Code Tension : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సామాన్యులకు ముప్పు తిప్పలు తెచ్చిపెడుతోంది. షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రూ. 50 వేల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా మొత్తం స్వాధీనం చేసుకుంటున్నారు.లెక్కలు చెబితే సరే లేకపోతే.. కేసులు పెట్టేస్తున్నారు. నిజానికి కోడ్ లక్ష్యం ఎన్నికల అక్రమాలు నిరోధించడం. ఈ పేరుతో సామాన్యులను వేధించడం కాదు. కానీ పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న డబ్బు.. అత్యధికం రాజకీయ నేతలది కాదు. సామాన్యులదే్. అసలు బలి అవుతోంది సామాన్యులే. ఎంతగా అవగాహన పెంచేందుకు ప్రయత్నించినా.. ప్రజలు కోడ్ బారిన పడుతూనే ఉన్నారు.
ప్రతీ రోజూ కోట్ల కొద్దీ డబ్బు పట్టివేత
రాజకీయ నాయకులు ఎన్నికల కోసం తరలిచే సొమ్ముల్ని పట్టుకోవడానికి అక్రమాల్ని నిరోధించడానికి ఎన్నికలకోడ్ అమల్లోకి తెస్తారు. రాజకీయ నాయకులు ఈ విషయంలో పుట్టెడు తెలివి తేటలతో ఉంటారు. వారు ఎన్నికల కోసం తరలించే సొమ్ము దొరుకుతుందో లేదో కానీ కోడ్ పేరుతో సామాన్యులు ఎవరైనా నగదు, బంగారం మాత్రం పట్టుబడుతోంది. కోడ్ అమల్లోకి వచ్చిందని సోమవారం నుంచి హైదరాబాద్ చుట్టుపక్కన పోలీసులు చేసిన సోదాల్లో ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించిన సొమ్ము పట్టుబడలేదు. కానీ.. వివిధ వ్యవహారాలతో… తమ వెంట డబ్బులు తీసుకెళ్తున్న అనేక మంది మాత్రం….దొరికిపోయారు. ఆ రోజు నుంచి రోజూ పట్టుకుంటూనే ఉన్నారు. అయితే ఒక్క కేసులోనూ ఇది ఫలానా రాజకీయ పార్టీ లేదా.. రాజకీయ నేతకు సంబంధించినదన్న సమాచారం లేదు. కేవలం పత్రాలు లేని కారణంగా స్వాధీనం చేసుకున్నామనే చెబుతున్నారు.
నగదు వ్యవహారాలు జరిపేవారికి కష్టమే !
హైదరాబాద్ శివారులో మరో ప్రాంతం ఓ వైద్యుడు స్థలం అమ్మిన డబ్బులతో వెళ్తూంటే పట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో స్థలం అమ్మితే ప్రభుత్వ విలువ ప్రకారం చెక్కులు తీసుకుని.. మిగతా వాటికి నోట్లు ఇస్తారు. ఇప్పుడు ఆ నోట్లన్నీ పోలీసుల పాలయ్యాయని ఆ వైద్యుడులబోదిబో అంటున్నాడు. నిబంధనల ప్రకారం రూ. యాభై వేలు మాత్రమే నగదు ఉంచుకోవాలని పోలీసులు చెబుతున్నారు. అంత కంటే ఎక్కువ ఉంటే స్వాధీనం చేసుకుంటారు. లెక్కలు చూపిస్తే ఇస్తారు. ఈ లెక్కలు చూపించడం కంటే వారిని నమ్మించడమే కష్టం.ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది… ఎన్నికల అక్రమాలు జరగకుండా నిరోధించడానికే. ఎన్నికలకు సంబంధం ఉన్న ప్రతి డబ్బు, బంగారాన్ని పట్టుకోవాలి. అందులో సందేహం లేదు. ఈ పేరుతో సామాన్యుల్ని ఇబ్బంది పెడితే… సమస్య జఠిలం అవుతుంది కానీ.. పరిష్కారం కాదు.
సామాన్యులకు కోడ్ పై అవగాహన పెంచే ప్రయత్నాలేవి ?
ఎన్నికలతో సామాన్యులకు పెద్దగా సంబంధం ఉండదు. వారి రోజువారీ వ్యవహారాలు వారు చేసుకుంటూ ఉంటారు. అందుకే కోడ్ గురించి వారికి తెలియదు. దీనిపై ప్రభుత్వాలు లేదా ఈసీ కల్పించే అవకాహన కూడా తక్కువే. అందుకే సామాన్యులే ఎక్కువ ఇ్బబంది పడుతున్నారు. 50 వేల రూపాయలకు మించి.. మీరు తీసుకెళ్లే డబ్బుకు కచ్చితంగా రసీదు, ఇతర డాక్యుమెంట్లు కచ్చితంగా ఉండాలి. అలా లేని పక్షంలో.. మీరు తనిఖీల్లో దొరికినట్లయితే.. ఎన్నికల అధికారులు, పోలీసులు, ఇతర టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ డబ్బును సీజ్ చేస్తారు. కేవలం డబ్బు మాత్రమే కాదు.. బంగారం, వెండి వంటి ఆభరణాలను సైతం పెద్ద మొత్తంలో తీసుకెళుతున్నట్లయితే వాటికి సరైన పత్రాలు వెంట తీసుకెళ్లాలి. ఒక వేళ ఆస్పత్రి, ఇతర అత్యవసరాల కోసం డబ్బు తీసుకెళుతున్నట్లయితే.. ఆ రోగికి సంబంధించిన ఆస్పత్రి రిపోర్టులు మీ వెంట పెట్టుకోవాలి.
సామాన్యులకే తప్ప.. రాజకీయ నేతలపై ప్రభావం ఉండదు !
కోడ్ పేరుతో సామాన్యులు చాలా టెన్షన్ పడతారు కానీ.. రాజకీయ నాయకులు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కారు అని ఇటీవల జరిగిన ఎన్నికలే నిరూపించాయి. ఎక్కడా నగదు చెలామణి తగ్గలేదు. కావాల్సినంత జరిగింది. పట్టుబడింది కూడా తక్కువే. నగదు పట్టుబడితే ఏదో ఓ కారణం చూపించి వారి సొమ్ము తీసుకెళ్లిపోతారు..కానీ సామాన్యులు మాత్రం అధికంగా నష్టపోతున్నారు.