వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడుగా మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నియమితులయ్యారు. ఆ పార్టీకి మొదట నుంచి వీర విధేయుడుగా ఉన్న దాసన్నకే జిల్లా పగ్గాలను అప్పగించారు జగన్. జిల్లా రథసారధి ఆయనేనని క్యాడర్‌కి సంకేతాలు ఇచ్చారు.
అందరితో సత్ససంబంధాలు కలిగిన దాసన్నకి సౌమ్యుడుగా జిల్లాలో గుర్తింపు ఉంది. మొదట నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి విధేయుడుగా ఆయన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో మొన్నటి వరకూ మంత్రిగా సేవలను కృష్ణదాస్ అందించారు. ఉపముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్రంలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో పలువురు మంత్రులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుగా చెప్పిన దాని ప్రకారం తప్పించారు. మంత్రి వర్గం నుంచి బయటకు వచ్చిన వారికి పార్టీ బాధ్యతలను అప్పగిస్తానని కూడా సిఎం ముందే వారికి చెప్పారు. అందులో భాగంగానే కృష్ణదాస్ ను శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి నియమించారు.
జిల్లా అధ్యక్షులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ఈ క్రమంలో అందరిని సమన్వయం చేసుకోగలిగిన నేతలకు పగ్గాలను అప్పగించింది. కృష్ణదాస్‌కి శ్రీకాకుళం జిల్లా పగ్గాలు అందించడంతో జిల్లాలోని వైకాపా నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతన అధ్యక్షుడి పేరు ప్రకటించిన వెంటనే శ్రీకాకుళం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు ధర్మాన కృష్ణదాస్‌ను కలుసుకుని శుభాకాంక్షలను తెలియజేసారు.
8 నియోజకవర్గాలలో గెలుపే లక్ష్యం- ధర్మాన కృష్ణదాస్
రానున్న 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే తన లక్ష్యమని నూతన పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తనకు జిల్లా పార్టీ పగ్గాలను అప్పగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు. జిల్లాలోని పార్టీ నేతలను అందరిని కలుపుకుని వైకాపా బలోపేతానికి కృషి చేస్తాన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి సిఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని కృష్ణదాస్ స్పష్టం చేసారు.
గతంలో వాలంటీర్ల సభలో వైసీపీ మళ్లీ గెలవకుంటే రాజకీయా సన్యాసం తీసుకుంటామన్నారు ధర్మాన కృష్ణదాస్. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని టీడీపీకి మళ్ళీ ఇంటికి పంపించే పనిలోనే ఉన్నామన్నారాయన. 2024లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడకపోతే తమ కుటుంబం మొత్తం రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ విసిరారు.
గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కృష్ణదాస్ ఎలా మన్వయం చేసుకుంటారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నేతలంతా బయటికి కలిసిమెలిసి ఉన్నట్టు కనిపిస్తారే కానీ లోలోపల మాత్రం అందరికీ కక్షలతో కూడుకొని ఉంటున్నారు. ధర్మాన సోదరుడు ఇద్దరు మధ్య కార్యకర్తలు అయితే నలిగిపోయే పరిస్థితి వస్తుంది. గతంలో అన్న దగ్గర నుంచి తమ్ముడు దగ్గరికి వెళితే అక్కడికి ఎందుకు వెళ్లారని కస్సుబస్సులాడిన సందర్భాలు చాలానే ఉన్నాయంటున్నారు.
ధర్మాన ప్రసాద్‌కు మంత్రి పదవి వచ్చిన తర్వాత కార్యకర్తలు, అభిమానులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే సోదరుడు ధర్మాన కృష్ణదాస్ విశాఖపట్నంలోనే ఉండి కూడా కనీసం ఆ సభకి రాకపోవడంతో ఆశ్చర్యపరిచింది. కార్యకర్తలు అందరూ కూడా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి ఆ సభకు ఎవరైనా వెళ్తే వారి మీద తగిన చర్యలు తీసుకుంటామని కృష్ణ దాస్ కొడుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. అందువల్లే రాలేకపోయానని దయచేసి మమ్మల్ని తప్పుగా అనుకోవద్దని ధర్మాన ప్రసాద్ అనుచరులకు కొందరు లీడర్లు సమాచారం ఇచ్చారు.
ఒకే కుటుంబం అయినప్పటికీ రాజకీయంగా ఇద్దరు కూడా శత్రువుల్లా తయారయ్యారని కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఎన్నోసార్లు అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం మారలేదు. అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటేనే రానున్న ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని అధిష్ఠానం చెప్పినా పట్టించుకున్న వారు లేరు. ఇప్పుడు ఒకరు మంత్రిగా, మరొకరు జిల్లా అధ్యక్షుడిగా రెండు పవర్ సెంటర్‌లు అవుతున్నాయని... దీన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటోంది క్యాడర్.