Telangana Government Key Announcement On Indiramma Houses: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతమైందని ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivasreddy) అన్నారు. లబ్ధిదారుల కోసం ఓ యాప్ డిజైన్ చేశామన్న ఆయన.. 4 దశల్లో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం ఉంటుందని.. సొంత స్థలం ఉన్న వారికి దశలవారీగా రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇంటి యజమానిగా మహిళలను ఎంపిక చేస్తున్నామని చెప్పారు. '5, 6 తేదీల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని యాప్ తెలుగు వెర్షన్ ఉండేలా ఏర్పాట్లు చేశాం. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యే వరకూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత వరకూ వాడుకునేలా చర్యలు చేపట్టాం. తెలంగాణలో ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. తొలి విడతగా నియోజకవర్గానికి 3,500 - 4,000 ఇళ్లను మంజూరు చేయబోతున్నాం. వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లకు తగ్గకుండా నిర్మిస్తాం.' అని మంత్రి స్పష్టం చేశారు.
'అదే ఫైనల్'
15 రోజుల్లొ గ్రామ కమిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి ఆ వెంటనే జాబితాల ఖరారు చేస్తామని.. ఇది నిరంతర ప్రక్రియని మంత్రి పొంగులేటి చెప్పారు. 'గ్రామాల‌్లో ఇందిరమ్మ కమిటీల ఎంపికే ఫైనల్. ఇండ్లు మహిళల పేరిటే మంజూరు. లబ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నాం. నిరుపేదలకు తొలి ప్రాధాన్యత. లబ్ధిదారుల ఎంపికలో ప్రత్యేక యాప్‌దే కీలకపాత్ర, అందుకే ఇంత సమయం పట్టింది
ఆధార్‌తో సహా అన్నివివరాలు యాప్‌లో పొందుపరుస్తారు. 4 రాష్ట్రాల్లోని ఇండ్ల నిర్మాణానికి సంబంధించి వివరాలు సేకరించి ముందుకు వెళ్తున్నాం. ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండవు, లబ్దిదారుల ఇష్టం మేరకు ఇల్లు నిర్మించుకోవచ్చు కనీసం 400 చదరపు గజాలు తగ్గకుండా లబ్దిదారుడు ఇల్లు నిర్మించుకోవాలి. పునాదికి రూ.లక్ష, గోడలకు రూ.1.25 లక్షలు, శ్లాబ్‌కు రూ.లక్షన్నర, పూర్తైతే రూ.లక్ష చొప్పున చెల్లిస్తాం. బ్యాంకు అకౌంట్ ద్వారానే చెల్లింపులు చేస్తాం. ఇళ్లల్లో తప్పనిసరిగా వంటగది, బాత్రూం నిర్మించుకోవాలి. ' అని పేర్కొన్నారు.
'తొలి విడతగా రూ.28 వేల కోట్ల ఖర్చు'
16 శాఖలకు చెందిన వారిని సమీకరించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. 'ప్రభుత్వం తరపున రూ.5 లక్షల సాయం ఇస్తాం. లబ్ధిదారులు ఆర్ధిక పరిస్దితి బట్టి ఇంకా కట్టుకోవచ్చు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన సుమారు 600 - 800 ఇండ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తాం. తొలి విడతగా సుమారు రూ.28 వేల కోట్ల వరకు ఖర్చు కావచ్చు. సుమారు రూ.7,740 కోట్లను ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్‌లో కేటాయించాం. నిధులను వివిధ మార్గాల ద్వారా సమీకరిస్తాం. పునాది పూర్తైన వెంటనే తొలివిడత నిధుల విడుదల, నిర్మాణాలు జరిగేలోగా మళ్లీ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరుగుతుంది. స్మార్ట్ కార్డుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక, అర్హులైన వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తే మంచిదే. గ్రామ కమిటీలదే తుది ఎంపిక. ఇండ్ల స్ధలాలు లేని వారికి 2వ దశలో స్ధలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 75 నుంచి 80 గజాల స్ధలాన్ని సమకూర్చి ఇస్తాం. ఎక్కడైనా కొత్తగా ఇందిరమ్మ కాలనీలు ఏర్పడితే కరెంట్, రోడ్లు, డ్రైనేజ్ తదితర మౌలిక వసతులను ప్రభుత్వమే సమకూరుస్తుంది.' అని మంత్రి స్పష్టం చేశారు.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణవ్యాప్తంగా 4.16 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మొదటిదశలో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కొన్ని రోజుల కిందట ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ, పట్టణ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్లకు లబ్దిదారులను ఎంపిక చేస్తారని తెలిసిందే. ఆ కమిటీలో సభ్యులు ఎవరు ఉంటారనేది కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే, చాలాచోట్ల కమిటీల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వీరు కమిటీల్లో లేకుండా చూడాలని స్థానిక కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. మున్సిపాలిటీల్లోనూ ఇంకా బీఆర్ఎస్‌కు చెందిన పాలకవర్గాలే ఉన్నాయి. కౌన్సిలర్లు కమిటీల్లో ఉండాలి. ఇందుకు కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవడం లేదు. ఈ వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది.