Cm Revanth Reddy Comments In Narayanapeta Jana Jatara: ఆగస్ట్ 15లోపు ఆరునూరైనా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని.. అదే రోజు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తావా.? అంటూ సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy).. మాజీ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ కు సవాల్ విసిరారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ జన జాతర భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట జిల్లా మద్దూరులో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. 'రైతు రుణమాఫీ చేస్తే నా రాజీనామా కాదు.. మీ పార్టీ రద్దుకు సిద్ధంగా ఉండండి' అంటూ తన సవాల్ స్వీకరించాలని అన్నారు. 


'లోటు బడ్జెట్ లో రాష్ట్రం'


ఆగస్ట్ 15లోగా రుణమాఫీ చేసి తీరుతానని.. రేవంత్ రెడ్డి మాట ఇస్తే ఎలా ఉంటుందో నీ మామ కేసీఆర్ ను అడుగు అంటూ హరీష్ రావును ఉద్దేశించి సీఎం రేవంత్ అన్నారు. 'నేను సీఎంగా బాధ్యతలు తీసుకునే నాటికి రాష్ట్రంలో రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. పదవీ బాధ్యతలు చేపట్టిన 4 నెలల్లోనే నీ మామ చేసిన రూ.లక్షల కోట్ల అప్పులకు రూ.26 వేల కోట్లు కిస్తీలు చెల్లిస్తూ.. ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాం. దీనిపై లెక్కలతో సహా నీకు, నీ మామకు చూపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రుణమాఫీతో పాటు వచ్చే పంటకే వరికి రూ.500 బోనస్ ఇస్తాం' అని స్పష్టం చేశారు.


పదేళ్లలో  ఏం చేశారు.?


పాలమూరు నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చి పదేళ్లలో ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. 'కుర్చీ వేసుకుని పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పి ఫామ్ హౌస్ లో పడుకున్నారు. గతంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సుముఖంగా ఉన్నప్పటికీ మంత్రిగా ఉన్న డీకే అరుణ.. నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు రాకుండా ప్రాజెక్టులను అడ్డుకున్నది వాస్తవం కాదా.?. 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎంగా అవకాశం వచ్చింది. ఈ ఐదేళ్లు రాజకీయాలకతీతంగా జెండాలు, అజెండాలు పక్కన పెట్టి ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో దేశంతో పోటీ పడేందుకు సహకరించాలి.' అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.


నా జీవితాశయం అదే


పాలమూరు జిల్లా అభివృద్ధే తన జీవితాశయమని సీఎం రేవంత్ అన్నారు. ఇక్కడ తనకు ఎవరూ శత్రువులు లేరని.. తనకెవరూ పోటీ కాదని చెప్పారు.  ఎన్ని రూ.కోట్లు ఖర్చైనా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును నాలుగున్నరేళ్లలో పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. తమ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామని అన్నారు. ముదిరాజ్ లను బీసీ - డీ నుంచి బీసీ - ఏ గ్రూపులోకి, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తనకు సహకారం అందించాలని కోరారు. కేసీఆర్ కు ఓటేస్తే తిరిగి మోదీకే అమ్ముకుంటారని విమర్శించారు.


Also Read: KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు