వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లను మార్చాలని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. మాజీ మంత్రులు కొంత మందిని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని ఆయన గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తు జరిపి జాబితాను ఓ కొలిక్కి తెచ్చినట్లుగా తెలుస్తోంది. మంత్రి పదవులు కొనసాగించినప్పటికీ బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్లకు జిల్లాల బాధ్యతలు కూడా అప్పగిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల బాధ్యతలు బొత్స సత్యనారాయణకు ఇచ్చే అవకాశం ఉంది.
రైతులు వరి సాగు తగ్గించి, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టండి : మంత్రి ధర్మాన
తూర్పుగోదావరి జిల్లాకు వైవీ సుబ్బారెడ్డి , పశ్చిమ గోదావరి జిల్లాకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కృష్ణ,గుంటూరు జిల్లాలకు కొడాలి నాని , పల్నాడు జిల్లాకు మోపిదేవి , ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు బాలినేని శ్రీనివాసరెడ్డి, చిత్తూరు, అనంతపురం జిల్లాల బాధ్యతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మరికొన్ని జిల్లాలకు ఎవరిని కో ఆర్డినేటర్లుగా నియమించాలన్నదానిపై కసరత్తు జరుగుతోంది. ఆ కసరత్తు పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలకు సెంట్రల్ ఆఫీస్ బాధ్యతలు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా ఉన్నారు. అక్కడి వ్యవహారాలన్నింటినీ కనుచూపుతో శాసిస్తున్నారు. అధికారులు కూడా ఆయన మాటే ఎక్కువగా వింటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను ఉత్తరాంధ్ర నుంచి తప్పించి పార్టీ కార్యాలయానికి పరిమితం చేస్తే ఆయన స్థాయి తగ్గినట్లే అవుతుంది. ఇటీవలి కాలంలో విజయసాయిరెడ్డికి వైఎస్ఆర్‌సీపీలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయన తిరుపతిలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ ఆయనను కలవడానికి వెళ్లలేదు. దీంతో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది.
మరో వైపు మంత్రి పదవులు కోల్పోయిన వారికి జిల్లా అధ్యక్ష పదవులు, జిల్లా డెలవప్‌మెంట్ బోర్డు చైర్మన్ పదవులు ఇవ్వనున్నారు. ఆ దిశగా కూడా కసరత్తు జరుగుతోంది. అన్ని పదవులను ఒకే సారి ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ పదవులను... జిల్లాలకు బాధ్యులను వీలైనంత త్వరగా భర్తీ చేసి... ఎన్నికల సన్నాహాలను ప్రారంభించుకోవాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్ సీపీ హైకమాండ్ ఉన్నట్లుా తెలుస్తోంది.