Fake AP Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాను రాను ఎవరూ ఊహించని విధంగా మారిపోతున్నాయి. బండ బూతులు తిట్టుకుని , కుటుంబాలనూ సోషల్ మీడియాకు ఈడ్చుకుంటున్న పార్టీలు ..సోషల్ మీడియా మొత్తాన్ని ఫేక్ పోస్టులతో నింపేస్తున్నాయి. నిన్నామొన్నటి వరకూ ఫేక్ వార్తలతో పోస్టులు పెట్టి విమర్శలు చేయడం వరకే ఉండేది ఇప్పుడు పూర్తిగా ట్రెండ్ మారిపోయింది. ఓ పార్టీ సానుభూతిపరుల పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి కులపరమైన పోస్టులు పెట్టి రెచ్చగొడుతున్నారు. టీడీపీ, జనసేన దగ్గరవుతున్న సూచనలు కనిపించడంతో ఈ తరహా పోస్టింగ్‌లు ఎక్కువైపోయాయి. రెండు ప్రధాన సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు పోస్టింగులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. దీనిపై చివరికి నారా లోకేష్ కూడా స్పందించాల్సి వచ్చింది.
ఏపీలో ఫేక్ సోషల్ మీడియా పోస్టుల విప్లవం !
ఏపీలో రాజకీయ పరిస్థితులు ఊహించని విధంగా మారుతున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. సీఎం జగన్‌ను దింపేందుకు కలిసి పని చేస్తామని ప్రకటించారు. పొత్తులు పెట్టుకుంటామని చెప్పలేదు కానీ.. వారు కలిసి పోటీ చేస్తారని రాజకీయ పార్టీల్లో బలమైన అభిప్రాయం ఏర్పడింది. అప్పట్నుంచి ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే రాజకీయం ఎలా మారిపోతుందోనన్న చర్చ ప్రారంభమయింది. ఆ వెంటనే సోషల్ మీడియాలో.. ఈ రెండు పార్టీలకు అండగా ఉంటాయనుకున్న సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టేలా పెద్ద ఎత్తున పోస్టులు కనిపించడం ప్రారంభించాయి. ఈ పోస్టులు పెడుతోంది.. ఎవరో కానీ.. అందులో ఉన్న హ్యాండిల్స్ మాత్రం.. టీడీపీ లేదా జనసేన మద్దతు దారులన్నవట్లుగా ఉన్నాయి.
లోకేష్ పేరుతో పెట్టిన అకౌంట్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు!
టీడీపీ యువ నేత నారా లోకేష్ పేరుతో ఓ ట్విట్టర్ అకౌంటర్ కొత్తగా క్రియేట్ అయింది. అందులో రెండు సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టింగ్ పెట్టారు. ఇది నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ అకౌంట్‌ను క్రియేట్ చేసింది ఐ ప్యాక్ వాళ్లని.. వైసీపీ ఎంతకైనా దిగజారుతుందని..కానీ అవి జగన్‌ను ఓటమి నుంచి కాపాడలేవని హెచ్చరించారు. కాసేపటికే ఆ ట్విట్టర్ హ్యాండిల్ డీ యాక్టివేట్ అయింది. ఇలాంటివి చాలా అకౌంట్లు రెడీ చేశారని.. వైఎస్ఆర్‌సీపీ ఐ ప్యాక్ కార్యకర్తలు.. ఇలాంటివి ..రెండు సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టేలా క్రియేట్ చేస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు.
విపక్ష పార్టీలవన్నట్లుగా సోషల్ మీడియా పోస్టులు పెట్టి చిచ్చు పెట్టడం కొత్త రాజకీయం !
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత రాజకీయం వెర్రి తలలు వేస్తోంది. టీడీపీ సానుభూతి పరుల పేర్లు.. అలా కనిపించే ట్విట్టర్, ఫేస్ బుక్ హ్యాండిల్స్ ద్వారా కులపరమైన పోస్టులు పెడుతున్నారు. చూస్తే నిజంగానే టీడీపీ వాళ్లు పెట్టారేమో అనేలా ఉంటాయి. అలా పెట్టే పోస్టులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేదా చిరంజీవిని లేదా వారి సామాజికవర్గాన్ని అవమానించేలా ఉంటాయి. అప్పుడు రెండు పార్టీల మధ్య చిచ్చు ఏర్పడుతుందని.. వారి వ్యూహం అని టీడీపీ, జనసేన వర్గీయులు అంటున్నారు. సోషల్ మీడయా ద్వారా ఇలాంటివి చేస్తే వారి ఓట్లు కలవవని.. పొత్తు పెట్టుకున్న ప్రయోజనం ఉండదనేలా చేయాలనుకుంటున్నారని టీడీపీ వర్గాలంటున్నాయి.
సోషల్ మీడియా పోస్టుల కుట్రలన్నీ ఐ ప్యాక్‌వంటున్న టీడీపీ, జనసేన !
తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకుంటే వైసీపీ గడ్డు పరిస్థితి ఎదురవుతుందని అందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని.. టీడీపీ, జనసేన నమ్ముతున్నాయి. అందుకే అలాంటి పోస్టులపై పూర్తి స్థాయిలో నిజానిజాలను వెల్లడించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పదవుల కోసం .. అధికారం కోసం ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఏ మాత్రం వెనుకాడని పాలకులు ఉన్నారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఇలాంటి ట్వీట్లతో తమకు కానీ ఐ ప్యాక్‌కు కానీ సంబంధం లేదని వైెస్ఆర్సీపీ వర్గాలంటున్నాయి.