Investment In Gold And Diamond: ఒకప్పుడు, వజ్రాలతో పోలిస్తే ప్రజలు బంగారంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టేవాళ్లు. కొన్నేళ్లుగా డైమండ్స్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చాయి, వాటిలో పెట్టుబడులు ఏటికేడు పెరుగుతున్నాయి. ఈ రెండూ ఆభరణంగా మాత్రమే కాదు, ఆదాయపరంగానూ ఆకర్షణీయమే. పెట్టుబడి దృష్టితో మాత్రమే చూస్తే, వీటి మధ్య వ్యత్యాసం ఉంది.
భారతదేశంలో వజ్రాభరణాల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ఇటీవలి నివేదిక ప్రకారం, 2021లో, అన్ని రకాల ఆభరణాల మార్కెట్ విలువ $79 బిలియన్లు. ఇది, 2031 నాటికి $120 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. 2031 నాటికి, ఒక్క వజ్రాభరణాల మార్కెట్ విలువే 17 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అప్పటికి, బంగారు గనుల నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరుగుతుందని లెక్కగట్టారు. ఫలితంగా, బంగారు ఆభరణాలకు కూడా డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.
2023లో బంగారం డిమాండ్ 4% పెరిగి 4930 టన్నులకు చేరుకుంది, ఇది ఇప్పటి వరకు అత్యధికం. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, గత ఏడాది కూడా బంగారు ఆభరణాలకు డిమాండ్ తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత కారణంగా సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొనుగోలు చేశాయి.
బంగారం వర్సెస్ వజ్రం: దేనిని సులభంగా అమ్మొచ్చు?
మనం ఎప్పుడు ఏ పెట్టుబడి పెట్టినా, అవసరమైనప్పుడు అమ్మడం ద్వారా ఆ డబ్బును తిరిగి పొందగలమా లేదా అనేది ఆలోచించడం ముఖ్యం. బంగారానికి ఉన్న అతి పెద్ద ప్రత్యేకత ఏమిటంటే, దానిని అతి సులభంగా అమ్మొచ్చు. వజ్రాన్ని విక్రయించడం అంత ఈజీ కాదు. వజ్రం ధర కూడా స్థిరంగా ఉండదు. దీని ధర 4C (కట్, కలర్, క్యారెట్, క్లారిటీ) మీద ఆధారపడి ఉంటుంది. మీ దగ్గరున్న వజ్రం ప్రత్యేకతను అర్థం చేసుకుని, దానికి సరైన ధరను ఇచ్చే కొనుగోలుదారు కోసం వెతకాలి.
దేని విలువ చెక్కుచెదరకుండా పెరుగుతుంది?
శతాబ్దాలుగా బంగారం విలువైనదిగా చలామణీ అవుతోంది. ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో బలంగానే ఉంటుంది. అంటే.. 10-20 ఏళ్ల పాటు పుత్తడిపై పెట్టుబడి పెడితే మంచి లాభాలు కళ్లజూడొచ్చు. పసిడి మీ డబ్బును సురక్షితంగా ఉంచడంతోపాటు సంపదను కూడా పెంచుతుంది.
వజ్రాల ధర కూడా కాలక్రమేణా పెరుగుతుంది. కానీ, అది ఖచ్చితంగా ఉండదు. వజ్రాలతో రిస్క్ ఎక్కువ. మీకు ప్రత్యేకమైన ఆభరణాలపై ఆసక్తి ఉంటే, లేదా ఒక ప్రత్యేక సందర్భాన్ని గుర్తుంచుకునేలా పెట్టుబడి పెట్టాలనుకుంటే వజ్రం ఒక ఆకర్షణీయమైన ఆప్షన్. కానీ, దీర్ఘకాలంలో, వజ్రాలు బంగారం ఇచ్చినంత లాభాన్ని ఇవ్వలేవు.
కష్టకాలంలో మీకు దేని మద్దతు ఉంటుంది?
దేశంలో, ప్రపంచంలో యుద్ధం లేదా ఆర్థిక మాంద్యం వంటి కొన్ని అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడినప్పుడు, ప్రజలు తమ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి వివిధ రకాల మార్గాల్లో పెట్టుబడులు పెడతారు. అటువంటి సమయాల్లో స్వర్ణం ఎప్పుడూ నమ్మకమైన తోడుగా ఉంటుంది. కష్టకాలంలో మిమ్మల్ని వదలని పెట్టుబడి పసిడి. స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు లేదా బ్యాంకుల పరిస్థితి దిగజారినప్పుడు ప్రజలు గోల్డ్ వైపు చూస్తారు. ఎందుకంటే బంగారం ధర పెద్దగా తగ్గదు.
