నాలుగేళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయనపై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. నిందితుడైన శ్రీను కుటుంబ సభ్యులు నేడు (అక్టోబరు 26) సీఎం జగన్‌ను కలవాలని ప్రయత్నించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ కు వినతిపత్రం అందజేయాలని వారు ప్రయత్నించగా, సీఎం ను కలిసేందుకు అపాయింట్ మెంట్ దక్కలేదు. కోడికత్తి కేసులో గత నాలుగుళ్లుగా తమ కుమారుడు శ్రీను రిమాండ్ ఖైదీగా ఉన్నాడని వారు వినతి పత్రంలో తెలిపారు. అందుకని శ్రీను బెయిల్‌ కోసం నిరభ్యంతర పత్రం (నో అబ్జెక్షన్ లెటర్) ఇవ్వాలని అధికారులను కోరారు. తమకు వయసు పైబడిందని, వయోభారంతో ఉన్న తమకు జీవనం కష్టంగా మారిందని అన్నారు. తమ పోషణ కష్టంగా మారినందున జాలి చూపాలని, శ్రీనుకు బెయిల్ వచ్చేలా నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కోరారు.


అంతకుముందు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి కోడికత్తి శ్రీను కుటుంబం చేరుకుంది. లాయర్ సలీమ్‌తో పాటు శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు క్యాంప్ ఆఫీసుకు వచ్చారు. నాలుగు సంవత్సరాలుగా శ్రీను రిమాండ్ ఖైదీగా ఇబ్బందులు పడుతుండడంతో తమ గోడు సీఎంకు చెప్పుకుందామని వచ్చినట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం చాలా ప్రయత్నించామని తెలిపారు.


ఓసారి బెయిల్ వచ్చినా వెంటనే రద్దు
ఈ కేసు విచారణలో ఉండగా మధ్యలో ఒకసారి బెయిల్ వచ్చింది. అయితే, విచారణ జరుపుతున్న ఎన్‌ఐఏ విజ్ఞప్తి మేరకు బెయిల్ రద్దు అయింది. తిరిగి శ్రీనివాస్‌ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇలా తన కుమారుడు నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగానే ఉండిపోవడంపై శ్రీనివాస్ తల్లి సావిత్ర ఆవేదన చెందారు. నాలుగేళ్లు అవుతోందని ఇప్పటికైనా తన కుమారుడిని బెయిల్‌పై విడుదల చేయాలని గతంలో కోరారు. సీఎం జగన్ స్పందించాల‌ని ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తన కుమారుడిని విడుదల చేయకపోతే ఈ వయసులో తమకు ఆత్మహత్య తప్ప మరోదారి లేదని కొద్ది రోజుల క్రితం ఆమె చెప్పారు.


సంచలనంగా దాడి
2019 ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన ఘటనల్లో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై కోడి కత్తితో దాడి కేసు ఒకటి. సరిగ్గా నాలుగేళ్ల కిందట 2018లో సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్‌ జగన్‌పై శీను అనే ఎయిర్ పోర్ట్ క్యాంటీన్‌లో పని చేసే యువకుడు  కోడి పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. దాడి జరిగిన వెంటనే  శీనును సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 


అప్పట్లో జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు  హాజరవ్వాల్సి ఉంటుంది. అందుకే ప్రతి గురువారం మధ్యాహ్నం కల్లా ఆయన పాదాయత్ర నిలిపివేసి.. వెంటనే విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ బయలుదేరేవారు. అలాగే 2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌  హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. వెయిటర్‌..సెల్ఫీ తీసుకుంటానంటూ వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్‌ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ భుజానికి కత్తి తగలడంతో గాయమైంది.  చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ హైదరాబాద్ చేరుకున్న తరవాత బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి వైద్యులు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. మూడు వారాల వరకూ రెస్ట్ తీసుకున్నారు. ఇది పెద్ద సంచలనం అయింది.