Tenali News: గుంటూరు జిల్లా తెనాలి జిల్లా ఆసుపత్రిలో వైద్య దంపతుల వ్యవహార శైలి పలు విమర్శలకు తావిస్తోంది. అసలే వైద్య సేవలు అంతంత మాత్రం అందిస్తున్నారని ప్రజలంతా భావిస్తుండగా.. ఇప్పుడు వైద్యులు సమయ పాలన పాటించడం లేదని అందరికీ తెలిసిపోయింది. వైద్యులు, వైద్య సిబ్బంది సరిగ్గా వస్తున్నారో లేరో తెలుసుకునేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తే... దాన్ని కూడా తప్పుడు రీతిలో వాడుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయత్నాలతో పనులు ఎగ్గొట్టడం.. కానీ ఎగ్గొట్టినట్లు తెలియకుండా చేయడంలో మితిమీరిన వేషాలు వేస్తున్నారు. అందుబాటులోకి వచ్చి ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ కొందరు వైద్యులు సరికొత్త అక్రమానికి తెరలేపారు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెనాలి ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న వైద్య దంపతులు ప్లాస్టిక్ వేలిముద్రల సాయంతో హాజరు వేస్తున్నట్లు పైఅధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఆసుపత్రికి రావడం లేదు. ప్లాస్టిక్ వేలి ముద్రలు చేయించి సెక్యూరిటీ సిబ్బందితో హాజరు వేయిస్తున్నారు. గైనకాలజిస్టుగా పని చేస్తున్న ఓ మహిళా వైద్యురాలు, ఈఎన్టీగా పని చేస్తున్న ఆమె భర్త ఇద్దరూ కొద్ది రోజులుగా ఇలా చేస్తున్నట్లు తేలింది. వైద్యుల మధ్య తలెత్తిన విభేదాలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌభాగ్యం విచారణ చేపట్టగా.. సీసీ కెమెరాల ఆధారంగా అక్రమ హాజరు నిజమోనని నిర్ధరణకు వచ్చారు. ఆసుపత్రిలో వైద్యులకు, ఇతర సిబ్బందికి వేర్వేరుగా బయోమెట్రిక్ యంత్రాలు ఉన్నాయి. వైద్యులు ఉపయోగించే యంత్రం వల్ల భద్రతా సిబ్బంది వేలి ముద్రలు వేస్తున్నట్లు సీసీ కెమెరాల్లో నమోదు అయింది.
సిబ్బందిని పిలిచి విచారించగా.. నిజం ఒప్పుకున్నారు. దీంతో సెక్యూరిటీ సూపర్ వైజర్ ఫణి, గార్డు పుల్లయ్యను విధుల నుంచి తప్పించారు. వైద్యులకు నోటీసులు జారీ చేశారు. పొరుగు సేవల విధానంలో పని చేసే సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బందిపై వేటు వేయడం కంటి తుడుపు చర్య అని.. వైద్యులను రక్షించేందుకే ఇలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బయోమెట్రిక్ హాజరుపై ప్రతీ నెల నివేదిక..
రాష్ట్ర సచివాలయంలో సుమారు 10 శాతం మంది ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాతే విధులకు హాజరవుతున్నట్టు తెలిసిందని.. అందుకే ప్రభుత్వ ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేసింది. సచివాలయంలోని అన్ని విభాగాల్లోనూ 80 శాతం హాజరు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించింది. ఈ విషయంపై ఇప్పటికే జారీ చేసిన నిబంధనలను ఇకపై తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఉద్యోగ విరమణ చేసిన, బదిలీ అయిన ఉద్యోగులకు సంబంధించిన వివరాలను బయోమెట్రిక్ పరికరాల నుంచి తొలగించాలని తెలిపింది. బయోమెట్రిక్ హాజరు నివేదికలను ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది. ఇందుకు ఆయా శాఖ కార్యదర్శి ఉద్యోగుల హాజరును పరిశీలించాలని పేర్కొంది.
మూడుసార్లు మాత్రమే ఆలస్య హాజరుకు అనుమతి
ప్రభుత్వ ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ ఏపీ సర్కార్ ఇప్పటికే మెమో విడుదల చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బయోమెట్రిక్ అటెండెన్స్ పై ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్-19 ఉద్ధృతి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్న కారణంగా బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేసినట్లు మెమోలో వెల్లడించింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులందరికీ ఐదు రోజుల పనిదినాల విధానాన్ని 2022 జూన్ వరకూ ప్రభుత్వం పొడిగించింది. ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధుల్లో ఉండాలని స్పష్టం చేసింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతిరోజూ ఉద్యోగుల హాజరును పరిశీలించాలని ఆయా శాఖల కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చింది. ఉదయం 10 గంటల 10 నిముషాల అనంతరం విధులకు హాజరైతే ఆలస్యంగా వచ్చినట్లు పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొంది. నెలలో మూడు సార్లు మాత్రమే ఆలస్య హాజరు అనుమతిస్తామన్నారు. ఆ తర్వాత వేతనాల్లో కోత విధిస్తామని స్పష్టం చేసింది.