YSRCP Politics :  ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు మంత్రుల్ని సీఎం జగన్ తొలగించబోతున్నారన్న సమాచారం బయటకు రావడం వైఎస్ఆర్‌సీపీలోనూ కలకలం రేపుతోంది. కేబినెట్ మీటింగ్‌లో సీఎం జగన్ మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కుటుంబంపై విమర్శలు చేస్తున్నప్పటికీ ఎవరూ మాట్లాడటం లేదని విపక్షానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తీరు మార్చుకోకుండా ఇద్దరు, ముగ్గురు మంత్రులపై వేటు వేస్తానని హెచ్చరించారు. అలా అనడమే కాదు తర్వాతి రోజు ఉదయమే ముగ్గురు మంత్రులపై నవంబర్‌లో వేటు అనే సమాచారం కూడా అనధికారికంగా బయటకు వచ్చింది. వారెవరు అన్న పేర్లు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఆ విషయం పక్కన పెడితే సీఎం జగన్ మంత్రుల నుంచి ఏం ఆశిస్తున్నారు ? మంత్రులు సీఎం జగన్ అంచనాలను ఎందుకు అందుకోలేకపోతున్నారు ? మార్చుకోవడానికి కూడా మంత్రులు సిద్ధపడటం లేదా ?


మంత్రుల వద్ద నుంచి దూకుడు కోరుకుంటున్న సీఎం జగన్!


ఎన్నికల మంత్రివర్గాన్ని సీఎం జగన్ గత ఏప్రిల్‌లోనే ఏర్పాటు చేసుకున్నారు. పూర్తి స్థాయి పొలిటికల్ లెక్కలతో కలిసి వచ్చే సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక న్యాయం చేశామని గొప్పగా ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే అంతా బాగుంది కానీ..  అంతకు ముందు ఉన్న కేబినెట్‌ ఓ రకమైన ఇమేజ్ తెచ్చుకుంది. దూకుడులో .. విపక్షానికి కౌంటర్ ఇవ్వడంలో మొదటి కేబినెట్‌లో మంత్రుల స్టైలే వేరు. కొడాలి నాని, పేర్ని నాని వంటి నేతలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడేవారు. సభ్యతో.. అసభ్యతో అనే దానితో సంబంధం లేకుండా విరుచుకుపడేవారు. కొత్త కేబినెట్‌లో వారికి చోటు దక్కలేదు. కొత్తగా వచ్చిన వారు ఆ దూకుడును అందుకోలేకపోయారు. విపక్షానికి సరైన రీతిలో కౌంటర్ ఇచ్చే మంత్రే లేకుండా పోయారు. ఇదే సీఎం జగన్‌ను అసంతృప్తికి గురి చేసింది. పదవులిచ్చినా బాధ్యతగా ఉండటం లేదని ఆయన అనుకునేలా చేసిందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. 


మంత్రుల్లో ఆ దూకుడు తగ్గిపోయిందా ? 


వైఎస్ఆర్‌సీపీకి ఓ ఇమేజ్ ఉంది. విధానాలపై విమర్శలు చేసినా వ్యక్తిగతంగా విరుచుకుపడటం ఆ పార్టీ స్టైల్. ఎవరేమనుకున్నా..  వారి తీరే అంత. అసెంబ్లీలో అయినా సరే వ్యక్తిగత దూషణలు కామన్. వాటిని జగన్ ప్రోత్సహిస్తూంటారని విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి వాటిని వైఎస్ఆర్‌సీపీ పట్టించుకోలేదు. అలా దూకుడుగా విపక్షానికి కౌంటర్ ఇచ్చే వారికి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుంది. కానీ ఎందుకో కానీ కానీ కొత్త కేబినెట్‌లో మంత్రులు అలాంటి మార్క్‌ను చూపెట్టడంలో విఫలమయ్యారు. ఈ విషయాన్ని పరోక్షంగానే ప్రస్తుత కేబినెట్‌లో మంత్రులు ఒప్పుకుంటున్నారు.  విపక్షానికి భయపడే మంత్రులు ఉంటే జగన్ వారిని తొలగిస్తారని.. పరిపాలనలో భాగంగా ఎలాంటి మార్పులైనా చేసుకునే అధికారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని మెరుగు నాగార్జున వ్యాఖ్యానించారు.  ప్రతిపక్షాలకు భయపడే మంత్రులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులకు భయపడే వాళ్లు రాజకీయాల్లో ఉండడం అనవసరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు భయపడే మంత్రులు ఎవరున్నారో వారికే తెలియాలన్నారు. అంటే మెరుగు నాగార్జున కూడా ఈ విషయంలో జగన్ అభిప్రాయంతో ఏకీభవించినట్లు అయింది. 



సీనియర్ నేతలు పెద్దిరెడ్డి, బొత్స సేఫ్ గేమ్ ఆడుతున్నారా ?


కేబినెట్‌లో అత్యంత సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  బొత్స సత్యనారాయణ. వారు చాలా విషయాల్లో స్పందించడం లేదు.  కారణం ఏమిటో తెలియదు కానీ విపక్షాలకు వారు తమ పరిధిలోని అంశాలకు కౌంటర్ ఇస్తారు. కానీ ఇతర విషాయలను పట్టించుకోరు. కానీ సీఎం జగన్ మాత్రం తన కుటుంబంపై విమర్శలు చేసినా ఘాటుగా స్పందించడం లేదని ఫీలవుతున్నారు. జగన్ అలా ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత కొంత మంది మంత్రులు స్పందించారు. బొత్స సత్యనారాయణ సాదాసీదాగా స్పందించారు. సీఎం భార్యను రాజకీయాల్లోకి తేవడం కరెక్ట్ కాదన్నారు. జోగి రమేష్ , మెరుగు నాగార్జున లాంటి వాళ్లు స్పందించారు. కానీ అంచనాలను మాత్రం అందుకోలేకపోయారు. 


విపక్షానికి భయపడటం నిజమేనా ?


విపక్షానికి కొంత మంది మంత్రులు భయపడుతున్నారన్న ప్రచారం వైఎస్ఆర్‌సీపీలో అంతర్గతంగా జరుగుతోంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సర్కార్ టీడీపీ పై ప్రతీకార ధోరణితో వెళ్తోందన్న  అభిప్రాయం ఉంది. రేపు తేడా వస్తే ... తమపైనా అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటే తాము తట్టుకోలేమన్న అభిప్రాయం కొంత మంది మంత్రుల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే కాస్త నెమ్మదిగా ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది. అందుకే జగన్ వారందర్నీ మళ్లీ ట్రాక్‌లోకి తేవాలంటే.. ఇద్దరు ముగ్గుర్ని మార్చాల్సిందేనని డిసైడయినట్లుగా చెబుతున్నారు. మరి ఈ హెచ్చరికలతో అయినా మంత్రులు కదులుతారా ? జగన్ ఆశిస్తున్న దూకుడును అందుకుంటారా ?