ABP  WhatsApp

KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Venkatesh Kandepu Updated at: 23 Apr 2024 09:55 PM (IST)

Kaleshwaram Project: మెగా ప్రాజెక్టుల్లో కొన్ని లోపాలు ఉంటాయని.. అవి సహజమని కేసీఆర్ అన్నారు. మిడ్ మానేరుపై రాజగోపాల్ రెడ్డి ఓ ప్రాజెక్టు కడితే అది ఒక వాన కురిస్తే కొట్టుకుపోయిందని అన్నారు.

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

NEXT PREV

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని.. దానివల్ల భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. క్షుద్ర ఆలోచనలతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ర్పచారం చేస్తున్నారని అన్నారు. మెగా ప్రాజెక్టుల్లో కొన్ని లోపాలు ఉంటాయని.. అవి సహజమని అన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్యారేజ్ కట్టారని.. అది ఒక వాన కురిస్తే కొట్టుకుపోయిందని అన్నారు. అలాంటప్పుడు తాము దాన్ని రాద్ధాంతం చేయలేదని అన్నారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చి ఇంటర్వ్యూలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.


మేడిగడ్డను నేనే రిపేరు చేయిస్తా 


కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టులో రిపేరు చేయాల్సిన మూడు పిల్లర్లను రైతుల సాయంతో తానే మరమ్మతులు చేయిస్తానని కేసీఆర్ అన్నారు. 50 వేల మంది రైతులను తీసుకెళ్లి.. కాంగ్రెస్ నేతలు అడ్డొస్తే పండబెట్టి తొక్కుకుంటూ పోయి.. దాన్ని రిపేర్ చేయిస్తామని తాను మొన్ననే చెప్పానని అన్నారు. ప్రభుత్వం మొండికేసి మేడిగడ్డ బ్యారేజీకి రిపేరు చేయించకపోతే తామే ఆ పని చేస్తామని కేసీఆర్ చెప్పారు.


మొన్న గంగా నదిపై కడుతుంటే బ్రిడ్జి కూలిపోయిందని.. అమెరికాలో హోవర్ డ్యామ్ కూడా కూలిపోయిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఇలా మహానదులపై కట్టే ప్రాజెక్టులు భారీగా ఉంటాయి కాబట్టి.. చాలా సమస్యలు వస్తుంటాయని అన్నారు. వాటిని పరిష్కరించుకొని ముందుకు పోవాలని అన్నారు. అలాంటి క్రమంలోనే మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కూడా రాఫ్ట్ ఫౌండేషన్ కదిలిందని అన్నారు. మూతిలో 32 పళ్లు ఉంటాయి. ఒక్క పన్నుకు ఇబ్బంది వస్తే మిగతా పళ్లను నాశనం చేసుకుంటామా? అని కేసీఆర్ అన్నారు.


‘‘కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగమైన 150 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు, 200 కిలో మీటర్ల టన్నెళ్లు, భారీ సర్జ్ పూల్స్, 1500 కి.మీ కాలువలు, మిగతా బ్యారేజీలు, పిల్లర్లు, కాలువలపై కట్టిన వంతెనలు, పంపులు అన్నీ బాగానే ఉన్నాయి. ఒక మేడిగడ్డ బ్యారేజీలోనే ఏడో బ్లాక్ లో 11 పిల్లర్లు ఉన్నాయి. దాంట్లో రెండు పిల్లర్లకు ఎక్కువ క్రాక్ లు, మరో పిల్లర్ కు చిన్న క్రాక్ లు ఉన్నాయి. ఆ బ్లాక్ మొత్తానికి సింగిల్ రాఫ్ట్ ఉంటుంది. మొత్తం రాఫ్ట్ తీసేసి కొత్త రాఫ్ట్ కట్టినా రూ.400 కోట్లే అవుతుంది. మీరు ఆ చేయకపోయినా మీ పరువు పోతుంది. కేసీఆర్ ను బద్నాం చేయాలని దాన్ని వదిలేసినా.. ఆ ఒక్క రాఫ్ట్ మాత్రమే పోతుంది. మిగతాది అంతా అలాగే ఉంటుంది. కేసీఆర్ ఆనవాళ్లు తీసేస్తామని ముఖ్యమంత్రి అంటున్నాడు. అది మూర్ఖత్వానికి పరాకాష్ఠ అవుతుంది’’ అని కేసీఆర్ అన్నారు.



ఎన్నికలకు ముందే మేడిగడ్డ పిల్లర్లకు క్రాక్ లు వచ్చాయి. దీనిపై నేను అడిగి తెలుసుకున్నా. అంతకుముందు ఏడాది 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అదే సమయంలో కన్నేపల్లి పంప్ హౌస్ మునిగితే దాన్ని రిపేర్ చేసుకున్నాం. పర్యవేక్షణ కోసం ఈఎన్సీ ఓ అండ్ ఎం పోస్టు క్రియేట్ చేశాను. అక్కడున్న సీఈ కొన్ని సర్దుబాట్లు చేయాల్సి ఉంది. అది చేయకపోవడం వల్ల ఇసుక కుంగి రెండు మూడు పిల్లర్లలో క్రాక్ వచ్చింది- కేసీఆర్


‘‘మేడిగడ్డ బ్యారేజీకి 80 పైచిలుకు గేట్లు ఉంటాయి. గోదావరి వరద వచ్చినప్పుడు అన్ని గేట్లు ఎత్తుతారు. అయినా ఎగువన పంపుల నుంచి నీటిని ఎత్తిపోసుకుంటుంటారు. కేవలం సెప్టెంబరులో వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూసి ఉంచుతారు. బ్యారేజీ రెండు చివరల చెరో నాలుగు గేట్లు మాత్రమే తెరిచి ఉంచుతారు. నదీ ప్రవాహాన్ని బట్టి ఆ గేట్లుకూడా మూసేస్తారు.’’ అని కేసీఆర్ అన్నారు.

Published at: 23 Apr 2024 09:30 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.