అదే సమయంలో, వజ్రం నమ్మదగినదిగా నిలబడలేదు. మార్కెట్‌లో అనిశ్చితి ఏర్పడినప్పుడు వజ్రాల ధర వేగంగా పడిపోతుంది. అంతేకాదు, మార్కెట్‌లో నకిలీ వజ్రాల సమస్య కూడా ఉంది. నకిలీ బంగారాన్ని కనిపెట్టినంత ఈజీగా నకిలీ డైమండ్లను కనిపెట్టలేము.
మార్పిడి విషయంలో ఏది సులభం?
'ఫంగబిలిటీ'ని కూడా ఇక్కడ చూడాలి. బంగారంలో ఉన్న మరో ప్రత్యేక గుణం ఇది. మీ బంగారాన్ని ఆభరణాలు లేదా నాణేల రూపంలోకి మార్చుకోవచ్చు. ఈ సౌలభ్యం వజ్రాల విషయంలో లేదు. ప్రతి వజ్రం దానికదే ప్రత్యేకం. రంగు, కట్, క్లారిటీ, క్యారెట్ (4C) భిన్నంగా ఉంటాయి. కాబట్టి, మీ వజ్రాన్ని ఏ ఇతర వజ్రంతోనూ మార్చుకోలేరు.
అసలైనది ఏది?
బంగారం, వజ్రం రెండూ విలువైనవే. కానీ, బంగారం ఎప్పుడూ సహజంగానే దొరుకుతుంది. ఇప్పటివరకు ఎవరు కూడా దీనిని కృత్రిమంగా తయారు చేయడంలో సక్సెస్ కాలేదు. ప్రతి బంగారపు ముక్క కచ్చితంగా ఏదోక గని నుంచి బయటకు వచ్చిందే.
వజ్రాల విషయంలో ఇలా లేదు. ప్రస్తుతం ప్రయోగశాలలో వజ్రాలు కూడా తయారవుతున్నాయి. ఈ వజ్రాలు సహజ వజ్రాల కంటే ఎక్కువ మెరుపుతో మెరుగ్గా ఉంటాయి. అంతేకాదు, నిజమైన వజ్రాలను గనుల నుంచి తవ్వి తీయడం కంటే నకిలీ వజ్రాలను తయారు చేయడం చాలా చౌక. దీనిని బట్టి, స్వచ్ఛమైన బంగారాన్ని వజ్రం కంటే చాలా అరుదైనది లెక్కించాలి.
వజ్రం అమ్మితే దాని ధర వస్తుందా?
వజ్రాభరణాలు కొనేటపుడు ఇది ప్రతి ఒక్కరిలో తలెత్తే ప్రశ్న. వాస్తవానికి, వజ్రాన్ని విక్రయించినప్పుడు దాని పూర్తి ధర మీకు లభించదు. వజ్రాన్ని అమ్మడం ద్వారా దాని అసలు ధరలో 90% పొందడం కూడా కష్టమే. ఎందుకంటే, పసిడి తరహాలో వజ్రాలను కరిగించి కొత్త నగలు తయారు చేయలేరు. అంతేకాదు, వజ్రం ధర కూడా కొనుగోలుదారు ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లోని డిమాండ్ ఆధారంగా పుత్తడి ధర నిర్ణయమవుతుంది.
దేనిలో పెట్టుబడి పెట్టాలి?
మొత్తంగా చూస్తే, బంగారంలో పెట్టుబడి మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది. మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, డైమండ్ కూడా మంచి ఆప్షన్ అవుతుంది. పెట్టుబడి పెట్టే ముందు కచ్చితంగా ఆర్థిక సలహాదారు లేదా లోహాల నిపుణుడి సలహా తీసుకోండి. 'abp దేశం' సమాచారం ఇస్తుందిగానీ, ఎలాంటి పెట్టుబడి సలహాలు ఇవ్వదు.
మరో ఆసక్తికర కథనం: పండుగ తర్వాత పసిడి రేట్ల పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