KCR : "మోసపోతే.. గోస పడుతం.. మాయమాటలు నమ్మితే దోపిడీకి గురవుతం వచ్చిన తెలంగాణను గుంట నక్కలు పీక్కు తినకుండా చూడాలె " అని సీఎం కేసీఆర్ వికారాబాద్‌లో ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఆగం కాకుండా బుద్ధి జీవులు కాపాడుకోవాలన్నారు. బీజేపీ ఎనిమిదేళ్లలో ఒక్క మంచిపని అయినా చేసిందా? అని ప్రశ్నించారు. సమైక్య పాలనలోని బాధలు మళ్లా రావద్దంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలన్నారు. మనకు ఉచిత కరెంటు ఉండాల్నా.. వద్దా? మీరే చెప్పండని కేసీఆర్ ప్రశ్నించారు. ఇవాళ పెట్రోల్ ధర ఎంత, గ్యాస్ సిలిండర్ ధర ఎంత? ఇవన్నీ ప్రశ్నించినందుకేనా కేసీఆర్ బస్సుకు బీజేపీ వోళ్లు జెండాలు అడ్డం పెట్టేది ? అని ప్రశ్నించారు.
కేంద్రం వల్లే పాలమూరు - రంగారెడ్డి ఆలస్యం
కేంద్ర ప్రభుత్వ తెలివితక్కువతనం వల్ల పాలమూరు – రంగారెడ్డి ఆలస్యమవుతోందన్నారు. కేంద్రానికి ఎనిమిదేండ్ల నుంచి వందల దరఖాస్తులు ఇచ్చినా పట్టిచ్చుకోలని.. ఇప్పుడు ప్రధానమంత్రే మనకు శత్రువు అయిండని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్డంకులెదురైనా పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగు నీళ్లందిస్తామన్నారు. ప్రధాని ప్రసంగంలో పస ఏమీ లేదు. నెత్తికి రుమాలు కట్టి గాలి మాటలు చెప్పిండని.. దేశ ప్రగతి రోజురోజుకూ దిగజారుతోందని విమర్శించారు. కేంద్రంలో కూడా రాష్ట్రాల సంక్షేమం చూసే ఉత్తమ ప్రభుత్వం రావాలన్నారు.
దేశంలో ఇంకెక్కడైనా తెలంగాణ పథకాలు అమలవుతున్నాయా?
ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమం అందిస్తున్నామని కేసీస్పష్టం చేశారు. ఒంటరి మహిళలు, వృద్ధులకు, భర్తలు చనిపోయిన ఆడవారికి గతంలో కేవలం 200 రూపాయల పెన్షన్ దక్కేదని, ఇప్పుడు రూ.2016 టంచన్‌గా ప్రతినెలా 36 లక్షల మందికి అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు. వికారాబాద్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ‘‘గతంలో ఇచ్చిన హామీ ప్రకారం, 57 ఏళ్లు పైబడిన వారికి కూడా పెన్షన్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాం. 10 లక్షల పెన్షన్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు, దుకాణాలకు, ఇళ్లకు 24 గంటలూ అత్యుత్తమ విద్యుత్ అందించే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. మంచి నీళ్ల బాధ పోయింది. కరెంటు బాధ పోయింది. సంక్షేమం చేసుకుంటున్నం. దివ్యాంగులకు కూడా నెలకు రూ.3016 ఇచ్చి ఆదుకుంటున్నాం. ఆడపిల్లల పెళ్లికి కులమతాలతో సంబంధం లేకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీంలతో ఆదుకుంటున్నాం. ఆస్పత్రులలో ఎలా ప్రసవాలు జరుగుతున్నాయో, వారికి కేసీఆర్ కిట్‌లు ఎలా అందిస్తున్నామో అందరికీ తెలుసు. ఇవి మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేవని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణలో కలపాలంటున్న కర్ణాటక ప్రజలు
కర్ణాటక ప్రజలు తమను తెలంగాణలో కలిపేయండి లేదా తెలంగాణలోని పథకాలను అమలు చేయాలని ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి అడుగుతున్నారు. తాండూరు వెళ్తూ ఉండే వాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. గతంలో రైతులు నీళ్లు, కరెంటు లేక.. హైదరాబాద్ వచ్చి కూలీలుగా, ఆటోరిక్షావాలాలుగా పనిచేసేవారు. కానీ ఈరోజు పల్లెప్రగతి కార్యక్రమాలతో రైతాంగం అంతా ధీమాగా ఎకరానికి రూ.10 వేల రూపాయల పంట పెట్టుబడి తీసుకుంటున్న ఒకే ఒక రైతు ఇండియాలో తెలంగాణ రైతు. రైతులకు ఉచిత కరెంటే కాదు, ప్రాజెక్టులు ఉన్న చోట ఉచితంగా నీరు అందిస్తున్నామని కేసీఆర్ గుర్తు చేశారు.