Telangan Congress : అనుకున్నదే జరుగుతోందా ? లేదంటే ప్లాన్ ప్రకారమే ప్రయత్నాలు జరుగుతున్నాయా ? ఇప్పుడిదే రాజకీయవర్గాల్లో చర్చ. నిన్నటివరకు చాపకింద నీరులా ఉన్న కాంగ్రెస్ ఇంటి పోరు ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో రోడ్డున పడింది. బహిరంగంగానే రేవంత్ వర్సెస్ ఆయన వ్యతిరేకవర్గీయుల సవాళ్లతో కాంగ్రెస్ మరింతగా దిగజారిపోయిందన్న విమర్శలు వచ్చాయి. అయినా సరే ఎవరికి వారే తగ్గేదేలే అన్న రేంజ్ లో రెచ్చిపోతున్నారు. పరిస్థితిని చక్కబెట్టడానికి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూరే చివరకు చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందని సమాచారం. ఎలాగైనా సరే ఇంటిపోరుని చక్కదిద్ది మునుగోడుని మళ్లీ కాంగ్రెస్ వశం చేసుకోవాలని పెద్దాయన పరుగుపరుగున ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాడు. గాంధీభవన్ కు వచ్చిన ఠాగూర్ కి రేవంత్ వర్గీయులు తప్పించి మిగిలిన సీనియర్లంతా డుమ్మా కొట్టారు.
మధు యాష్కీ ఎక్కడ? గొంతెత్తిన మర్రి శశిధర్ రెడ్డి !
అసలు మునుగోడు ఎన్నికల వ్యూహకర్త మధు యాష్కీనే ఈ మీటింగ్ కి రాలేదు. ఇక సిఎల్పీ నేతలు అంతా వరదబాధితుల పరామర్శలు, ముంపు ప్రాంతాల పర్యటన, ప్రాజెక్టుల సందర్శన అంటూ వెళ్లిపోయారు. వీరే కాదు మాజీ పీసీసీ నేత ఉత్తమ్, సీనియర్లు జానా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి వారు కూడా రాకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ ఇక దుకాణం బంద్ చేసుకోవడమే అన్న మాటలు హాట్ హాట్ గా వినిపిస్తున్నాయి. దీనికి తోడు AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి కూడా రాజీనామా చేస్తానని చెప్పడంతో మాణిక్యం ఠాగూర్ కి ఏం చేయాలో తోచడం లేదట. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఏకంగా ఆయనపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పరిస్థితి చేయిదాటిపోయిందని పూర్తిగా అర్థమయ్యిందట. ఎవరూ చెప్పినా కానీ చివరకు సోనియమ్మ, రాహుల్ పిలిచి మాట్లాడినా కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు వినే పరిస్థితిలో లేరనిపిస్తుంది.
అందరి టార్గెట్ రేవంత్ రెడ్డి !
రేవంత్ రెడ్డిని పీసీసీ నుంచి దింపే దాకా పరిస్థితి ఇలానే ఉంటుందన్న వాదనలు కూడా లేకపోలేదు. అయితే ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతోందన్న టాక్ కూడా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ ని ఓడించి తీరాలన్న కసితో పాటు తనపై వస్తున్న విమర్శలకు మునుగోడు విజయంతో చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే 22న మునుగోడు గ్రామాల్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను పెద్దల ఆదేశాల మేరకు జరపడమే కాదు దీన్ని సక్సెస్ చేయాలని పట్టుదలతో ఉన్నారు రేవంత్. అలాగే ప్రాజెక్టు, వరద బాధితులతో కష్టనష్టాలను తెలుసుకోనున్నారట. అయితే దీన్ని తిప్పి కొట్టి పీసీసీ పీఠం నుంచి రేవంత్ ని దింపాలని అందుకు మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకూడదన్న ఆలోచనతోనే ఈ విధంగా సీనియర్లు కొందరు వ్యతిరేకగళం విప్పుతున్నారని రేవంత్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి అందరూ అనుకున్నట్లే మునుగోడు ఎన్నిక కాంగ్రెస్ ని ముంచేసేలా ఉందని రాజకీయవర్గాల్లో గట్టిగానే చర్చనడుస్తోంది. అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టకపోతే ఆంధ్రలాగానే తెలంగాణలో కూడా ఇక కాంగ్రెస్ కనిపించకుండా పోతుందని రాజకీయవిశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
అంతా కలిసికట్టుగానే ఉన్నాం... గుట్టువిప్పిన మాణిక్యం ఠాగూర్..!
అయితే మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నారనీ AICC రాష్ట్ర వ్వవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్ అంటున్నారు. మునుగోడు మండల, గ్రామ ఇన్ ఛార్జ్ ల మీటింగ్ తర్వాత మాట్లడిన ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు మాత్రం “ మన కాంగ్రెస్ మన మునుగోడు పేరుతో గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనీ, ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుంది. మనం కష్టపడి పనిచేస్తే గెలువును ఎవరు ఆపలేరనీ, రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా 20వ తేదీ నాడు ప్రతి గ్రామంలో రాజీవ్ గాంధీ గారి చిత్ర పటానికి నివాళులు అర్పించి, కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనీ, రాజీవ్ గాంధీ దేశం కోసం చేసిన త్యాగాలను ప్రజలకు వివరించాలనీ, గాంధీ కుటుంబాల త్యాగాలను వివరించి ప్రజలకు అవగాహన కల్పించాలని” పార్టీ శ్రేణుల్ని కోరారు. బుధవారం జరిగింది ఓన్లీ మునుగోడు బై పోల్ కు సంబంధించి పార్టీ మండల, గ్రామ ఇన్ చార్జుల మీటింగ్ మాత్రమే, దీనికి మేం సీనియర్లను పిలవలేదని, మేం పిలిస్తే కొమటి రెడ్డి వెంకటరెడ్డితో సహా అందరూ వస్తారని AICC రాష్ట్ర వ్వవహారాల ఇన్ చార్జ్ మానిక్యం ఠాగూర్ చెప్పడం కొసమెరుపు.