Chiru Congress :   రాజకీయానికి నేను దూరం అయినా రాజకీయాలు మాత్రం తనకు దూరం కాలేదని చిరంజీవి డైలాగ్ చెప్పి ఒక్క రోజు గడవక ముందే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు గుర్తింపు కార్డు జారీ అయింది. 2027 వరకూ చెల్లుబాటు అయ్యేలా పీసీసీ డెలిగేట్‌గా కార్డును ఏఐసీసీ జారీ చేసింది. ఈ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితాను రెడీ చేసింది. ఆ ఓటర్ల జాబితాలో చిరంజీవి కూడా ఉన్నారు. అందుకే కార్డు జారీ అయినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు, కేంద్రమంత్రిగా పని చేశారు. 


ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి


2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంత కాలం క్రియాశీలకంగా ఉన్నప్పటికీ తర్వాత చిరంజీవి  పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యారు. రాజ్యసభ సభ్యునిగా సమావేశాలకూ వెళ్లలేదు. ఇందు కోసం అప్పట్లో రాజ్యసభ చైర్మన్ అనుమతిని తీసుకున్నారు. పదవి కాలం పూర్తయ్యే రోజు కూడా సభకు వెళ్లలేదు. తాను ప్రత్యక్ష రాజకీయాలను వదిలేశానని ఇటీవలే చిరంజీవి బహిరంగంగా ప్రకటించారు. అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ పొలిటికల్ డైలాగ్‌ను వదలడం.. అది వైరల్ అయిన మరుసటి రోజే ఏఐసిసి నుంచి డెలిగేట్ కార్డు మీడియాకు విడుదల కావడం యాధృచ్చికం కాదన్న వాదన వినిపిస్తోంది. 


వరుసగా సినిమాలు చేస్తున్న చిరు 


ప్రజారాజ్యం  పార్టీ పెట్టి రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకున్న  చిరంజీవికి.. పరిస్థితులు కలిసి రాలేదు. ఎన్నికల్లో భారీ విజయం లభించకపోవడంతో ఆయన వేగంగానే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తర్వాత కేంద్రమంత్రి అయ్యారు. కానీ ఏపీ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాలు.  రాష్ట్ర విభజన, జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం వంటి కారణఆలతో కాంగ్రెస్ పార్టీ పూర్తి బలహీనం అయిపోయింది . దీంతో చిరంజీవి కూడా కాపాడలేని పరిస్థితి.  ఆ సమయంలో  చిరంజీవి మళ్లీ తనకు అచ్చి వచ్చిన సినీ రంగంలోకి వెళ్లిపోయారు. వరుసగా సినిమాలు చేసుకుంటున్నారు. 


కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డు జారీ చేయడంపై స్పందిస్తారా !?


పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టడం.., ఆయనకు చెక్ పెట్టేందుకు ఇతర పార్టీలు చిరంజీవిని తమకో కలుపుకోవాలని ప్రయత్నిస్తూండటంతో చిరంజీవి రాజకీయ అడుగులపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. చిరంజీవి రాజకీయాల నుంచి విరమించుకున్నానని ప్రకటించారు కానీ.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. అలా చేసినట్లుగా ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ కారణంగానే తమ పార్టీలో ఉన్న ప్రస్తు. మాజీ ఎంపీలు.. కేంద్రమంత్రులు అందరికీ ఆయా రాష్ట్రాల వారీగా పీసీసీ డెలిగేట్ కార్డులు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై చిరంజీవి ఎలా స్పందిస్తారో తేలాల్సి ఉంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేస్తారో లేదో చూడాల్సి ఉంది.