Infosys Dividend: బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రి రిషి సునాక్ భార్యకు ఇండియన్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ నుంచి 126.61 కోట్ల రూపాయలు (15.3 మిలియన్ డాలర్లు) అందుతున్నాయి. ఎందుకంటే, దేశంలో రెండో అతి పెద్ద ఐటీ ఫర్మ్ ఇన్ఫోసిస్‌లో ఆమెకూ వాటా ఉంది. వాటాదారులకు డివిడెండ్ ప్రకటించిన కంపెనీ, వాటా లెక్క ప్రకారం బ్రిటన్ ప్రధాని సతీమణికీ డివిడెండ్ మొత్తాన్ని ఆమె ఖాతాలో ఈ నెల 27న (గురువారం) జమ చేయనుంది.
బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రి రిషి సునాక్ భార్య పేరు అక్షత మూర్తి. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె ఆమె. సెప్టెంబర్ చివరి నాటికి, అక్షతకు ఇన్ఫోసిస్‌లో 3.89 కోట్ల షేర్లు లేదా 0.93 శాతం వాటా ఉందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.
రూ.5,956 కోట్ల వాటా
BSEలో మంగళవారం ట్రేడింగ్ ప్రైస్ రూ. 1,527.40 వద్ద, అక్షత మొత్తం హోల్డింగ్ విలువ 5,956 కోట్ల రూపాయలు (721 మిలియన్ డాలర్లు).
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక్కో షేరుకు రూ.16 తుది డివిడెండ్‌ను వాటాదారులకు ఈ ఏడాది మే 31న ఇన్ఫోసిస్ చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) సంబంధించి, మధ్యంతర డివిడెండ్‌గా రూ.16.5ను ఈ నెలలో కంపెనీ ప్రకటించింది.
ఈ రెండు డివిడెండ్‌లు కలిపి ఒక్కో షేర్‌కు రూ. 32.5 చొప్పున అక్షతకు రూ. 126.61 కోట్లు ఆర్జించారు.
భారతదేశంలో ఆకర్షణీయమైన డివిడెండ్ చెల్లించే కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. 2021లో, ఒక్కో షేరుకు రూ. 30 డివిడెండ్ అందజేసింది. ఆ క్యాలెండర్ ఇయర్‌లో రూ.119.5 కోట్లను డివిడెండ్ రూపంలో అక్షత అందుకున్నారు.
బ్రిటన్ ప్రధాని పీఠం అధిరోహించిన సునాక్, ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టారు. 42 ఏళ్ల సునాక్ భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ మొదటి ప్రధాన మంత్రి. తొలి హిందూ వ్యక్తి. మొత్తం ఆసియా ఖండం నుంచి చూసినా బ్రిటన్ పగ్గాలు అందుకున్న తొలి వ్యక్తి సునాక్. అత్యంత పిన్న వయస్కుడైన బ్రిటన్ ప్రధాని. ఆ పదవి దక్కించుకున్న తొలి శ్వేతజాతీయేతరుడు.
మూర్తి గారి కుటుంబ వాటా
ఇన్ఫోసిస్ ఫైలింగ్స్ ప్రకారం, కంపెనీలో ప్రమోటర్లకు 13.11 శాతం వాటా ఉంది. ఇందులో మూర్తి కుటుంబానికి 3.6 శాతం (నారాయణ మూర్తికి 0.40 శాతం, ఆయన భార్య సుధకు 0.82 శాతం, కుమారుడు రోహన్‌కు 1.45 శాతం, కుమార్తె అక్షతకు 0.93 శాతం) వాటా ఉంది.
మిగిలిన ప్రమోటర్లలో సహ వ్యవస్థాపకుడు ఎస్. గోపాలకృష్ణన్, నందన్ నీలేకని, ఎస్.డి. శిబులాల్, వారి కుటుంబాలు ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.