Minister KTR: ఎన్నికల షెడ్యూల్ రావడంతో తెలంగాణలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆయన సమక్షంలో దేవరకొండ బిల్యానాయక్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్‌ వాళ్లకు ఎన్నికలంటే ఏటీఎం అని విమర్శించారు. గతంలో ఓటుకు నోటు అయితే.. ఇప్పుడు  సీటుకు నోటు అంటూ సటైర్లు వేశారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డిని రేవంత్‌ అనడం లేదని, రేటెంత.. రేటెంత.. అంటున్నారని ఎద్దేవా చేశారు. 


కొడంగల్‌లో ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మళ్లీ  పోటీ చేస్తున్నాడని విమర్శించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. ఫ్లోరోసిస్‌ తప్ప ఏమిచ్చిందని నిలదీశారు. సీఎం కేసీఆర్‌ తొమ్మిదేళ్లలో తెలంగాణను నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దారని మంత్రి అన్నారు. దేవరకొండ నియోకజకవర్గంలో ఐదు లిఫ్ట్‌ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు రూ.600 కోట్లతో జరుగుతున్నాయని, ఏడాది కాలంలో అన్నీ పూర్తవుతాయని అన్నారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.


కేటీఆర్‌పై ఫిర్యాదు
తెలంగాణ బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఓ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం బీఆర్ఎస్ కు వేయాలని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియామావళికి విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ నేత వేణుగోపాలస్వామిప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్ పై చర్యలు తీసుకోకుంటే తాము కోర్టుకు కూడా వెళతామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ ప్రజాస్వామ్యాన్న అపహాస్యం చేస్తున్నార ఆరోపించారు. 


డబ్బులు వేరే పార్టీల వద్ద తీసుకుని, ఓట్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వేయాలని ఓటర్లను ప్రోత్సహిస్తున్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రిపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటీవల జరిగిన సభలలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ డబ్బులు ఇస్తే తీసుకోవాలని ఓట్లు మాత్రం తమకు వేసి కేసీఆర్ ను మరోసారి సీఎం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడితే, రాష్ట్రంలో అభివృద్ధి మరో స్థాయికి వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలపై ఇతర పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పంచాలని, ప్రజలు పైసలు తీసుకుని ఓట్లు వేయాలని చెప్పడం ప్రలోభాలకు గురిచేయడమేనని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.


ప్రచారాల హోరు
ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా..కాంగ్రెస్ పార్టీ మరికొన్ని రోజుల్లో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాష్ట్రం వ్యాప్తంగా ఈనెల 15 నుంచి పర్యటించనున్నారు. దీంతోపాటు ఈనెల 15న బీజేపీ కూడా తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రులను ప్రచారంలోకి దింపాలని చూస్తుండగా..కాంగ్రెస్(congress) పార్టీ మళ్లీ రాహుల్ గాంధీని ఈ ఎన్నికల ప్రచారంలో భాగం చేయాలని చూస్తోంది.