మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. 6 నెలల లోపు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో అన్ని పార్టీల దృష్టి మునుగోడుపై పడింది. ముఖ్యంగా ఇక్కడ గెలుపు కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్య కావడంతో ఎలాగైనా ఇక్కడ గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది. గెలుపు కోసం అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని ఆలోచిస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో కాంగ్రెస్ నేతలు ఈ సాయంత్రం సమావేశం కానున్నారు. మునుగోడులో ఉప ఎన్నిక జరిగితే తమకు మద్దతు ఇవ్వాలని కోరే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 


గతంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో కోదండరాంకు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు రావడంతో.. ఆయన మద్దతు తీసుకుంటే మేధావులు, విద్యావంతులు తమ పార్టీకి ఓట్లు వేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతల ఆలోచనగా తెలుస్తోంది. కాంగ్రెస్ విజ్ఞప్తిపై కోదండరాం ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాగూర్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ వచ్చిన ఆయన రేపు మునుగోడు ఉప ఎన్నికల స్ట్రాటజీ కమిటీతో భేటీ అవుతారు. ముఖ్యంగా అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. 


ఇప్పటికే తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో ఆ పార్టీ నేత చెరకు సుధాకర్ మునుగోడు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. చెరకు సుధాకర్ కు టికెట్ ఇస్తే ఎప్పటినుంచో పార్టీలో ఉన్నవారి నుంచి అసంతృప్తి వ్యక్తం అయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పడింది. సొంత పార్టీ నేతల అసమ్మతితో కాంగ్రెస్ సతమతం అవుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలక వీడకపోవడంతో ఆయనను బుజ్జగించేందుకు పార్టీ సీనియర్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనబడటం లేదు. చండూరు బహిరంగ సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఉన్న కోమటిరెడ్డి.. మునుగోడు ప్రచారంలో పాల్గొనబోననే సంకేతాలు ఇవ్వడంతో.. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ అడుగు వెనక్కి తగ్గి.. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ గా బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 


అయినా వెంకటరెడ్డి కూల్ అయినట్లు కనిపించడం లేదు. తెలంగాణ పర్యటనలో ఉన్న పార్టీ వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాగూర్ మునుగోడు ఉప ఎన్నిక పైనే నాయకులతో ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్ లో ముగ్గురు నుంచి నలుగురు మునుగోడు సీటు ఆశిస్తుండంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికకు ముందు టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల దాడి మొదలైంది. బీజేపీకి అమ్ముడుపోయారంటూ మంత్రి జగదీశ్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే తాను అమ్ముడుపోయినట్టు నిరూపించాలని సవాల్‌ విసిరారు. అంతేకాదు జగదీశ్‌ రెడ్డి అవినీతి చిట్టా మొత్తం తన దగ్గర ఉందన్నారు రాజగోపాల్‌ రెడ్డి. విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక అంశం రాజకీయంగా కాకరేపుతోంది.