Jagan Reviews : వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలిచి చూపించాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే ఈ సారి ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో అన్ని నియోజకవర్గాల సమీక్షలు చేయాలనుకున్నారు. నియోజకవర్గానికి కనీసం యాభై మందితో ఈ సామావేశాలు ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించాలని అనుకుంటున్నారు. అదే సమయంలో టీడీపీ ముఖ్య నేతలు ఉన్న నియోజకవర్గాలపైనా ఓ కన్నేశారు. కుప్పం, అద్దంకి.. టెక్కలి వంటి నియోజకవర్గాల సమీక్షల్ని పూర్తి చేస్తున్నారు.
సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై జగన్ సమీక్షలు !
2019లో వైఎస్ఆర్‌సీపీ గాలిలోనూ గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో సీఎం జగన్ సమీక్షలు చేస్తున్నారు. నియోజకవర్గాల సమీక్షల్లో మొట్టమొదటగా కుప్పంనే ఎంచుకున్నారు. ఆ తర్వాత సమీక్షల్లో గ్యాప్ వచ్చినప్పటికీ.. వరుసగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గ నేతలను పిలుస్తున్నారు. కనీసం వారానికో నియోజకవర్గాన్ని అయిన జగన్ సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కుప్పంతో పాటు అద్దంకి నియోజకవర్గ సమీక్ష కూడా పూర్తయింది. బుధవారం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపుగా వంద మందికి ఆహ్వానం పలుకుతున్నారు.
టీడీపీ ముఖ్య నేతలెవరూ అసెంబ్లీకి రాకుండా వ్యూహం !
తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్నారని అనుకుంటున్ననేతల్ని అసెంబ్లీకి రాకుండా చేయాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలను మరోసారి ఓడించాలని.. భావిస్తున్నారు. దేవినేని ఉమ, బొండా ఉమ, యరపతినేని శ్రీనివాస్ సహా పలువురు నియోజకవర్గాలపై జగన్ వ్యక్తిగతంగా దృష్టి పెట్టారు. అక్కడ మళ్లీ గెలవడానికి ఏం చేయాలో ఎప్పటికప్పుడు సందేశాలు పంపుతున్నారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందర్నీ ఓడిస్తే.. సగం పని అయిపోతుందని.. మిషన్ 175కి చేరుకోవచ్చని జగన్ అంచనా వేస్తున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.
గడప గడపకూ మన ప్రభుత్వంపై ఎక్కువ దృష్టి !
ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని చెప్పి.. మరోసారి ఎన్నుకునేలా ..వైఎస్ఆర్‌సీపీకే ఓటు వేసేలా ప్రజలకు విజ్ఞప్తి చేసేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరో రెండు , మూడు నెలల్లో ప్రతి ఇంటికి పార్టీ నేతలు... ఎమ్మెల్యేలు.. ఇంచార్జులు తిరిగినట్లవుతుంది. అప్పుడు ప్రతి ఇంటికి ప్రభుత్వం వెళ్లినట్లవుతుంది. ఏపీ ఓటర్లలో సగం మందికిపైగా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని వారంతా తమకు ఖచ్చితంగా ఓటు వేస్తారని జగన్ నమ్ముతున్నారు. అందుకే అన్ని నియోజకవర్గాల్లో గెలుపుపై నమ్మకంతో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఉన్న నియోజకవర్గాల్లోనూ మెజార్టీ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా సక్సెస్ అవుతామన్న నమ్మకంతో వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ ప్రజల్లోకి వెళ్తోంది.