బెజ‌వాడ లో టీడీపీ వెర్సెస్ వైసీపీ అన్న‌ట్లుగా రాజ‌కీయం మారింది. టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై జ‌రిగిన దాడి ఘ‌ట‌న త‌రువాత రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. వైసీపీని టార్గెట్ చేసుకొని టీడీపీ రాజ‌కీయం మెద‌లు పెట్టింది. అయితే ఈ వ్య‌వ‌హ‌రంలో పోలీసుల పాత్రపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. అదే స్దాయిలో తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ చుట్టూ కూడా వివాదాలు నెల‌కొంటున్నాయి. ఇటీవ‌ల కాలంలో టీడీపీపై వైసీపీ దూకుడు భారీగా పెంచింది. ప్ర‌ధానంగా టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి ఘ‌ట‌నతో పాటుగా, టీడీపీ నేత ప‌ట్టాభి ఇంటిపై దాడి ఘ‌ట‌న.. ఇప్పుడు తాజాగా టీడీపీ రాష్ట్ర నాయ‌కుడు చెన్నుపాటి గాంధీపై దాడి.. ఇలా వ‌రుస ఘ‌ట‌న‌లతో వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంది.


అటు టీడీపీ కూడా అదే స్థాయిలో ప్ర‌తిఘ‌టించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇక టీడీపీలో కూడా వైసీపీ నేత‌ల దాడుల‌ను తిప్పికొట్టేందుకు నాయ‌కులు ముందుకు రావ‌టం లేద‌నే అభిప్రాయం ఏర్ప‌డింది. స్వ‌యానా అధినేత చంద్ర‌బాబు చెన్నుపాటి గాంధీపై దాడి ఘ‌ట‌న త‌రువాత పార్టీ నాయ‌కులు ఆశించిన స్థాయిలో ప్ర‌తిఘ‌టించ‌లేదంటూ క్లాస్ తీసుకున్నారు. పార్టీకి విధేయుడిగా ఉన్న వ్య‌క్తి పై దాడి జ‌రిగితే క‌నీసం నాయ‌కులు కేసు వ్య‌వ‌హ‌రాన్ని ప‌ట్టించుకోకుండా, అధికార పార్టికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌ట్ట‌క‌పోటంపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


Also Read: మరో యువకుణ్ని బలి తీసుకున్న లోన్ యాప్‌- పల్నాడులో 20 ఏళ్ల కుర్రాడు సూసైడ్‌


దీంతో టీడీపీ నేత‌లు ఉన్న‌ఫళంగా వ్యూహ‌త్మ‌కంగా వ్య‌వ‌హ‌రం న‌డిపించారు. పార్టీ కార్యాల‌యంలో ప్రెస్ మీట్ కు ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు చెందిన నాయ‌కులు హ‌జ‌రు అవుతార‌ని మీడియాకు స‌మాచారం ఇచ్చి, అప్ప‌టిక‌ప్పుడు ప్లాన్ మార్చారు. ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు  నిర‌స‌న‌కు దిగారు. పోలీసులు చ‌ర్య‌ల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌నలో టీడీపీ నేత‌లు వ్యూహత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికి అస‌లు టార్గెట్ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అనే ప్ర‌చారం ఉంది.


ఇటీవ‌ల కాలంలో టీడీపీ పై జ‌రిగిన దాడుల‌న్నింటిలో దేవినేని అవినాష్ పాత్ర ఉంద‌ని చెబుతున్నారు. టీడీపీ కేంద్ర పార్టీ కార్యాయ‌ంపై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌లో దేవినేని అనుచ‌రులు, సీసీటీవీ కెమేరాలకు చిక్కారు. అదే విధంగా పార్టీ నాయ‌కుడు ప‌ట్టాభి ఇంటి పై జ‌రిగిన దాడిలో కూడా దేవినేని అవినాష్ అనుచ‌రులు ఉన్న‌ట్లుగా పోలీస్ స్టేష‌న్ లో కేసు కూడా న‌మోద‌య్యింది. ఇప్పుడు చెన్నుపాటి గాంధీపై జ‌రిగిన దాడిలో కూడా దేవినేని వ‌ర్గానికి చెందిన అనుచ‌రులే కావ‌టంతో టీడీపీ నేత‌లు గుర్రుగా ఉన్నార‌ని అంటున్నారు. అయితే ఈ వ్య‌వ‌హ‌రంపై అటు వైసీపీ నేత‌లు కూడా అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీ నేత‌లు అన‌వ‌స‌రంగా రాజ‌కీయం చేస్తున్నార‌ని ఫైర్ అవుతున్నారు.


Also Read: Ambati Rambabu: టీడీపీకి దమ్ముంటే పోలవరంపై చర్చకు రావాలి - అంబటి రాంబాబు


మెత్తం మీద ఈ రెండు పార్టీల‌కు మ‌ధ్య వివాదానికి దేవినేని అవినాష్ సెంట‌ర్ గా నిలిచార‌నే ప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతుంది. దీంతో వ‌రుస వ్య‌వ‌హ‌రాలతో బెజ‌వాడ పాలిటిక్స్ హీట్ మీద న‌డుస్తున్నాయి.