Five States Assembly Elections:


తెలంగాణ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, మిజోరంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాసేపట్లో నగారా మోగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించనుంది. గత ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు వచ్చాయి. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. 


2018లో రాజస్థాన్ లో కాంగ్రెస్ జోరు


దేశంలోనే వైశాల్యంలో అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాజస్థాన్‌‌లో 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి అశోక్‌‌ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్‌‌ ప్రచారం చేస్తోంది. 2003 తర్వాత ఏ ప్రభుత్వాన్నీ వరుసగా గెలిపించని రాజస్థానీలు, ఈ సారి ఎవరికి పట్టం కడతారో అన్నది ఆసక్తికరంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 108 సీట్లు రావడంతో అశోక్ గెహ్లట్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజార్టీ 101 సీట్లు మాత్రమే. అయితే 108 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. ఆ తర్వాత 13 మంది స్వతంత్రులతో పాటు ఆర్ఎల్డీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ బలం 122కి పెరిగింది. బీజేపీకి 70, భారతీయ ట్రైబల్ పార్టీ 2, కమ్యూనిస్టు పార్టీకి రెండు సీట్లు చొప్పున వచ్చాయి. 


తొలిసారి హస్తం చేతికి అధికారం


 90 నియోజకవర్గాలున్న చత్తీస్ గఢ్ లో, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.  చత్తీస్ గఢ్ అంటేనే ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం. ఇక్కడ ఎస్టీల్లో మెజారిటి వర్గాలు హస్తం పార్టీకే మద్దతుగా నిలుస్తున్నారు. బస్తర్ జిల్లాలోని 12 సీట్లూ, ఇపుడు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గినా మెజారిటి మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 68 సీట్లు వస్తే, బీజేపీ 15 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెజార్టీ 46 సీట్లు రావాల్సి ఉంటే హస్తం పార్టీకి ఏకంగా 68 వచ్చాయి. అధికార పార్టీలో చిన్న ఆధిపత్య గొడవలే తప్ప చెప్పుకోదగ్గ అవినీతి ఆరోపణలు లేకపోవటమే కాంగ్రెస్ పార్టీకి ప్లస్సవుతోంది. సుక్మా, రాయపూర్, జగదల్ పూర్, బిలాస్ పూర్, అంబికాపూర్, కోబ్రా, రాయగఢ్ ప్రాంతాల్లో మెజార్టీ వస్తుందన్న ధీమాలో కాంగ్రెస్ ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించింది. రాష్ట్రంలో కుర్మీలు రెండో అతిపెద్ద సామాజికవర్గంగా ఉన్నారు. భూపేష్ భగేల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 


2018లో మధ్యప్రదేశ్ లో హంగ్


2018లో  మధ్యప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించింది. 234 సీట్లుంటే 114 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అయితే మెజార్టీకి రెండు సీట్ల దూరంలో ఆగిపోయింది. భారతీయ జనతా పార్టీకి 109 వచ్చాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రెండు పార్టీలు దాదాపు 41% ఓట్లను సాధించాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల తేడా కేవలం 47,827 మాత్రమే. ఈ రెండు పార్టీలలో ఏ ఒక్కటీ 116 సీట్లతో మెజారిటీని సాధించకపోవడంతో హంగ్ ఏర్పడింది. గత 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఓటర్లు ఆ పార్టీని ఆదరించలేకపోయారు. స్వతంత్రులతో కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టారు. అయితే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేకపోయారు. తర్వాత శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రి అయ్యారు. 


మిజోరాంలో కాంగ్రెస్ పరాభవం


మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్  విజయం సాధించింది. ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఎంఎన్‌ఎఫ్‌కు 26 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఎంఎన్ఎఫ్‌కు 65 శాతం ఓట్లు దక్కాయి. మిజోరంలో మొత్తం 40 శాసనసభ స్థానాలున్నాయి. మెజారిటీ మార్క్ 21. ఎంఎన్ఎఫ్ 26 స్థానాల్లో విజయం సాధించింది.  కాంగ్రెస్‌కు కేవలం 5 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు.