Congress backtracked on Diwali bombings: "దీపావళి అయిపోయింది అయినా బాంబులు పేలలేదేంటి సార్" అని జర్నలిస్టులు ప్రశ్న వేస్తే ఏంటి ర్యాగింగ్ చేస్తున్నారా అని .. చిరాకుపడి వెళ్లిపోయారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. సియోల్ పర్యటనలో ఉన్నప్పుడు హడావుడిగా అక్కడికి తీసుకెళ్లిన మీడియా ప్రతినిధులకు ఇంటర్యూ ఇచ్చి మరీ దీపావళికి బీఆర్ఎస్‌పై బాంబులు పేలుస్తామని ప్రకటించారు. దీంతో ఏదో ప్లాన్ తోనే ఆయన అన్నారని అనుకున్నారు. అందుకే బీఆర్ఎస్ అగ్రనేతల అరెస్టులు ఉంటాయి ఫిక్సపోయారు. కానీ కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్‌లో ఓ చిన్న పార్టీ విషయంలో ఏర్పడిన వివాదమే చిటపట పేలింది కానీ అసలు బాంబులు పేలలేదు. దీనికి కారణాలేమిటన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
రెడీ అయినా ఆగిపోయిన కాంగ్రెస్
నిజానికి బాంబులు వేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్నీ రెడీ చేసుకుంది. ఫార్ములా ఈ రేసు విషయంలో రూ. 55 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహణ కంపెనీకి రూ. 55 కోట్లు బదిలీ చేశారు. కనీసం కేబినెట్ అనుమతి తీసుకోలేదు. దీంతో ఇదో పెద్ద క్రైమ్ గా మారింది. హెచ్ఎండీఏ నిధులు కావడంతో ఆ శాఖ చూస్తున్న అధికారి అర్వింద్ కుమార్ .. తనను కేటీఆర్ నోటి మాట ద్వారా ఆదేశించడంతోనే బదిలీ చేశామని నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏసీబీకి విచారణకు అనుమతి ఇచ్చింది. ఇక కేటీఆర్ అరెస్టే మిగిలిందని అనుకున్నారు. కాళేశ్వరం విషయంలోనూ ఇంజినీర్లు అందరూ తమకేమీ సంబంధం లేదని అంతా కేసీఆర్ హరీషే చూసుకున్నాని వాంగ్మూలాలు ఇచ్చారు. దాంతో అక్కడా బాంబు వేయడానికి అవకాశం వచ్చిందని అనుకున్నారు. కానీ పూర్తిగా వెనుకడుగు వేశారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
కక్ష సాధింపులు అనుకుంటారని వెనుకడుగు వేస్తున్నారా?
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు అరెస్ట్ అయ్యారు. ఆయన పడినన్ని వేధింపులు మరే నేత పడి ఉండరు. కానీ అధికారం అందిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. అయితే ఇప్పుడు అన్ని రకాల నివేదికలు రెడీ అయ్యాయని తప్పులు చేసినట్లుగా సాక్ష్యాలతో సహా దొరికిపోయారని పొంగులేటి చెప్పారు. అందుకే అరెస్టులు ఖాయమనుకున్నారు. కానీ ముందడుగు పడలేదు. పామ్ హౌస్ కేసు వల్ల కక్ష సాధింపులు అనుకుంటారన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఆగిపోయిందని కొంత మంది అంచనా వేస్తున్నారు.
ఐదో తేదీన రాహుల్ గాంధీ సంవిధాన్ సమ్మాన్ పేరుతో నిర్వహించబోతున్న సమావేశానికి వస్తున్నారు. ఆయన కులగణన సమావేశంపై ప్రజల్ని చైతన్యం చేయడానికి ఆ కార్యక్రమంపేరుతో దేశమంతా తిరుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన చేపడుతున్నందున డైవర్ట్ కాకుండా.. రాహుల్ గాంధీ టూర్ తర్వా బాంబులు పేల్చాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. పొంగులేటి సమయానుకూలంగా పేలుతాయని చెబుతున్నారు. అంతకు ముందు ఆయన దీపావెళి అని డెడ్ లైన్ పెట్టారు. ఆ సమయానుకూలం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేయబోతోందని అనుకున్న వారికి మాత్రం నిరాశే మిగిలింది.