CSK vs LSG IPL 2024  Lucknow Super Giants opt to bowl:  చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK)తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG)  టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. పిచ్‌పై బ్యాటింగ్‌ కష్టంగా ఉంటుందన్న అంచనాలతో టాస్‌ గెలిచిన లక్నో కెప్టెన్‌ రాహుల్‌... బౌలింగ్‌ ఎంచుకున్నాడు. చెన్నై సొంత మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగుతుండడంతో మైదానమంతా పసుపుమయంగా మారిపోయింది. ధోనీ నామస్మరణతో మైదానం మార్మోగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి లక్నోపై ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై భావిస్తోంది. గత మ్యాచ్‌లో క్వింటన్‌ డికాక్‌, కెప్టెన్‌ కె.ఎల్‌.రాహుల్‌  చెలరేగడంతో చెన్నైపై లక్నో విజయాన్ని అందుకుంది. ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రుతురాజ్‌ గైక్వాడ్‌ సేన తహతహలాడుతోంది. చెన్నైలో ఈ మ్యాచ్ జరుగుతుండడం... ధోనీ మెరుపులు మెరిపిస్తుండడంతో చెన్నైలోని చిదంబరం స్టేడియానికి అభిమానులు పోటెత్తనున్నారు. మైదానం మొత్తం పసుపుమయంగా మారనుంది. పాయింట్ల పట్టికలో నాలుగు స్థానంలో ఉన్న చెన్నై... అయిదో స్థానంలో ఉన్న లక్నో ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలోపైకి ఎగబాకాలని చూస్తున్నాయి.


హోంగ్రౌండ్‌లో చెన్నైతో కష్టమే
 చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. హౌంగ్రౌండ్‌లో చెన్నైను ఓడించడం  అంత తేలికైన విషయం కాదు. చెన్నై అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. హోంగ్రౌండ్‌లో చెన్నై ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లోనూ విజయాలు సాధించి ప్లే ఆఫ్‌కు చేరాలని చెన్నై వ్యూహాలు రచిస్తోంది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే రాణిస్తుండడం చెన్నైకు కలిసి వస్తోంది. లక్నోతో జరిగిన గత మ్యాచ్‌లో వీరిద్దరూ తడపడడం ఆ  జట్టుకు కలిసి వచ్చింది. ఈసారి  లక్నోకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గెలవాలని చెన్నై పట్టుదలతో ఉంది. అయితే ఓపెనర్ రచిన్ రవీంద్ర ఫామ్ చెన్నైను ఆందోళన పరుస్తున్న వేళ  అజింక్యా రహానేని చెన్నై ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది. ఇప్పుడు రుతురాజ్‌  వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఓపెనర్‌గా రుతురాజ్‌ మూడుసార్లు 50కుపైగా పరుగులు సాధించాడు. రుతురాజ్‌ మళ్లీ ఓపెనర్‌గా వస్తాడా.. లేక వన్‌డౌన్‌లోనే కొనసాగుతాడా అన్నదానిపై స్పష్టత లేదు. రవీంద్ర జడేజా కూడా టచ్‌లోకి రాగా... మొయిన్ అలీ, MS ధోనీ చివర్లో ధాటిగా ఆడుతున్నారు. లక్నోతో మ్యాచ్‌లో మరోసారి బ్యాటర్లు మెరవాలని చెన్నై కోరుకుంటోంది. చెన్నై బౌలింగ్ బలంగా ఉంది. మతీషా పతిరాణ మెరుగ్గా రాణిస్తున్నాడు. దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్‌లు కూడా ఫామ్‌ అందుకుంటే లక్నోకు కష్టాలు తప్పవు. జడేజా బౌలింగ్‌లో ఇంకా రాణించాల్సి ఉంది. 



లక్నోకు బ్యాటింగ్‌ సమస్య
లక్నోను బ్యాటింగ్‌ సమస్య వేధిస్తోంది. క్వింటన్‌ డికాక్‌, రాహుల్‌, దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్‌లు ఉన్నా భారీ స్కోర్లు నమోదు చేయడంలో లక్నో తడబడుతోంది. పూరన్‌ భారీ ఇన్నింగ్స్ ఆడాలని లక్నో కోరుకుంటోంది. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగితే లక్నో బౌలింగ్‌ బలోపేతం అవుతోంది. పేసర్లు మొహ్సిన్ ఖాన్, యష్ ఠాకూర్ చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో మెరుగ్గానే రాణించారు. మాట్ హెన్రీ తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది. రవి బిష్ణోయ్ ఎలా రాణిస్తాడో చూడాలి.