మునుగోడు జోష్‌ కంటిన్యూ చేసేలా వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు టార్గెట్‌గా టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పక్కా వ్యూహంతో వెళ్తున్నారు. మంగళవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక విషయాలు చర్చించారు. బీజేపీ టార్గెట్‌గా మాట్లాడిన ఆయన... నేతలకు కీలక సూచనలు చేశారు. 


ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండబోవని సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పినప్పటికీ... ఎన్నికల మూడ్‌లోకి పార్టీ లీడర్లను తీసుకెళ్లారు. వచ్చే కాలమంతా ప్రజల్లోనే ఉండాలంటూ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ కార్యకర్తలంతా నిత్యం జనంలోనే ఉంటూ వారి సాదకబాదకాలు తెలుసుకోవాలని సూచించారు. 


ప్రతి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టాలను పార్టీ లీడర్లకు సూచించారు సీఎం కేసీఆర్. ఆత్మీయ సమ్మేళనాలు అంటే ఏదో వెళ్లి వచ్చామా అన్నట్టు కాకుండా ఒకరోజంతా అక్కడే ఉండేలా ప్లాన్ చేసుకోవాలని హితవు పలికారు. ఇందులో పార్టీ లీడర్లు, సానుభూతిపరులు, మేధావులు, సామాన్య ప్రజలు పాల్గొనాలన్నారు. 


ఆత్మీయ సమ్మేళనాలను ఏదో తూతూమంతంగా చేయడం వల్ల ప్రయోజనం లేదని... ప్రభుత్వం చేసిన మంచిని చెప్పాలన్నారు. వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు. ప్రతి పది గ్రామాలకు ఒక ఆత్మీయ సమ్మేళనం ఉండేలా ప్లాన్ చేసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. ఇందులో రాజకీయ చర్చలు కూడా విస్తృతంగా జరగాలని సూచించారు. 


గ్రామీణ, పట్టణ, నగర ప్రాంత నియోజకవర్గాలకు వేర్వేరుగా ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆయా నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి పనులు, ప్రజలకు జరిగిన లబ్ధితో కూడిన ప్రచార పత్రాలను ఎమ్మెల్యేలు తయారు చేసి ప్రజలకు పంచాలన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చేపట్టే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మాదిరిగానే ఈ ఆత్మీయ సమ్మేళనాలు జరగనున్నాయి. 


తాను కూడా జిల్లాల్లో విస్తృతంగా పర్యటించబోతున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. జగిత్యాల, నాగర్‌కర్నూలు, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని... ప్రజలతో మాట్లాడతానని తెలిపారు. వివిధ జిల్లాల్లో పార్టీ ఆపీస్‌లు కట్టినప్పటికీ ప్రారంభోత్సవాలు జరగలేదన్నారు. ఈ పర్యటనల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తూనే... అభివృద్ధి కార్యాలయాల్లో పాల్గొంటానన్నారు. మరికొన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను మంత్రి కేటీఆర్,  సెక్రటరీ జనరల్‌ కేశవరావు ప్రారంభిస్తారని తెలిపారు.