తెలంగాణలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు రాసే సమ్మేటివ్ అస్సెస్‌మెంట్ (ఎస్‌ఏ-1) పరీక్షల షెడ్యూల్ రెండు జిల్లాల్లో మళ్లీ మారింది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాల పరీక్ష షెడ్యూల్‌ను మార్చుతూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన ఈమేరకు అక్టోబరు 25న ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారమైతే నవంబర్ 1 నుంచి 7 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఉప ఎన్నిక కారణంగా ఆ రెండు జిల్లాల్లో మాత్రం నవంబర్ 9 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇలా షెడ్యూల్ మారడం ఇది రెండో సారి. ముందు ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయని చెప్పిన అధికారులు ఆ తర్వాత 11 పేపర్లే ఉంటాయని ఉత్తర్వుల్లో జారీ చేశారు. తాజాగా ఇప్పుడు రెండు జిల్లాల పరీక్ష షెడ్యూల్‌ను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తుగా జిల్లా విద్యాధికారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడంవల్లనే ఈ విధమైన మార్పులు జరుగుతున్నట్లు విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎస్‌ఏ-1కు మాత్రమే 11 పేపర్లు..
తెలంగాణలో నవంబర్ 1 నుంచి జరుగనున్న సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ-1) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను అక్టోబరు 12న పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం 9, 10వ తరగతి విద్యార్థులకు ఆరు పేపర్లు ఉంటాయని అందులో పేర్కొన్నారు. అయితే అప్పటికే కొన్ని జిల్లాల్లో ఆ జిల్లా విద్యాధికారుల ఆదేశాల మేరకు 11 పేపర్లకుగాను ప్రశ్నపత్రాలను ప్రింటింగ్ చేశారు. అయితే ఆరు పేపర్లే ఉంటాయని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొనడంతో కొత్తగా మళ్లీ ప్రశ్నపత్రాలను రూపొందించాల్సి ఉంటుంది.
దీంతో వెనక్కి తగ్గిన అధికారులు నవంబర్ 1 నుంచి జరిగే ఎస్‌ఏ-1కు మాత్రం 11 పేపర్లకు పరీక్షను నిర్వహించేలా, ఎస్‌ఏ-2, ఎస్‌ఎస్‌సీ వార్షిక పరీక్షలకు మాత్రం 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించేలా అక్టోబరు 19న మళ్లీ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల తీరు, అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో గందరగోళం ఏర్పడింది. మారిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ఎస్‌ఏ-1 పరీక్షలను ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులు రాయనున్నారు. ఉదయం ఒక పేపర్, మధ్యాహ్నం మరో పేపర్‌కు పరీక్షలు నిర్వహించేలా అధికారులు షెడ్యూల్‌ను రూపొందించారు.
NCERT సూచనల వల్లే..
పదోతరగతి పరీక్ష విధానంపై సమీక్ష జరిపిన NCERT విద్యార్థులకు 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించడం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతోందని, వాటిని ఆరు పేపర్లకు కుదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీందో ప్రభుత్వం కూడా 6 పేపర్ల విధానానికే మొగ్గు చూపింది. అయితే నవంబర్1 నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఎస్‌ఏ-1 పరీక్షలు జరగనున్నాయి. ఎస్‌ఏ-1 పరీక్షలను 11 పేపర్లతోనే నిర్వహించి, వార్షిక పరీక్షలు మాత్రం 6 పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
:: READ ALSO ::
TS EAMCET: ఎంసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి, ఇంకా 15,447 సీట్లు ఖాళీనే!!
తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సులకు తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. సీట్ల కేటాయింపు తర్వాత రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 15,447 ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. తుది విడతలో కొత్తగా సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 28నాటికి కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
సీట్లకేటాయింపు, కళాశాలలవారీగా ఫీజుల వివరాల కోసం క్లిక్ చేయండి..
DOST Counselling: 'దోస్త్' స్పెషల్ కౌన్సెలింగ్, డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం!
ఇంజినీరింగ్‌లో సీట్లు పొందలేని వారి కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అక్టోబరు 25 నుంచి అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. డిగ్రీ కోర్సుల్లో మొత్తం 4 లక్షలకు పైగా సీట్లుండగా.. ఇప్పటి వరకు 1.5 లక్షల సీట్లు మాత్రమే నిండాయి. మిగిలిన సీట్లను ఈ విడతలో భర్తీచేయనున్నారు. ఇప్పటివరకు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు రూ.400 చెల్లించి తమ పేరు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..