Congress In Telugu States :  కాంగ్రెస్ పార్టీక జవసత్వాలు కల్పించడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి ప్రారంభించారు. కాంగ్రెస్‌కు తమిళనాడులోనూ పెద్దగా బలం లేదు. కానీ అక్కడ డీఎంకేతో కూటమిలో కలిసి ఉంది. అందుకే అధికార కూటమిలో భాగంగా ఉంది . అయితే రాహుల్ గాంధీ పర్యటన తమిళనాడు కాంగ్రెస్‌లో జోష్ నింపింది. రాహుల్ వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు నడుస్తున్నారు. అదే ఊపును తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటుందని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలోనూ భారత్ జోడో  యాత్ర సాగనుంది. ఇందులో కోసం రెండు తెలుగు రాష్ట్రాల నేతుల భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీని మళ్లీ పూర్తి స్థాయిలో రంగంలోకి తేవాలని పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. 


ఏపీలో నాలుగు రోజులు.. వంద కిలోమీటర్ల మేర పాదయాత్ర !


భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7 నుంచి 148 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 68 లోక్ సభ స్థానాలు, 203 అసెంబ్లీ స్థానాల మీదుగా 3571 కిలోమీటర్లు దూరం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగుతుంది. ఆంధ్రప్రదేశలో 4 రోజుల పాటు రాయదుర్గం, ఆలూరు, ఆదోని, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 100 కిలోమీటర్లు సాగుతుందిఈ యాత్రను జయప్రదం చేయటం కోసం రాష్ట్ర సమన్వయకర్త గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డీ తులసి రెడ్డిని నియమించారు.  పాద యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు నిర్ణీత సమయాలలో, ప్రదేశాల్లో అటు ప్రజలను, ఇటు కాంగ్రెస్ శ్రేణులను కలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. సరైన నేతలు కూడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఏకంగా నాలుగు రోజుల పాటు పాదయాత్ర చేస్తున్నారు వైఎస్ఆర్‌సీపీకి వెళ్లిపోయిన  ఓటు  బ్యాంక్‌ను తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంది. అయితే రాహుల్ పాదయాత్రను ఉపయోగించుకుని పార్టీని బలపరిచే నేతలు లేకపోవడమే కాంగ్రెస్‌కు ఇబ్బంది కరం. 


తెలంగాణలో 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల పాదయాత్ర !


భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో నిర్వహించే పాదయాత్ర రూట్‌మ్యాప్‌ దాదాపు ఖరారైంది. చివరి నిమిషంలో అనివార్యమైన మార్పులు జరిగితే తప్ప యథాతథంగా కొనసాగే రూట్‌ను మంగళవారం టీపీసీసీ విడుదల చేసింది. ఈ మ్యాప్‌ ప్రకారం అక్టోబర్‌ 24న రాహుల్‌ కర్ణా టకలోని రాయచూర్‌ నియో జకవర్గం నుంచి తెలంగాణలోని మక్తల్‌ నియోజక వర్గంలోకి ప్రవేశిస్తారు.  అక్కడి నుంచి దేవరక్రద, మహబూబ్‌ నగర్, జడ్చర్ల, షాద్‌ నగర్, శంషాబాద్, ముత్తంగి, సంగారెడ్డి,జోగి పేట, శంకరంపేట, మద్నూరుల మీదుగా మహా రాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తారు. మొత్తం మీద 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల మేర రాహుల్‌ తెలంగాణలో పాదయాత్ర చేస్తారు. రోజూ ఓ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన నేతలు కూడా యాత్రలో పాల్గొంటారు. రాహుల్ పాదయాత్ర ఎక్కున రోజులు తెలంగాణలో ఉంటూడటంతో.. పార్టీకి పునరుజ్జీవం తెచ్చేందుకు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాహుల్ భారత్ జోడో యాత్రపేరుతో తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు నిర్వహిస్తోంది. ఆ వేడి భారీగా పెంచి రాహుల్ యాత్ర తెలంగాణకు వచ్చే సరికి.. కాంగ్రెస్ పార్టీని ఓ రేంజ్‌కు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నేతలు పని చేస్తున్నారు. 


తెలంగాణపైనే ఎక్కువ ఆశలు !


ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందన్న  నమ్కం లేదు. కానీ తెలంగాణపై మాత్రం ఆ పార్టీకి ఆశలున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆదరించాలని పదే పదే ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. రాహుల్ గాంధీకి తెలంగాణలో ఆదరణ ఉంటుందని.. ఆయన పాదయాత్ర తర్వాత పరిస్థితులు మారిపోతాయన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అందుకే భారీగా చేరికలకూ ప్రాన్ చేసుకుంటున్నారు. రాహుల్ టూర్.. కాంగ్రెస్ ను పార్టీ బలోపేతం చేసుకోవడానికి వచ్చిన అతి పెద్ద అవకాశంగా  తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.