శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఇద్దరు మంత్రులకు సవాల్ కాలం ఎదురవుతున్నది. ఎనిమిది నియోజకవర్గాల కొత్త జిల్లాలో వచ్చే ఎన్నికల్లో విజయాలు సాధించడం ఇద్దరి ముందున్న లక్ష్యం. కొత్త పలాస డివిజన్లో ఇచ్ఛాపురం ప్రస్తుతం టీడీపీ చేతిలో ఉంది. డాక్టర్ అప్పలరాజు ఇంతవరకు పలాస నియోజకవర్గం దాటి తనదైన ముద్ర వేయలేకపోయారు. ఆయనకు పార్టీలోనే దువ్వాడ వర్గంతో కొంచెం వైరం ఉందన్నది అందరికీ తెలిసిందే. ధర్మాన ప్రసాదరావుకు అటువంటి సమస్య బహిరంగంగా లేదు. కాని, స్పీకర్ సీతారాంతో సంబంధాలు బయటకు కనిపించినంతగా లేవని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీపై పైచేయి సాధించే ముందు, సొంత పార్టీలో తమ వ్యతిరేకులపై ఎలా నెగ్గుకువస్తారోనని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటా, బయటా నెగ్గుకు రావాలంటే ధర్మాన, డాక్టర్ సీదిరి కలిసి సమన్వయంతో పనిచేయాలి. 


దువ్వాడతో దూరం దూరం


ఇంతకుముందు కృష్ణదాస్, అప్పలరాజు మధ్య అది లేదనే ఆరోపణలున్నాయి. కృష్ణదాస్ పెద్దరికాన్ని, ముఖ్యమంత్రి దగ్గర అతనికి ఉన్న గౌరవాన్ని గుర్తించి డాక్టర్ సీదిరి తన పరిధిలో పనిచేసుకుపోయారు. కృష్ణదాస్ దగ్గర ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బాగా చనువు సంపాదించుకున్నారు. ధర్మానతో దువ్వాడకు ఉన్న సంబంధాలు అంతంత మాత్రమే.! ఎం.పి.గా గత ఎన్నికల్లో దువ్వాడ పోటీ చేసినపుడు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగింది. ప్రతీ ఎన్నికల్లోనూ కాళింగ, వెలమ ఓటర్లలో.. వెలమలు టీడీపీ ఎం.పి. అభ్యర్థికి ఓట్లు వేస్తారనే ప్రచారం ఉంది. ఒక్క కిల్లి కృపారాణి ఎన్నికలోనే ఈ ఆరోపణ వినపడలేదు. 


ధర్మానకు నచ్చని ఆ దూకుడు


వ్యక్తిగతంగా దువ్వాడ దూకుడు ధర్మాన ప్రసాదరావుకు నచ్చదనే మాట వినిపిస్తోంది. డాక్టర్ సీదిరితోనూ దువ్వాడ సోదరులకు పొరపచ్చాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ఇద్దరు మంత్రులతోనూ దువ్వాడకు అంతంత మాత్రంగానే సంబంధాలున్నాయి. టెక్కలి ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని రాజకీయంగా అణచివేయాలని ముఖ్యమంత్రి జగన్ గట్టి పట్టుదలతో ఉన్నట్టు వైకాపా శ్రేణులు చెబుతుంటాయి. అందుకే ఎం.పి.గా ఓడిపోయినా దువ్వాడను జగన్ ఎమ్మెల్సీని చేశారు. దువ్వాడ.. అచ్చెన్న మీద పదునైన విమర్శలు చేస్తున్నారు. ఇది పార్టీలోని వైరి వర్గానికి పెద్దగా రుచించడంలేదు. ఈ వ్యాఖ్యల కారణంగా టెక్కలి, పలాసల్లో పార్టీ బలహీనపడుతోందని కొందరు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. 


సర్దుకుపోతారా... సాధిస్తారా?


మరోవైపు జిల్లాలో తిలక్ వర్గాన్ని అణచి వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదన ఉంది. ఇదిలా ఉండగా దువ్వాడకు గ్రానైట్ వ్యాపార సంబంధాలతో, జిల్లా గ్రానైట్ వ్యాపారుల సంఘంలో పట్టు సాధించారు. ప్రభత్వం దగ్గర ఆ సంఘం పనులు చేయించే బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని గ్రానైట్ క్వారీలపై ఉన్న కేసులను తీయించేందుకు కృష్ణదాస్ ద్వారా ప్రయత్నాలు చేశారని సమాచారం. ప్రస్తుత మంత్రులు ధర్మాన, అప్పలరాజుతో.. ముఖ్యమంత్రి జగన్‌తో నేరుగా సంబంధాలున్న దువ్వాడ ఎంతవరకు సర్దుకుపోతారనేదే ప్రశ్న. 


సీతారాంకు నిరాశ 


స్పీకర్ సీతారాంతో కూడా బయటకు కనిపించినంత మంచి సంబంధాలు ధర్మానకు లేవు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లో జిల్లా హెడ్క్వార్టర్లో అధికారులతో సమావేశాలు పెట్టి కృష్ణదాస్‌ను ఓవర్టేక్ చేసేందుకు తమ్మినేని ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. ఈసారి మంత్రి వర్గంలో స్థానం కోసం సీతారాం చాలా ప్రయత్నాలే చేశారనే ప్రచారం జరిగింది. స్పీకర్ వంటి అత్యుత్తమ పదవిలో ఆయన ఉన్నా, కాళింగులకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండు సామాజికవర్గంలోని కొందరు తెర మీదకు తెచ్చారు. కానీ, ముఖ్యమంత్రి జగన్.. సీతారాంను స్పీకర్గానే కొనసాగించాలని నిర్ణయించారు. సీతారాం కూడా చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాళింగుల్లో బలమైన వర్గం ధర్మానను ఎప్పుడూ వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో, వచ్చే ఎన్నికల్లో కొత్త జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పార్టీ విజయానికి ధర్మాన, డాక్టర్ సీదిరి అప్పలరాజులు ఏవిధంగా కృషి చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 


సీదిరి పనితీరుపై నేతల్లో డౌట్


జిల్లా వైకాపాలో కృష్ణదాస్, అప్పలరాజులు తమ నియోజకవర్గాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో పట్టు సాధించలేకపోయారు. ధర్మాన ప్రసాదరావుపై చాలామందికి ఆశలున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అతడికి మంచి పట్టుంది. డాక్టర్ సీదిరి.. ధర్మానకు తోడుగా ఉండడం తప్ప చేసేదేమీ లేకపోవచ్చు. జిల్లా పార్టీ నాయకత్వంలో ఏ మార్పులు జరిగినా చక్కదిద్దాల్సింది ధర్మానే. స్పీకర్, ఎమ్మెల్సీ తప్ప మిగిలిన వారితోనూ, పార్టీలోని గ్రూపులతోనూ ధర్మానకు మంచి సంబంధాలున్నాయి. ముఖ్యమంత్రి అంచనాలకు అనుగుణంగా ఆయన ఎంత వరకు విజయవంతమవుతారో వేచిచూడాలి. కేడర్ వరకు ధర్మాన పట్ల నమ్మకం ఉంది. లీడర్లలోనే ఎందరు నమ్ముతారో, కలిసివస్తారో వేచిచూడాలి. ప్రస్తుతానికి ధర్మానకు మంత్రి పదవి రావడంతో జిల్లా పార్టీలో మంచి ఊపు కనిపిస్తోంది.