కాపాడటానికే రెండు జలాశయాలు నిండకుండానే నీళ్లు దిగువకు వదిలారని అంటున్నారు. అంటే ఇక జలాశయాలు నిండవని అంటున్నారు. ఇటీవల ప్రభుత్వం జీవో నెం 111 ను రద్దు చేసింది. ఇది  కూడా అక్రమార్కులకు అండగా ఉండటానికేనని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. 


ఫామ్‌హౌస్‌లు మునిగిపోతాయన్న కారణంగానే ఖాళీ చేయిస్తున్నారన్న కొండా 


కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను ఎప్పుడూ టార్గెట్ చేస్తూ ఉంటారు. జంట జలసశయాల నీటి విడుదల గురించి కూడా వారినే టార్గెట్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం.. ఈ జలాశయం పరిధిలోని క్యాచ్ మెంట్ ఏరియాలోనే మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ఉందని దుమారం రేగింది. ఎన్జీటీకీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే హైకోర్టుకు వెళ్లికి ఆ ఫామ్‌హౌస్‌కు.. కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదన్న క్లారిటీని కేటీఆర్  వైపు నుంచి ఇప్పించారు. అయితే రాజకీయాల్లో ఆరోపణలు చేస్తే ఓ వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి వాటిని పెంచేందుకు తన ట్వీట్ ద్వారా ప్రయ్నించారని చెబుతున్నారు. 


కొండా ఆరోపణలతో రాజకీయంగా కలకలం


గతంలో జంట జలశయాలు భాగ్యనగర వాసుల మంచి నీటి అవసరాలకు కీలకం. అందుకే ఆ జలాశయాల్లో నీరు ఎండిపోతే ప్రజలకు కష్టాలు ఎదురయ్యేవి. అయితే ఇప్పుడు వాటి గురించి చాలా పరిమితంగా నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. అందుకే నీటి నిల్వ అవసరం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేస్తే ఎవరికి ఇబ్బందన్న ప్రశ్న కొండా వైపు నుంచి వస్తోంది. అదే విషయాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జీవో నెం 111 ఉల్లంఘించిన వారికేనా అన్న చర్చ అందుకే వస్తోంది.