Gudivada Amarnadh :  ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో టిక్కెట్లు ఇచ్చేటప్పుడు.. పదవులు ఇచ్చేటప్పుడే సామాజికవర్గాల గురించి చర్చించేవారు. కానీ ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులు నేరుగా కొన్ని కులాల పేర్లను పెట్టి వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన పార్టీపై విమర్శలు చేసేందుకు కొన్ని కులాల పేర్లను పవన్ కల్యాణ్ పార్టీకి అంటించేశారు. పవన్  కళ్యాణ్  ది  కాపు  జనసేన  కాదు...కమ్మ  జనసేన అని ఎద్దేవ చేశారు.నాదెండ్ల   డైరెక్షన్  లో  నడిచేది  కమ్మ  జనసేన అని,పవన్  నడిపేది   కమ్మ  జనసేన,అని కాపులు  పవన్  ను   ఓన్  చేసుకునే  పరిస్థితి  లేదని విశాఖలో మీడియాతో వ్యాఖ్యానించారు. 


జనసేనను సామాజికవర్గ పరంగా టార్గెట్ చేసిన వైఎస్ఆర్‌సీపీ


నిజానికి జనసేన పార్టీ కాపులదని పవన్ కల్యాణ్ ఎప్పుడూ చెప్పలేదు. కుల, మత రహరిత రాజకీయాల కోసమే తాను వచ్చానని చెబుతూ ఉంటారు. ఓ కులాన్ని ఓన్ చేసుకుంటే.. రాజకీయంగా లాభపడి ఉండేవడినని చెబుతూ ఉంటారు. ఓ కులంపై ద్వేషం చూపించడం.. తన కులంపై అభిమానం చూపించడం..లేదా వర్గ శత్రువుగా ప్రకటించడం వంటి వాటికి తాను వ్యతిరేకమని చెబుతూ ఉంటారు. అయితే వైఎస్ఆర్‌సీపీ రాజకీయ వ్యూహంలో మాత్రం పవన్ కల్యాణ్‌ను ఓ సామాజికవర్గ నేతగా చూపించి విమర్శలు చేయాలన్న విధానం పెట్టుకున్నట్లుగా ఉన్నారు. పవన్ కల్యాణ్‌ను ఎప్పుడు విమర్శించాల్సి వచ్చినా  పవన్ కల్యాణ్‌ సామాజికవర్గం కేంద్రంగానే విమర్శలు చేస్తూ ఉంటారు. 


కుల, మత రహిత సమాజమే తన లక్ష్యమని పవన్ ప్రకటనలు


స్వాతంత్య్ర దినోత్సన వేడుకల్లో  ప్రసంగించిన పవన్ కల్యాణ్ వైఎస్ఆర్‌సీపీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ ముందు వాళ్లు ఎలాంటి వేషాలు వేస్తారో తనకు తెలుసన్నారు. వైఎస్ఆర్‌సీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన గుడివాడ అమర్నాథ్ ప్రధాని మోదీ దగ్గర వేషాలు వేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అసలు పవన్ కల్యాణ్‌ బీజేపీతోనే ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రజాసమస్యలపై ప్రశ్నించినా  వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం ఆయనను కుల సమీకరణంలోనే విమర్శిస్తూంటారు. అయితే ఇప్పుడు మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం మరింత తీవ్రంగా ఉన్నాయి. 


జనసేనపై కులం ముద్ర వేయడమే వైఎస్ఆర్‌సీపీ వ్యూహమా ?


వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. అయితే ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని ఎప్పుడూ ప్రకటించలేదు. అలాగని ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు కానీ ఆ పార్టీతో కలిసి పని చేయడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ 2014 నాటి కూటమి టీడీపీ - బీజేపీ - జనసేన ఒకటవుతాయని .. అదే జరిగితే ఏపీ అధికార పార్టీకి ఇబ్బందేనని విశ్లేషణలు వస్తున్న సమయంలో పవన్ కల్యాణ్‌ ను వైఎస్ఆర్‌సీపీ సామాజికవర్గ పరంగా టార్గెట్ చేయడం రాజకీయవర్గాల్లో కలకలంరేపుతోంది.