Asaduddin Owaisi compared the Waqf Bill in the case of TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు మాత్రమే  పని చేయాలని కొత్తగా నియమితులైన టీటీడీ బోర్డు చైర్మన్ బొల్లినేని రాజగోపాలనాయుడు మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో చెప్పారు. ఈ వ్యాఖ్యలపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. టీటీడీ బోర్డులో కేవలం హిందువుల మాత్రమే ఉండాలని కొత్త చైర్మన్ చెబుతున్నారని కానీ వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తుల్ని నియమించేలా బిల్లును ఎలా తెస్తారని ఆయన ప్రశ్నించారు. ఒక్క టీటీడీ బోర్డులో మాత్రమే కాదని అనేక హిందూ  సంస్థల్లో ఇతర మతస్తుల ప్రైవేశానికి అవకాశం ఉండదన్నారు. కానీ వక్ఫ్ బోర్డ్, వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమ్స్ కాని వారిని ఎందుకు పెట్టాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.    



అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్‌కు  బీజేపీ ధీటుగా సమాధానం చెప్పింది. హిందూత్వంలోకి ఘర్ వాపసీకి స్వాగతమని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.  హిందువుల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల స్థలాన్ని మీరు కొన్ని కమ్యూనిటీ సెంటర్లతో బాధ్యతారాహిత్యంగా పోల్చుతున్నారని ఆయన మండిపడ్డారు.   హిందువులు ఎవరు ముస్లింల పవిత్ర స్థలం *మక్కాలో మసీదు* లోఅడుగు పెట్టలేరు, కానీ మీరు తిరుమలలో ప్రవేశించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.  మీరు నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని  భక్తితోవిశ్వసిస్తే, హిందుత్వం నుండి వెనక్కి వెళ్లిన మిమ్మల్ని తిరిగి హిందూ ధర్మంలోకి “ ఘర్ వాప్సీకి “  ద్వారా స్వాగతిస్తామన్నారు. 



వక్ఫ్ బిల్లు అంశం ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారింది.పార్లమెంట్‌ సమావేశాల సందర్బంగా వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను ప్రవేశ పెట్టారు.  రతిపక్ష నేతల డిమాండ్‌ మేరకు కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం బిల్లుపై అధ్యయనానికి 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు.  ఈ కమిటీకి ఛైర్మన్‌గా జగదాంబికా పాల్‌ వ్యవహరించనున్నారు. కమిటీలో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించారు. ఇందులో ఉన్న అంశాలను మజ్లిస్ పార్టీ వ్యతిరేకిస్తోంది.