September 17 : 1948, సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ రాజ్యం భారతదేశంలో కలిసి పోయింది.  స్వాతంత్య్రానికి పూర్వం భారత్‌లోని వందలాది సంస్థానాల్లో హైదరాబాద్‌, కశ్మీర్‌ రాష్ట్ర, దేశ ప్రతిపత్తి గల పెద్ద సంస్థానాలు. ఇవి ఢిల్లీలోని కేంద్ర పాలకుల సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ, ఆంగ్లేయులకు పన్నులు చెల్లిస్తూ దేశంలో భాగంగానే ఉన్నాయి. హైదరాబాద్‌ సంస్థానం ముస్లిం రాజుల పాలనలో ఉంటే, కశ్మీర్‌ సంస్థానం హిందూ రాజుల పాలనలో ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత రెండు సంస్థానాలు దేశంలో విలీనం అవడానికి వెనుకాడాయి. హైదరాబాద్ నిజాం రాజులపై సైనిక చర్య చేపట్టి 1948, సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ రాజ్యాన్ని అధికారికంగా విలీనం చేశారు.  1948, సెప్టెంబర్‌ 17న పోలీస్‌ చర్య జరిగినప్పుడు, నిజాం నవాబు ముందు బెట్టు చేసినా చివరికి భారత సైన్యానికి లొంగిపోయి పాలన నుంచి తప్పుకొన్నారు.

  
 
రాజాకార్లపై పోరాడిన కమ్యూనిస్టులు !


1946లో కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకత్వంలో హైదరాబాద్‌ సంస్థానంలో భూస్వామ్య వ్యతిరేక సాయుధ రైతాంగ పోరాటం ఆరంభమైంది. దేశ స్వాతంత్య్రానికి పూర్వమే తెలంగాణలో ఆంధ్ర మహా సభ ఉద్యమం భూస్వామ్య దొరల ఆగడాలకు వ్యతిరేకంగా ఉధృతంగా సాగింది. రజాకార్లు, దొరల సైన్యాలు, నిజాం పోలీసుల చేతిలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.   ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా  పట్టువదలని పోరాట పరిస్థితులలో నిజాం నవాబు ఉస్మాన్‌ అలీ ఖాన్‌ విధి లేని పరిస్థితుల్లో హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌ లో విలీనం చేశారు. ఈ సందర్భంగా నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ను సర్దార్‌ పటేలే 1956 అక్టోబర్‌ 31 వరకు రాజ్‌ ప్రముఖ్‌ గా కొనసాగించారు.  ఆయనకు నష్ట పరిహారాలు, రాజాభరణాలు ఇచ్చే ఒప్పందం కుదుర్చుకున్నారు. రాజ్‌ ప్రముఖ్‌ పదవిలో ఉన్నందుకు, ఆ రోజుల్లోనే సంవత్సరానికి రూ.50 లక్షలు చెల్లించారు.
 
విలీనం కాదంటున్న టీఆర్ఎస్ ! 


హైదరాబాద్ స్టేట్ ఎప్పుడూ భారతదేశంలో భాగంగా లేకుండా లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నిజాం రాజు కేంద్ర పాలకుల సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ, ఆంగ్లేయులకు పన్నులు చెల్లిస్తూ దేశంలో భాగంగానే ఉంది. 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పోలీస్ యాక్షన్ నిర్వహించింది. మూడు రోజుల ఆపరేషన్ తరువాత నిజాం నవాబు.. నాలుగో రోజున సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశాడు. ఈ విధంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తరువాత హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం సిద్ధించింది.  అప్పటి వరకూ కేంద్ర పాలకులు కూడా సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ పరస్పర సహకారంతో పరిపాలన కొనసాగించారు. అందుకే సెప్టెంబర్‌ 17ను విమోచన దినంగా కాకుండా ‘జాతీయ సమైక్యతా దినం’గా జరుపాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.  


విమోచనం అంటున్న బీజేపీ ! 


సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని బీజేపీ, సంఘ్‌ పరివార్‌ డిమాండ్‌ చేస్తున్నాయి.  దేశంలో అనేక సంస్థనాలు విలీనం చేసినా ఎక్కడా లేంది.. తెలంగాణలో మాత్రమే ఈ అభిప్రాయ భేదాలు, సైద్ధాంతిక పట్టింపులు వచ్చాయి.  కేంద్ర సర్కారు, తెలంగాణ సర్కారు మధ్య వ్యూహ, ప్రతివ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ సర్కారు   నిర్ణయించింది. కర్నాటక, మహారాష్ట్రలు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు నిర్వహించరాదన్న ప్రశ్న మొదటి నుంచి వస్తోంది. ఏదో ఓ పేరు  ఎంచుకొని... అధికారికంగా ఎందుకు నిర్వహించరన్న ప్రశ్నకు..  ఇప్పుడు సమాధానం లభిస్తుంది. 


కారణం ఏదైనా కావొచ్చు కానీ దాదాపుగా 75ఏళ్లకు కానీ..  హైదరాబాద్ స్టేట్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమవడంపై సంపూర్ణమైన చర్చ జరుగుతోంది.